ఏపీలో భయపెడుతున్న డెంగ్యూ... ఆరోగ్య శ్రీ పరిధిలోకి విష జ్వరాలు
posted on Sep 7, 2021 @ 7:38PM
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏపీలో డెంగ్యూ కేసులు భయపెడుతున్నాయి. ఏపీలో ఇప్పటివరకు 462 డెంగ్యూ, 31 చికెన్ గున్యా, 708 మలేరియా కేసులు నమోదయ్యాయి. విష జ్వరాలు పెరిగిపోతుండటంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి విష జ్వరాలను చేర్చింది. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. సీఎం జగన్ ఆదేశాలతో వెంటనే అమలయ్యేలా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు.
రాష్ట్రంలో డెంగ్యూ, మలేరియా కేసులు పెరగకుండా, ప్రజలు చికిత్స పరంగా ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని నాని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో విషజ్వరాలు ఎక్కువగా నమోదవుతున్నందున దగ్గర అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తం అయిందన్నారు. ఎక్కువ కేసులు ఉన్నచోట స్పెషల్ శానిటేషన్ డ్రైవ్, మెడికల్ క్యాంపులు నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విష జ్వరాలను గుర్తించడానికి రెగ్యులర్‌గా సర్వే జరుగుతుందన్నారు. టెస్ట్స్ ఎక్విప్ మెంట్, మందులు సిద్దంగా ఉంచాలని అధికారులకు చెప్పామన్నారు. మిగతా జిల్లాల కంటే విశాఖ జిల్లాలో విషజ్వరాలు కాస్త ఎక్కువగా ఉన్నాయని మంత్రి ఆళ్ల నాని తెలిపారు.