శుక్లాతో జగన్ మంతనాలు, కెవిపి పలకరిపు
posted on Dec 21, 2011 @ 10:00AM
న్యూఢిలీ: రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని మంగళవారం పార్లమెంటు లాబీలో పలకరించారు. 'బాబూ బాగున్నావా..' అని ఆప్యాయంగా ఆయన జగన్‌ను పలకరించినట్లు కాంగ్రెసు వర్గాలు చెప్పాయి. కాగా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రాజీవ్ శుక్లాతో జగన్ పార్లమెంట్ లాబీలో కొద్దిసేపు మంతనాలు జరిపారు. వారిద్దరూ ఏం చర్చించుకున్నారనే విషయం మాత్రం తెలియరాలేదు.
సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ తరఫున దౌత్యాలు నిర్వహించే రాజీవ్‌శుక్లాను జగన్ కలుసుకోవడం వెనుక అసలు విషయం ఏదో ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఆయన ఎదురైనప్పుడు కేవలం స్నేహపూర్వకంగానే కరచాలనం చేశానని జగన్ చెప్పగా, జగన్ వచ్చినప్పుడల్లా తనతో మాట్లాడుతుంటారని, ఆయన తన స్నేహితుడని శుక్లా చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎంపీలు బహిరంగంగా కాకపోయినా లాబీలో జగన్‌ను కలిసి పలకరించినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. తనపై ఉన్న కేసుల్లో బలం లేదని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసులోనూ తనను తప్పుబట్టడానికి ఏమీ లేదని జగన్ సమర్ధించుకోవడం గమనార్హం. తాను ఈడీ ఎదుట హాజరవుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు.