కీలక దశకు చేరుకొన్న రాజధాని భూసేకరణ
posted on Feb 28, 2015 @ 10:04AM
రాజధాని నిర్మాణం కోసం కొన్ని గ్రామాలలో రైతులు తమ భూములను ఇచ్చేందుకు నిరాకరిస్తునందున ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా కలుగుజేసుకొని మరికొంత అదనపు పరిహారం ఇచ్చేందుకు అంగీకరించడంతో తుళ్ళూరు, మంగళగిరి మండలాలకు చెందిన మరికొంతమంది రైతులు నిన్న ఒక్కరోజునే 2,700ఎకరాల పంట భూమిని ప్రభుత్వానికి అందజేసేందుకు అంగీకరపత్రాలు సమర్పించారు. ఈ రోజుతో భూసమీకరణ గడువు ముగుస్తుంది. ప్రభుత్వ లక్ష్యం 30,000 ఎకరాలు కాగా నిన్నటి వరకు మొత్తం 26,000 ఎకరాల భూమిని ప్రభుత్వం సమీకరించగలిగింది. అంటే ఇంకా మరో 4,000ఎకరాల భూమిని సేకరించ వలసి ఉంది. కానీ ఈసారి ప్రభుత్వం గడువు పెంచకపోవడం విశేషం. ఇంత వరకు ల్యాండ్ పూలింగ్ విధానం క్రింద ప్రభుత్వం భూమిని సేకరించింది. ఇప్పుడు ప్రభుత్వం ముందు మూడు మార్గాలున్నాయి.
1. మళ్ళీ మరికొంత పరిహారం పెంచడం ద్వారా రైతులను ఒప్పించి మిగిలిన భూసేకరణ చేయడం. 2. ఇటీవల మోడీ ప్రభుత్వం చేత సవరణ చేయబడిన భూసేకరణ చట్టం ప్రయోగించడం. 3. ఇంతవరకు సేకరించిన భూమిలోనే రాజధాని నిర్మించడం.
1. ఒకవేళ మరికొంత పరిహారం పెంచేందుకు ప్రభుత్వం సిద్దపడినట్లయితే, నిన్నటిలాగే మరికొంత రైతులు తమ భూములను ఇచ్చేందుకు ముందు రావచ్చును. కానీ ఈసారి కూడా మిగిలిన 4000 ఎకరాల భూసేకరణ జరుగకపోయినట్లయితే, దాని వలన ప్రభుత్వం అనుకొన్న ఉద్దేశ్యం నెరవేరకపోగా ఇంతవరకు సేకరించిన భూములకు కూడా అదే పరిహారం వర్తింపజేయమని రైతులు డిమాండ్ కొత్త చిక్కులు వచ్చిపడతాయి. అంతేగాక ప్రభుత్వంపై ఆర్ధిక భారం పెరుగుతుంది.
2. ఇక 95 శాతం భూసేకరణ దాదాపు సజావుగా పూర్తిచేసి మిగిలిన 5 శాతం భూసేకరణకు కటినమయిన చట్టాన్ని ప్రయోగిస్తే రైతులందరిలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. కనుక ఈ ఆఖరి అస్త్రాన్ని ప్రభుత్వం ప్రయోగించకపోవచ్చును.
3. ఈ సమస్యలేవీ వద్దనుకొంటే ఇంతవరకు సేకరించిన 26,000 ఎకరాల భూమిలోనే రాజధాని నిర్మాణం చెప్పట్టడం. కానీ మరొక మూడు రోజుల్లో సింగపూర్ సంస్థ వారు మాష్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ (నకలు) తయారుచేసి తీసుకువస్తున్న ఈ సమయంలో ఏకంగా 4000 ఎకరాలలో ప్లాను మార్పులు చేయడం సాధ్యమో కాదో ప్రభుత్వానికే తెలియాలి. ఈమూడు మార్గాలలో ప్రభుత్వం దేనిని అనుసరిస్తుందో తెలుసుకోవాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడవలసి ఉంటుంది.