పిచ్చి కూతలు కూస్తే సహించం! విపక్షాలకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్..
posted on Sep 7, 2021 @ 5:38PM
ప్రతిపక్ష పార్టీల నాయకులపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 70 ఏండ్లలో తెలంగాణ ప్రజలకు కరెంట్, తాగునీరు ఇవ్వలేని పార్టీల నేతలు కూడా ఏదో చేశామన్నట్లుగా కవరింగ్ ఇస్తున్నారని మండిపడ్డారు. 24 గంటల కరెంట్ తీసుకొచ్చింది కేసీఆర్ కాదా? నల్లగొండలో ఫ్లోరోసిస్ లేదని కేంద్రమే పార్లమెంట్‌లో చెప్పింది.. అది తెలంగాణకు గర్వకారణం కాదా? అని కేటీఆర్ అడిగారు. తెలంగాణ రైతులు సుభిక్షంగా ఉంటే.. ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. కేసీఆర్‌పై అవాకులు చవాకులు పేలితే బరాబర్ సమాధానం చప్తాం. కుక్క కాటు చెప్పు దెబ్బ తప్పదు. ఓపిక పట్టినం.. సైలెంట్‌గా ఉండే కొద్ది మాటలు ఎక్కువైతున్నాయి అని కేటీఆర్ మండిపడ్డారు.
గల్లీ టు ఢిల్లీ.. గులాబీ జెండాకే జై గల్లీ టు ఢిల్లీ గులాబీ జెండాకే జైకొడుతున్నారన్నారు కేటీఆర్. 2014లో 63 సీట్లు, ఆ తర్వాత వచ్చిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో 12769 గ్రామ పంచాయతీలకు గానూ.. 10 వేల గ్రామాల్లో గులాబీ జెండాలు ఎగిరాయని చెప్పారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ 32 జడ్పీలను కైవసం చేసుకున్నామన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచారు. పార్లమెంట్ ఎన్నికల్లో 9 సీట్లను కట్టబెట్టారని చెప్పారు. 142 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే.. 135 మున్సిపాలిటీల్లో గులాబీ జెండాను రెపరెపలాడించారు. ఈ ఏడేండ్లలో టీఆర్ఎస్ పార్టీ ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. పత్రికల్లో హెడ్‌లైన్స్ కోసం, పైశాచిక ఆనందం కోసమే ప్రతిపక్షాలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వారిని ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదు అని కేటీఆర్ అన్నారు.
కొంత మంది ఎగిరెగిరి పడుతున్నారు. టీ – కాంగ్రెస్, టీ – బీజేపీ.. కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా? మీకు పదవులు వచ్చాయంటే కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా? అని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు కేసీఆర్ పుణ్యమా అని పదవులు రాగానే.. గంజిలో ఈగల్లాగా ఎగిరిపడుతున్నారు అని ఎద్దెవా చేశారు. చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. వయసులో మీ కంటే 20 ఏండ్ల పెద్ద మనిషిని పట్టుకుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. నిన్న మొన్న పుట్టిన చిల్లరగాళ్లు ఎగిరెగిరి పడుతున్నారు. పేరుకే ఢిల్లీ పార్టీలు కానీ.. చేసేవి మాత్రం చిల్లర పనులు అని ధ్వజమెత్తారు. ప్రత్యర్థుల విమర్శలను ధీటుగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
జల విహార్‌లో జీహెచ్ఎంసీకి చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులతో కేటీఆర్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 60 లక్షల పైచిలుకు సభ్యులతో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. 33 జిల్లాల్లో జిల్లా పార్టీ కార్యాలయాలు కట్టుకున్నాం. మొన్న ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు భూమిపూజ చేసుకున్నాం. ఇప్పుడు మన ముందు ఏ ఎన్నిక లేదు. హుజూరాబాద్ ఎన్నిక సమస్యనే కాదు. ప్రత్యర్థుల విమర్శలను ధీటుగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. దాని కోసం సైన్యం ఉంటే సరిపోదన్నారు.ఇందుకు ఎక్కడికక్కడ కమిటీలు పటిష్టంగా ఉండాలన్నారు కేటీఆర్.త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన వారిని తప్పకుండా గౌరవించుకుంటాం అని కేటీఆర్ స్పష్టం చేశారు. పదవులు రాక కొంత మంది నిరాశతో ఉన్నారు. తొందర్లోనే 500 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు.