ముఖ్యమంత్రి తండ్రి అరెస్ట్.. ఛత్తీస్ గఢ్ లో సంచలనం..
posted on Sep 7, 2021 @ 5:38PM
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో సంచలన ఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ తండ్రి నంద కుమార్ బాఘెల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన బ్రాహ్మణులను అవమానించారని ఫిర్యాదు నమోదుకావడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనను 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశించింది.ప్రస్తుతం నందకుమార్ వయసు 86 ఏండ్లు.
ముఖ్యమంత్రి తండ్రి నంద కుమార్ తమను అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారని బ్రాహ్మణులు రాయ్‌పూర్‌లోని డీడీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బ్రాహ్మణులు బయటివారని, విదేశీయులని, వారు తమను తాము సంస్కరించుకోవాలని, లేదంటే గంగ నుంచి వోల్గాకు వెళ్ళడానికి సిద్ధం కావాలని నంద కుమార్ అన్నారని ఆరోపించారు. దీనిపై ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదైంది. డీడీ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి యోగిత కపర్దే మాట్లాడుతూ, నంద కుమార్ సమాజంలో విద్వేషాలను వ్యాపింపజేస్తున్నారని, ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని బ్రాహ్మణులు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఆయన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు.
తన తండ్రి నంద కుమార్ అరెస్టుపై ముఖ్యమంత్రి భూపేష్ స్పందిస్తూ తనకు తన తండ్రి అంటే గౌరవం ఉందన్నారు. అయితే తన ప్రభుత్వంలో ఎవరూ చట్టానికి అతీతులు కాదని చెప్పారు. ఓ కుమారునిగా తాను తన తండ్రిని గౌరవిస్తానన్నారు. కానీ ప్రజా భద్రతకు భంగం కలిగించే ఆయన పొరపాట్లను ఉపేక్షించరాదని చెప్పారు. ముఖ్యమంత్రి తండ్రి అరెస్ట్ కావడంతో రాష్ట్రంలో కలకలం రేపుతోంది. సీఎం భూపేష కు మద్దతుగా కొందరు పోస్టులు పెడుతున్నారు.