భూ కేటాయింపులపై జగన్ ప్రతివ్యూహం
posted on Mar 26, 2011 @ 10:37AM
హైదరాబాద్: తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన భూ కేటాయింపులపై సభా సంఘాన్ని వేసే విషయంలో, భూకేటాయింపులపై శాసనసభలో చర్చకు అనుతిచ్చే సందర్భంలోనూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్ ప్రతివ్యూహాన్ని రచించింది. భూ కేటాయింపులపై ఉప సభాపతి శాసనసభా పక్ష నేతలతో సమావేశమై భూకేటాయింపులపై వేసే సభా సంఘం పరిధిలో చేర్చే అంశాలపై చర్చించారు.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్ తన వర్గానికి చెందిన శాసనసభ్యులతో సమావేశమై తాము అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. భూ కేటాయింపులపై శాసనసభలో చర్చ వచ్చే సందర్భంలో దాన్ని అడ్డుకునేందుకు వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు సమాయత్తమవుతున్నారు. వైయస్ హయాంలో అక్రమాలు జరిగాయనే విషయం ప్రస్తావనకు వస్తే గందరగోళం సృష్టించడానికి సిద్ధపడుతున్నారు. ప్లకార్డులు ప్రదర్శించాలని, సభా కార్యక్రమాలను అడ్డుకోవాలని వారు యోచిస్తున్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్, రహేజా వంటి పలు అంశాలు చర్చకు వస్తే, ప్రధానంగా వైయస్‌పై ఆరోపణలు వస్తాయని వైయస్ జగన్ భావిస్తున్నారు. దీంతో దాన్ని అడ్డుకోవడం అవసరమని భావించి తన వర్గం ఎమ్మెల్యేలను సమాయత్తం చేశారు.
భూకేటాయంపులపై చర్చ జరిగిన తర్వాత అవసరమనిపిస్తే సభా సంఘం వేస్తామని ప్రభుత్వం ప్రతిపక్షాలకు చెబుతోంది. వైయస్ హయాంలో జరిగిన భూకేటాయింపులపై సభా సంఘం వేయాలని తెలుగుదేశం పార్టీ సభ్యులు కొద్ది రోజులుగా సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు.