కిషన్ రెడ్డిని కలిసిన కోమటిరెడ్డి.. బీజేపీకి జై కొట్టనున్నారా?
posted on Jul 11, 2021 @ 2:42PM
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన కోమటిరెడ్డి.. ప్రస్తుతం భువనగిరి ఎంపీగా ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లలో ఒకరు. పీసీసీ చీఫ్ పదవి కోసం ప్రయత్నించారు. చివరి వరకు రేసులో నిలిచారు. ఆరు నెలల పాటు పీసీసీ చీఫ్ పోస్టును పెండింగులో పెట్టిన కాంగ్రెస్ హైకమాండ్ ... చివరకు రేవంత్ రెడ్డికి పగ్గాలు కట్టబెట్టింది. పీసీసీ చీఫ్ పదవి తనకు రాకపోవడంతో వెంటనే అసమ్మతి స్వరం వినిపించారు కోమటిరెడ్డి. పీసీసీ పదవిని అమ్ముకున్నారంటూ పెద్ద బాంబే పేల్చారు. టీపీసీసీని టీటీడీపీగా మార్చేశారని కామెంట్ చేసి కాక రేపారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కామెంట్లు కాంగ్రెస్ లో కలకలం రేపాయి. అయితే మరుసటి రోజుకే కూలైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. పదవి రాలేదనే బాధతోనే మాట్లాడానని, తాను కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృష్టి చేస్తానని చెప్పారు.
తర్వాత వివాదాస్పద వ్యాఖ్యలు చేయకున్నా.. పార్టీ కార్యక్రమాలకు మాత్రం హాజరు కాలేదు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పీసీసీ చీఫ్ గా పార్టీలోని సీనియర్ నేతలందరిని కలిసిన రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మాత్రం కలవలేదు. తనను కలవడానికి రావొద్దని వెంకట్ రెడ్డి చెప్పడం వల్లే రేవంత్ రెడ్డి అతని నివాసానికి వెళ్లలేదని చెబుతున్నారు. గాందీభవన్ లో జరిగిన రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి పార్టీ నేతలంతా వచ్చినా కోమటిరెడ్డి హాజరు కాలేదు. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏం చేయబోతున్నారు? ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగుతారా లేదా అన్న ప్రశ్నలు తలెత్తాయి.
కోమటిరెడ్డి రాజకీయ గమనంపై చర్చలు సాగుతుండగానే కీలక ఘటన జరిగింది. సడెన్ గా ఢిల్లీకి వెళ్లిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. తెలంగాణలో వారసత్వ సంపదగా ఉన్న భువనగిరి ఖిల్లా అభివృద్ధికి సహకరించాలని ఆయనకు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర కేబినెట్ మంత్రిగా నియమితులైనందుకు కిషన్ రెడ్డికిఅభినందనలు తెలిపారు. తన వినతికి కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని సమావేశం తర్వాత కోమటిరెడ్డి చెప్పారు. అయితే భువనగిరి కోట అభివృద్ధి కోసం కిషన్ రెడ్డిని కలిశానని కోమటిరెడ్డి చెబుతున్నా.. అసలు విషయం మాత్రం రాజకీయపరమైనదేననే చర్చ జరుగుతోంది.
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా సోమవారం దేశ వ్యాప్తంగా ఆందోళనలకు ఏఐసీసీ పిలుపిచ్చింది. తెలంగాణలో పెద్ద ఎత్తున నిరసనలు తెలిపేందుకు పీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఇలాంటి సమయంలో ఆందోళనలకు ముందురోజే కోమటిరెడ్డి ఢిల్లీకి వెళ్లి కిషన్ రెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. పీసీసీ నియామకం తర్వాత పార్టీలో అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డి.. బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలోనే కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి.. బీజేపీ పెద్దలను కలిశారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా ప్రకటనలు చేశారు. అప్పుడే ఆయన బీజేపీలోకి వెళతారని భావించినా.. ఎందుకో ఆగిపోయింది. రాజగోపాల్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి కార్యక్రమానికి వెళ్లలేదు. దీంతో రాజగోపాల్ రెడ్డి బాటలోనే వెంకట్ రెడ్డి వెళుతున్నారని.. కోమటిరెడ్డి బ్రదర్స్ త్వరలోనే కమలం గూటికి చేరతారనే చర్చ జరుగుతోంది.
బీజేపీ పెద్దలతో చర్చల కోసమే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హస్తినకు వెళ్లి ఉండవచ్చని కాంగ్రెస్ లోని కొన్ని వర్గాలు కూడా చెబుతున్నాయి. కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ .. బీజేపీలో చేరడంలో కిషన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని చెబుతారు. కొత్త పార్టీ పెట్టాలనే యోచనలో ఈటల ఉన్నా.. కిషన్ రెడ్డి చొరవతోనే ఆయన కాషాయ కండువా కప్పుకున్నారని తెలుస్తోంది. పార్టీ పెద్దలతో ఈటలతో కిషన్ రెడ్డి మాట్లాడించారని తెలుస్తోంది. ఈటలతో మాట్లాడేందుకు కిషన్ రెడ్డి ప్రత్యేక విమానంలో వచ్చారని రేవంత్ రెడ్డి కూడా ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈటల తరహాలోనే కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలో చేరేలా కిషన్ రెడ్డి పావులు కదుపుతున్నారని, ఆయన పిలుపుతోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారని పక్కాగా అందుతున్న సమాచారం.
భువనగిరి కోట అభివృద్ధికి నిధుల కోసమే అయితే కోమటిరెడ్డి.. ఇప్పుడే అర్జంటుగా ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సోమవారం తలపెట్టిన నిరసన తర్వాత కూడా వెళ్లవచ్చు. బీజేపీ హైకమాండ్ ఆహ్వానం మేరకే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హస్తినకు వెళ్లారని వాళ్లంతా అనుమానిస్తున్నారు. మొత్తంగా కిషన్ రెడ్డి, కోమటిరెడ్డి భేటీతో.. త్వరలోనే తెలంగాణలో మరో కీలక రాజీకయ పరిణామం జరగవచ్చనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.