కొడాలి నాని తొండాట.. బందర్, గన్నవరం నియోజకవర్గాల్లో విభేదాలకు ఆజ్యం
posted on Jul 1, 2022 @ 2:48PM
వైసీపీలో అంతర్గత కుమ్యులాటలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం, మచిలీపట్నం నియోజకవర్గాలలో వైసీపీ నేతల మధ్య రోజుకో కొత్త వివాదం రాజుకుంటూ.. ఇటు వైసీపీ అధిష్టానానికీ.. అటు నియోజకవర్గంలోని వైసీపీ క్యాడర్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కాగా ఈ వివాదాలకు ఇటీవల మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవులు కోల్పోయిన వారిలో పేరుకు పోయిన అసమ్మతి, అసంతృప్తే కారణమని పార్టీ వర్గాలే బహిరంగంగా చెబుతున్నారు. ఉన్న వివాదాలు, విభేదాలూ చాలవన్నట్లు మాజీ మంత్రి కొడాలి నాని ఆ రెండు నియోజకవర్గాల్లోనూ కొత్త చిచ్చును రగిల్చారు. ముందుగా గన్నవరం నియోజకవర్గం విషయానికి వస్తే.. అసలే అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతున్న అధికార వైసీపీ పార్టీలో గన్నవరం రాజకీయం ఎప్పటికప్పుడు ముందు వరసలోనే ఉంటుంది. ఏపీ పాలిటిక్స్ లో అంత్యం వివాదాస్పదమైన నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది గన్నవరమే. ఇప్పటికే గన్నవరంలో వల్లభనేని వంశీ, దుట్టా రామచందర్రావు, యార్లగడ్డకు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. సీఎం జగన్, సజ్జలతో సహా పార్టీలోని పెద్దలంతా ఈ వివాదాన్ని క్లోజ్ చేయాలనుకున్నా ఏమాత్రం కుదరటంలేదు. సీఎం జగన్ కూడా వీరి పంచాయితీపై అసహనం వ్యక్తం చేసినా అది మాత్రం అంతకంతకు పెరుగుతునే ఉంది. అసలే వివాదాలుగా ఉన్న గన్నవరం రాజకీయానికి మాజీ మంత్రి కొడాలి నాని మరికాస్త ఆజ్యం పోశారు.
దీంతో గన్నవరం రాజకీయం మరోసారి హీటెక్కింది.దుట్టా, యార్లగడ్డ వర్గాలు వంశీని తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. వంశీ ఒక్కరే ఇద్దరితోనూ పోరాడుతున్నారు. ఈ క్రమంలో గన్నవరం వైసీపీ ప్లీనరీ సమావేశానికి హాజరైన మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు వర్గ పోరును మరింత పెంచేలా చేశాయి. 2024లో గన్నవరం వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ఇందులో మరో మాట లేదన్నారయన.అంతేకాదు గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశిపై పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉందని కొడాలి నాని అన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలతో గన్నవరం వైసీపీలో కలకలం మొదలైంది. వంశీని వ్యతిరేకిస్తున్న దుట్టా, యార్లగడ్డ వర్గాల్లో కలవరం మొదలైంది. కొడాలి నాని వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణుల్లోనే ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
ఇక బందర్ ప్లీనరీలోనూ కొడాలి నాని ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. బందర్ లో ఇప్పటికే మాజీ మంత్రి పేర్ని నాని, ఎంపీ వల్లభనేని బాలశౌరిల మధ్య వర్గ పోరు పీక్స్ లో ఉంటే.. పేర్ని నాని ఆ స్థాయిని మరింత పెంచేలా వ్యాఖ్యలు చేశారు. బందర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎంపీ బాలశౌరి తన కుమారుడు వల్లభనేని అనుదీప్ ను వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. అలాగే ఇదే నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి పేర్ని నాని తన కుమారుడు పేర్ని కిట్టును బరిలోకి దింపాలని చూస్తున్నారు. ఇదే ఎంపీ బాలశౌరి, మాజీ మంత్రి పేర్ని నానిల మధ్య విభేదాలను ప్రధాన కారణం కాగా, ఈ విభేదాలను మరింత పెంచే విధంగా కొడాలి నాని.. బందర్ నియోజకవర్గం నుంచి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు వైసీపీ అభ్యర్థిగా రంగంలో ఉంటారని ప్రకటించేశారు.
దీంతో ఎంపీ వర్గీయులు ఒక్కసారిగా భగ్గు మన్నారు. పేర్ని కిట్టును అభ్యర్థిగా ప్రకటించడానికి కొడాలి నాని ఎవరంటూ నిలదీస్తున్నారు. అయినా గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే కొడాలి నానికి బందర్ నియోజకవర్గ గొడవ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కొడాలి నాని తీరు పార్టీలో విభేదాలను రెచ్చగొట్టేదిగా ఉందని పర్టీ శ్రేణులే వ్యాఖ్యనిస్తున్నాయి.
ఇక పరిశీలకులు కూడా ఇటీవలి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవిని కోల్పోయిన ఉక్రోషంతోనే కొడాలి నాని ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రకటనలూ చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ శ్రేణులు కూడా అంతర్గత సంభాషణల్లో వ్యక్తం చేస్తున్నారు.