సీఎస్‌తో చెడుగుడు.. మోదీకి మమత చెక్.. కేంద్రం కౌంటర్ యాక్షన్..
posted on May 31, 2021 @ 10:13PM
బెంగాల్ దంగల్ మరింత కాక రేపుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ సంక్షోభం తలెత్తే స్థాయికి పరిస్థితులు దిగజారాయి. మోదీ వర్సెస్ మమత.. కోల్డ్‌వార్‌లో మాజీ సీఎస్ ఆలాపన్ బంధోపాధ్యాయ్ బలవుతున్నారు. కేంద్ర ఆదేశాలకు బెదరకుండా.. సీఎస్‌తో రాజీనామా చేయించి.. ప్రభుత్వ సలహాదారుగా నియమించి.. మోదీ ఇగోను మరింత రెచ్చగొట్టారు మమత. అందుకు కౌంటర్‌గా తాజాగా మాజీ అయిన ఐఏఎస్‌పై ఛార్జిషీట్ ఫైల్ చేసేందుకు కేంద్రం సిద్ధమవుతుండటంతో వివాదం మరింత ముదురుతోంది.
తౌక్తే తుఫాను.. బెంగాల్‌లో రాజకీయ కల్లోలానికి కారణమైంది. తుఫాను నష్టంపై ప్రధాని చేపట్టిన సమీక్షా సమావేశానికి సీఎం మమత అరగంట ఆలస్యంగా రావడం.. వెంటనే వెళ్లిపోవడంపై.. కేంద్రం సీరియస్‌గా స్పందించింది. ఆ రాష్ట్ర సీఎస్ ఆలాపన్ బందోపాధ్యాయని వెంటనే రిలీవ్ చేసి కేంద్ర పరిపాలనా విభాగంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అయితే, సీఎస్‌ను రిలీవ్ చేసేది లేదంటూ మమత తిరుగుబాటు చేయడంతో వివాదం ముదిరింది. ఆ మేరకు ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు.
కట్ చేస్తే.. సోమవారంతో సీఎస్ పదవీ కాలం ముగిసింది. ఆ వెంటనే ఆయన విధుల నుంచి వైదొలిగారు. ఆ వెనువెంటనే ఆలాపన్ బందోపాధ్యాయను బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా నియమించారు సీఎం మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్ నూతన ప్రధాన కార్యదర్శిగా హెచ్‌కే ద్వివేది నియమితులయ్యారు.
తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్రం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సీఎం మమత. బందోపాధ్యాయ విషయంలో కేంద్రం ఉత్తర్వులు తనకు షాక్ కలిగించాయని, ఈ కొవిద్ పాండమిక్ సమయంలోను, యాస్ తుఫాను వల్ల తలెత్తిన నష్టాల తరుణంలోనూ ఆయన సేవలు ఈ రాష్ట్రానికి, ప్రభుత్వానికి, పేదలకు ఎంతో అవసరమని మమత అన్నారు.
‘‘కేంద్రానిది పూర్తిగా ప్రతీకారం. ఇలాంటి వైఖరిని ఇంత వరకు ఎప్పుడూ చూడలేదు. అధికారులు ఏమైనా కట్టుబానిసలు అనుకుంటున్నారా? దేశం కోసం జీవితాంతం కష్టపడిన ఓ ఉద్యోగిని ఇలా వేధించడం ద్వారా కేంద్రం ఏం సందేశం ఇవ్వాలనుకుంటోంది? ఎంతోమంది బెంగాల్ కేడర్‌కు చెందిన వ్యక్తులు కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. వారందర్నీ వెనక్కి రప్పించమంటారా?’’ అని మమత ప్రశ్నించారు.
అంతటితో ఆగలేదు దీదీ..’మిస్టర్ ప్రైమ్ మినిష్టర్.. బిజీ ప్రైమ్ మినిష్టర్.. మిస్టర్ మన్ కీ బాత్ ప్రైమ్ మినిష్టర్’ అంటూ వెటకారంగా వ్యాఖ్యానించారు.
మరోవైపు.. మమతపై కౌంటర్ అటాక్ చేసేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కేంద్రం ఆదేశాలను పాటించని ఆలాపన్ బందోపాధ్యాయపై చర్యలు తీసుకోబోతోంది. సీఎస్‌గా ఆలాపన్ బందోపాధ్యాయ్ పదవీ విరమణ చేసినా, ఆయనపై చర్యలకు కేంద్రం సిద్ధమవుతోంది. ఆయనకు త్వరలోనే కేంద్రం ఛార్జ్‌షీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సోమవారం నాటికి ఆలాపన్ ఢిల్లీలో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. అయితే ఆలాపన్‌ను సీఎం మమత రిలీవ్ చేయలేదు. దీంతో సిబ్బంది మరియు శిక్షణా విభాగానికి నివేదించడంలో ఆలాపన్ బందోపాధ్యాయ్ విఫలం చెందారని, ఈ కారణంగా ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సిబ్బంది మరియు శిక్షణా విభాగం రెడీ అవుతున్నట్టు సమాచారం. మోదీ వర్సెస్ మమత.. ఆధిపత్య పోరు ఎక్కడి వరకూ దారితీస్తుందోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.