ఎట్టకేలకు భూపందేరాలపై సభాసంఘం
posted on Mar 30, 2011 @ 9:51AM
హైదరాబాద్: ఎట్టకేలకు భూ కేటాయింపులపై సభా సంఘానికి ప్రభుత్వం అంగీకరించింది. అయితే కొన్ని షరతులనూ పెట్టింది. గత పది రోజులుగా ప్రతిపక్షాలు భూ కేటాయింపులపై సంయుక్త సభా సంఘం వేయాలని పట్టుపట్టాయి. చర్చలనంతరం సభా సంఘం వేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. భూ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని భావిస్తే తప్పకుండా సంయుక్త సభా సంఘం వేస్తామని సభకు హామీ ఇచ్చారు. భూ అక్రమాలకు వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ బాధ్యత వహించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు డిమాండ్ చేశారు. సభలో లేని వాళ్లను విమర్శించడం తగదంటూ జగన్‌వర్గం ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టు ముట్టారు. భూ కేటాయింపుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ, నిర్దిష్ట ఆధారాలున్న సంస్థలపై సభాసంఘం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ పరిశ్రమలకుగానీ, సెజ్‌ల కోసం గానీ భూములను కేటాయించడంలో ఇప్పటి వరకు ఎలాంటి విధానం లేదన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారికి కావాల్సిన వారికి భూములను కేటాయించడం జరిగిందని ఒప్పుకున్నారు. భూములు కేటాయించేటప్పుడు ఒకరికి ఒక రేటుకు మరొకరికి మరో రేటుకు ఇవ్వడం జరిగిందన్నారు. భూ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని వాటిని సరిదిద్దుకుంటామని చెప్పారు.
భూమి ఎవరికి ఎందుకోసం ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనే దానిపై నూతన విధానాన్ని తయారు చేస్తున్నామని, దానికి అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. అధికారులు ఇచ్చిన నివేదికపై అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తు అవసరాల కోసం భూమిని కాపాడుకోవల్సిన అవసరం ఉందన్నారు.వక్ఫ్ భూములను కాపాడటం కోసం త్వరలో మైనార్టీ ఎమ్మెల్యేలు, మంత్రితో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. వక్ఫ్ భూములను ఇతర అవసరాల కోసం ఇవ్వబోమని తెలిపారు. కొత్త పరిశ్రమలను రాబట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పాలసీ వచ్చిన తరువాత ఏ సంస్థకైనా అదనంగా భూములు కేటాయించారని తేలితే వాటిని తప్పకుండా వెనక్కి తీసుకుంటామని చెప్పారు. 'నాపై 22 విచారణ కమిటీలు వేశారు. ఆర్థిక మంత్రి రోశయ్య అధ్యక్షతన సబ్ కమిటీ వేశారు' అని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అన్నారు. మరో వంద ఎంక్వయిరీ కమిటీలు వేసుకున్నా తనకు అభ్యంతరం లేదన్నారు. భూఆక్రమాలకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కొడుకు జగన్మోహన్‌రెడ్డి పాత్రధారులని విమర్శించారు.ఆ విషయాన్ని విస్మరించి దొంగే..దొంగ దొంగ అని అరిచినట్లు కొంత మంది సభ్యుల ప్రవర్తిస్తున్నారని జగన్ వర్గం ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.