కాంగ్రెస్ పెద్దలకు కళ్ళు, చెవులు లేవా? కిరణ్ కుమార్ రెడ్డి
posted on Dec 7, 2013 @ 6:49PM
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరో మారు, బహుశః ఆఖరి సారిగా తన పార్టీ అధిష్టానంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అందువల్లేనేమో ఈ సారి జగన్, కేసీఆర్, చంద్రబాబుల పేర్లు నేరుగా ప్రస్తావిస్తూ , కేసీఆర్ అడిగారనో, జగన్ కలుస్తారనో, చంద్రబాబు నాయుడు లేఖ ఇచ్చారనో రాష్ట్రాన్ని విభజిస్తారా? కావాలంటే వారిని కలుపుకోండి, వారినే ముఖ్యమంత్రిని చేయండి, కానీ రాష్ట్రాన్ని మాత్రం సమైక్యంగానే ఉంచండి అని అన్నారు.
ఆయన ఈవిధంగా చెప్పడంతో కాంగ్రెస్ పార్టీకి, కేసీఆర్ మరియు జగన్మోహన్ రెడ్డిలతో రహస్య ఒప్పందాలు జరిగాయని, అందుకే రాష్ట్ర విభజన జరుగుతోందని ఇంతవరకు తెదేపా చేస్తున్న ఆరోపణలను ద్రువీకరించినట్లయింది. అంతేకాక రాష్ట్ర విభజన గురించి జగన్మోహన్ రెడ్డికి ముందే తెలిసినప్పటికీ సమైక్యవాదం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని కూడా అర్ధం అవుతోంది. ఇంతవరకు తెదేపా తదితర పార్టీలు ఇవే ఆరోపణలు చేసినప్పటికీ, అవి రాజకీయ ద్వేషంతో చేసినవని భావించినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకే చెందిన సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి తమ పార్టీ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం ప్రత్యర్ధ రాజకీయ పార్టీలతో చేతులు కలుపుతోందని చెపుతున్న తరువాత ఇక దానిపై ఎటువంటి సందేహాలు అవసరం లేదు.
కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడేందుకు తెలుగు ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకొన్నందుకు శిక్షగా రాష్ట్ర విభజన చేస్తునట్లుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో ఎల్లపుడు అండగా నిలిచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజించి, కాంగ్రెస్ పార్టీ తను కూర్చొన్న కొమ్మను తానే నరుకొంటున్నట్లు వ్యవహరిస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తే, రాష్ట్ర ప్రజలే కాకుండా పార్టీ కూడా తేవ్రంగా నష్టపోవడం ఖాయమని అన్నారు.
రాష్ట్ర విభజన కోరుతూ ఇన్ని లక్షలమంది ప్రజలు దాదాపు రెండున్నర నెలల పాటు చేసిన ఉద్యమాలను ప్రపంచమంతా గుర్తించినా, కేంద్ర ప్రభుత్వం మాత్రం గుర్తించలేకపోవడానికి దానికి చెవులు, కళ్ళు లేవా? అని ఘాటుగా ప్రశ్నించారు. రాష్ట్ర విభజన కు ఎట్టిపరిస్థితుల్లో తాము అంగీకరించే ప్రసక్తే లేదని, తెలంగాణా బిల్లు శాసనసభకు వస్తే దానిని ఓడించి తీరుతామని, శాసనసభలో ఓడిపోయినా బిల్లుని పార్లమెంటులో ఏవిధంగా ఆమోదింప జేస్తారో చూస్తామని ఆయన తన అధిష్టానానికి సవాలు విసిరారు.
కిరణ్ కుమార్ రెడ్డి ఇంత ఘాటుగా కాంగ్రెస్ అధిష్టానాన్ని విమర్శించిన తరువాత కూడా దిగ్విజయ్ సింగ్ వంటి వాళ్ళు “కిరణ్ కుమార్ రెడ్డి క్రమశిక్షణ గల కాంగ్రెస్ నేత” అని సర్టిఫికేట్ జారీ చేయకపోవచ్చును. బహుశః ఇది గ్రహించే శాసనసభలో బిల్లును ఆమోదింప జేసుకోనేందుకు తమ వద్ద తగిన ఉపాయాలున్నాయని దిగ్విజయ్ సింగ్ అని ఉండవచ్చును. అయితే ఆ ఉపాయం ఏమిటో రేపో మాపో శాసనసభ సమావేశాలు మొదలయ్యేలోగానో లేక మొదలయిన తరువాతనో తేలిపోనుంది.