మాజీ సీఎంలు.. మళ్ళీ మంత్రులు!
posted on Jul 1, 2022 @ 3:03PM
సుమారు పక్షం రోజుల పాటు సాగిన మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం చివరకు అలా ముగిసింది. అనుహ్యంగా శివసేన రెబెల్ లీడర్ ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటుగా, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్,ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్, తమ స్థాయిని తగ్గించుకుని అది కూడా గతంలో తమ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన ఏక్‌నాథ్ షిండే’ మంత్రి వర్గంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం, కొంచెం విడ్డూరంగా ఉండనే మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అలాగే, సహజంగానే అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. రాజకీయాల్లో సీనియర్, జూనియర్ విభజన రేఖలు ఉన్నా, వాటికీ అంతగా ప్రాధాన్యత అయితే ఉండదు. రజకీయ అవసరాలు ఇతరత్రా సమీకరణలు పదవులకు అర్హతలవుతాయి. నరేంద్ర మోడీ, ఉద్దవ్ ఠాక్రే వంటి కొందరు మత్రులుగానే కాదు చివరకు ఎమ్మెల్యేలుగా అనుభవం లేకుండా, నేరుగా ముఖ్యమంత్రులయ్యారు. అప్పటికే అనేక మార్లు మంత్రులుగా, పనిచేసిన అనుభవం ఉన్న వారు, ఏ అనుభవము లేని ముఖ్యమంత్రుల మంత్రివర్గాలో మత్రులుగా పనిచేశారు.
అయితే, మంత్రులుగా ఉన్న వారు మంత్రులుగా కొనసాగడం ఒకటైతే, ముఖ్యమంత్రులుగా పనిచేసి మాజీలు మెట్టు దిగి మళ్ళీ మంత్రులుగా పనిచేయడం కొంచెం ఇబ్బదికరంగానే ఉంటుంది. అందుకే కావచ్చును, షిండేను ముఖ్యమంత్రిగా ప్రకటించిన సమయంలో, ఫడ్నవీస్, చాలా స్పష్టంగా, తాను ప్రభుత్వంలో చేరడం లేదని లేదని ప్రకటించారు. అయితే, పార్టీ అధిష్టానం బలవంతం చేయడంతో,అయిష్టంగానే అయినా ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
అయితే, మాజీ ముఖ్యమంత్రులు మెట్టుదిగి మంత్రులుగా అయిన సందర్భాలు చరిత్రలో లేవా అంటే లేక పోలేదు. ఎక్కడిదకానో ఎందుకు, మహారాష్ట్రలోనే, నలుగురు మాజీ ముఖ్యమంత్రులు,అనంతర కాలంలో ఇతర ముఖ్యమంత్రుల వద్ద మంత్రులుగా పనిచేసిన సందర్భాలున్నాయని, శరద పవార్ వంటి పెద్దలు గుర్తు చేస్తున్నారు.
శంకర రావు చౌహాన్ 1975 లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఆ తర్వాత 1977 లో అయన స్థానంలో వసంత దాదా పాటిల్ సీఎం అయ్యారు. శంకర రావు చౌహాన్ మాజీ అయ్యారు. అయితే, ఆతర్వాత కొద్ది కాలానికే, పాటిల్ మంతి వర్గంలో మంత్రిగా ఉన్న శరద్ పవార్, ఆయన్ని గద్దె దించి ముఖ్యమంత్రి అయ్యారు.
ఆయన మంత్రి వర్గంలో మాజీ ముఖ్యమంత్రి శంకర రావు చౌహాన్, ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అలాగే, శివాజీ రావు పాటిల్ నిలగేన్కర్ 1985 జూన్ నుంచి 1986 మార్చి వరకు కొద్దికాలం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత చాలా కాలానికి సుశీల్ కుమార్ షిండే మంత్రి వర్గంలో రెవిన్యూ మంత్రిగా పనిచేశారు. అలాగే, నారాయణ రాణే శివసేనలో ఉండగా, 1999లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే సంవత్సరం తిరక్కుండానే మాజీ అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన రాణే, విలసరావు దేశ్ ముఖ మంత్రివర్గంలో రెవిన్యూ మత్రిగా పనిచేశారు. అలాగే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశోక చవాన్ 2008 నుంచి 2010 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత సుమారు తొమ్మిది సంవత్సరాల విరామం తర్వాత, ఉద్దవ్ ఠాక్రే (ఎంవీఎస్) మత్రివర్గంలో పీడబ్ల్యు మంత్రిగా పనిచేశారు.
ఇలా మాజీ ముఖ్యమంత్రులు మళ్ళీ మంత్రులుగా పనిచేసిన సందర్భాలు అక్కడక్కడా ఉన్నా, ఫడ్నవీస్ కేసు కొంచెం భిన్నంగా ఉందని పరిశీలకులు అంటున్నారు. మంత్రివర్గంలో చేరడం లేదని చెప్పిన కొద్ది గంటలకే అనివార్యంగా, ‘యూ టర్న్’ తీసుకోవలసి రావడం కొంత ఇబ్బందికరమనే ఆయన సన్నిహితులు అంటున్నారు