కొండా లేఖతో వైకాపా పరువు పాయె
posted on Jul 29, 2013 @ 5:10PM
వైయస్ కుటుంబానికి అత్యంత ఆప్తురాలుగా పేరొందిన కొండా సురేఖ వ్రాసిన బహిరంగ లేఖతో వైకాపా పరిస్థితి మరింత దారుణంగా మారింది. సమైక్యాంధ్ర కోరుతూ ఆ పార్టీ నేతల రాజీనామాలతో తెలంగాణా ప్రజలలో ఆ పార్టీ పట్ల చులకన భావం ఏర్పడగా, “జగన్ మోహన్ రెడ్డిలో తండ్రికి ఉన్న ఒక్క మంచి లక్షణం కూడా లేదని, యంయల్సీ టికెట్లను రూ 7 కోట్లకు అమ్ముకొని కేవలం లక్ష కోట్లు సంపదనే ధ్యేయంగా అతను పార్టీని ఒక ప్రైవేట్ లిమిటడ్ పార్టీగా జైల్లోంచే నడిపిస్తున్నాడని” సురేఖ వ్రాసిన బహిరంగ లేఖతో ఇరు ప్రాంతలలో ఆపార్టీ పరువు గంగలో కలిసిపోయింది. ఈ ఆరోపణలు వేరేవరయినా చేసి ఉంటే ప్రజలు అంతగా పట్టించుకొనే వారు కారేమో. కానీ, వైయస్ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలుగా మెలిగిన సురేఖే ఇంత తీవ్ర ఆరోపణలు చేయడంతో ప్రజలు నమ్మక తప్పని పరిస్థితి ఏర్పడింది. అగమ్యగోచరంగా ముందుకు సాగుతున్నపార్టీపై ఈ ఆరోపణలు మరింత తీవ్ర వ్యతిరేఖ ప్రభావం చూపనున్నాయి. తెలంగాణాను వ్యతిరేఖించడం వలన ఆగ్రహంతో ఉన్న తెరాసకు, వైకాపాకు బద్ధ శత్రువయిన తేదేపాకు ఇవి ఆయాచిత అస్త్రాలుగా లభించడంతో ఇక ఆ రెండు పార్టీలు వైకాపాపై మరింత చెలరేగిపోవచ్చును. ఈ నెల 31న జరగనున్న మూడవ దశ పంచాయితీ ఎన్నికల మీద ఆమె లేఖ తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక షర్మిల పాదయత్ర త్వరలో ముగియనున్నందున ఆమె గనుక పార్టీ పగ్గాలు చేప్పట్టి పార్టీని మళ్ళీ గాడిలో పెడితే తప్ప పార్టీకి ఇటువంటి కష్టాలు సమస్యలు తప్పకపోవచ్చును. ఈ రోజు కోర్టు జగన్ మోహన్ రెడ్డి రిమాండును వచ్చే నెల 12 వరకు పొడిగించింది. అతనితో బాటు అదే కేసుల్లో అరెస్టయిన విజయసాయి రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందం, గాలి జనార్ధన్ రెడ్డి, సునీల్ రెడ్డి తదితరుల రిమాండును కూడా ఆగస్ట్ 12 వరకు పొడిగించింది.