మొన్న కేంద్రమంత్రి.. నిన్న ఎస్సీ కమిషన్.. జగన్‌తో అంటకాగుతున్నారా?
posted on Aug 25, 2021 @ 12:05PM
వాళ్లు వచ్చిన పనేంటి? చేస్తున్నది ఏంటి? వాళ్లను ఏపీకి రప్పించింది ఎందుకు? రాష్ట్రానికి వచ్చి వాళ్లు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? ఏపీ బీజేపీ బాధలు అన్నీఇన్నీ కావు. రాష్ట్రాంలో వైసీపీతో వార్‌కు దిగుతున్నారు. తమకు మద్దతుగా కేంద్రం నుంచి సహాయం కోరుతున్నారు. ఢిల్లీ నుంచి పలువురు పెద్దలను రప్పిస్తున్నారు. తీరా వచ్చాక.. మేముమేము ఒక్కటే అన్నట్టు వ్యవహరిస్తుండటంతో రాష్ట్ర బీజేపీ కంగుతింటోంది. వరుస పరిణామాలు ఏపీ బీజేపీకి తలనొప్పిగా మారుతున్నాయి.
మొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఏపీలో జన ఆశీర్వాద యాత్ర చేశారు. దాని లక్ష్యం కేంద్ర ప్రభుత్వ పథకాలను, పనితీరును వివరిస్తూ ఏపీలో బీజేపీని బలోపేతం చేయడం.. ప్రత్యర్థి పార్టీలను దెబ్బకొట్టడం. పెద్ద టార్గెటే పెట్టుకొని వచ్చిన కిషన్‌రెడ్డి.. చిన్న ప్రభావం కూడా చూపెట్టలేకపోయారని అంటున్నారు. ఏపీ సర్కారును పైపైన విమర్శలు చేసి.. అంతలోనే ఏపీ సీఎం జగన్‌రెడ్డి ఇంటికి కుటుంబ సమేతంగా వెళ్లి.. కడుపునిండా భోంచేయడం విమర్శల పాలైంది. బీజేపీ మంత్రి, వైసీపీ ముఖ్యమంత్రి ఆతిథ్యం స్వీకరించాక.. ఇక బీజేపీ-వైసీపీ దొందు దొందేననే ప్రచారం జరిగిపోయింది. ఇంత మాత్రానికి జన ఆశీర్వాద యాత్రతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గానీ, బీజేపీ గానీ సాధించింది ఏముందని అంటున్నారు. అదే తెలంగాణలో మాత్రం కిషన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడటం.. ఏపీలో మాత్రం సీఎం జగన్ ఆతిథ్యం స్వీకరించడం.. రెండిటినీ పోలిస్తే వైసీపీతో బీజేపీ అంటకాగుతోందనే విషయం అర్థమైపోతోంది.
తాజాగా, ఏపీలో జాతీయ ఎస్సీ కమిషన్ పర్యటన సైతం అలానే జరిగిందంటున్నారు. రమ్య మర్డర్‌పై బీజేపీ నేతల ఫిర్యాదు మేరకే కమిషన్ ఏపీలో పర్యటించింది. సాధారణంగా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం వారికి అనుకూలంగా ఉన్నవారినే ఇలాంటి కమిషన్లలో నియమిస్తుందని అంటారు. కొందరి విషయంలో ఇలాంటివి పునరావాస కేంద్రాలుగా మారాయనే ఆరోపణ కూడా ఉంది. ఆ విషయం పక్కనపెడితే.. తాజాగా జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రమ్య ఘటనపై విచారణకు వచ్చారు. అంటే, ఈ కేసులో ప్రభుత్వ స్పందన, తీసుకున్న చర్యలపైనా ఎంక్వైరీ జరుగుతుంది. ఏపీ పోలీసుల డైరెక్షన్‌లో విచారణ పూర్తి చేసేసి.. సర్కారుకు క్లీన్‌చీట్ ఇచ్చేసి.. పోలీసుల పనితీరుకు ప్రశంసలు కూడా ఇచ్చారు కమిషన్ సభ్యులు. ఆ తర్వాత సీఎం జగన్‌ను కలిసి.. శాలువా కప్పించుకున్నారు. ఇక్కడే తేడా వస్తోంది. ఇదే జాతీయ ఎస్సీ కమిషన్ అంతకుముందు రోజు తెలంగాణలోనూ పర్యటించింది. ఎమ్మెల్యే మైనంపల్లి దళిత బీజేపీ మహిళా నాయకులపై దాడి చేశారనే ఆరోపణపై విచారించింది. గాంధీ ఆసుపత్రిలోనూ ఎంక్వైరీ చేసింది. కానీ, ప్రగతిభవన్ వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలవలేదు. ఏపీలో మాత్రం అందుకు విరుద్దంగా తాడేపల్లి వెళ్లి సీఎం జగన్‌ను కలిసింది ఇదే జాతీయ ఎస్సీ కమిషన్.
మొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. నిన్న జాతీయ ఎస్సీ కమిషన్.. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రముఖులంతా సీఎం జగన్ ఆతిథ్యం స్వీకరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కేంద్రం ఏపీ సర్కారుతో అంటకాగుతోందనుకోవాలా? రాష్ట్ర బీజేపీ వైసీపీతో ఉత్తుత్తి పోరాటం చేస్తుంటే.. జాతీయ స్థాయిలో బీజేపీ వైసీపీకి దన్నుగా నిలుస్తోందని భావించాలా? వరుస పరిణామాలు దేనికి సంకేతం? ఏదో తేడాగా ఉందంటున్నారు విశ్లేషకులు.