జడ్జి రామకృష్ణ హత్యకు కుట్ర? జైల్లో కత్తి కలకలం..
posted on May 31, 2021 @ 7:58PM
అత్యంత పటిష్టమైన రక్షణ ఉండే ప్రాంతం జైలు. సిబ్బందికి తెలీకుండా చీమ కూడా జైల్లోకి జొరబడలేదు. అంతా నేరస్తులే ఉంటారు కాబట్టి.. సెక్యూరిటీ ఫుల్ టైట్‌గా ఉంటుంది. అలాంటిది.. జైల్ బ్యారెక్‌లో కత్తి కనిపించడం చిన్న విషయమేమీ కాదు. అదికూడా.. ప్రభుత్వం కక్షకట్టి జైల్లో పెట్టిన వ్యక్తి ఉండే గదిలోకి కత్తి రావడం అనుమానాస్పదం అంటున్నారు కొందరు.
జిల్లా సబ్ జైల్‌లోని.. జడ్జి రామకృష్ణ ఉన్న బ్యారెక్‌లో కత్తి కలకలం రేపింది. బ్యారెక్‌లో తోటి ఖైదీ బెడ్ కింద కత్తి కనిపించింది. సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే చంపుతానని రామకృష్ణను ఆ ఖైదీ బెదిరించాడని.. జడ్జి రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుతో ఖైదీని మరో బ్యారెక్‌కు తరలించారు.
తన తండ్రి ప్రాణాలకు ముప్పు ఉందని జడ్జి రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశాడు. వెంటనే ఆ జైలు నుంచి మార్చాలని పట్టుబడుతున్నాడు. జైల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. భోజనం చేయడానికి కూడా భయపడుతున్నానని తన తండ్రి తనతో చెప్పారని అన్నారు.
జైల్లో ఉన్న ఆ వ్యక్తి దగ్గర కత్తి ఎందుకు ఉందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. జడ్జి రామకృష్ణను హత్య చేసే ఉద్దేశంతోనే అతని బ్యారక్‌లోకి మరో వ్యక్తిని పంపించారని చంద్రబాబు ఆరోపించారు. ఆ అపరిచిత వ్యక్తి వద్ద కత్తి ఎందుకు ఉందో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి కక్షపూరితంగా కేసులు పెట్టి జడ్జి రామకృష్ణను జైలులో పెట్టించారని చంద్రబాబు ఆరోపించారు. ‘న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు అండగా నిలిస్తే కేసులు పెడతారా?’ అని చంద్రబాబు నిలదీశారు.
రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై ప్రజల్లో ద్వేషం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై.. జడ్జి రామకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా.. జడ్జి రామకృష్ణను పీలేరు సబ్‌జైలుకు తరలించారు. అయితే, జడ్జి రామకృష్ణ ఉన్న బ్యారెక్‌లోని మరో ఖైదీ బెడ్ కింద కత్తి ఉండటం ప్రస్తుత వివాదానికి కారణం.