Read more!

సొమ్మొక్కడిది సోకొకడిదీ అన్నట్లు.. కష్టం బాబుది..క్రెడిట్ జగన్ కా?

 రాష్ట్ర విభజన తర్వాత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే, అది తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న తొలి ఐదేళ్లలోనే జరిగింది. అలాగే  రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చాయన్నా, అదీ ఆ ఐదేళ్ల కాలంలోనే అంటే చంద్రబాబు హయాంలోనే. ఇందులో మరో అభిప్రాయానికి తావు లేదు. అవార్డులు అబద్ధం చెప్పవు.
తెలుగు దేశం  అధినేత, నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉన్న పరిపాలనా అనుభవం, అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, జాతీయ రాజకీయాలో చక్రం తిప్పిన నాయకునిగా దేశ విదేశాలలో ఆయనకు ఉన్న గుర్తింపు, గౌరవం ఈ అన్నిటినీ మించి విశ్వసనీయత, నిజాయతీ ఆధారంగా  అనేక విదేశీ సంస్థలు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందు కొచ్చాయి.

ఆ విధంగా చంద్రబాబు ఐదేళ్ల పాలనా కాలంలో అనేక దేశ విదేశీ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. పరిశ్రమలు స్థాపించాయి. అందులో, ‘ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2023’ అవార్డ్ గెలుచుకున్న కియా మోటార్స్ ఒకటి. తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో అనంతపూర్ జిల్లా, పెనుకొండ నియోజకవర్గ పరిధిలోని మునిమడుగులో రూ.13 వేల కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టు  ప్రారంభమైంది. 

అయితే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసేపీ కియా ప్రాజెక్టు వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించింది. అదొక దండగమారి ప్రాజెక్టని ఎద్దేవా చేసింది. తెలుగు దేశం ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తిపడి, స్థానికులకు పట్టుమని పది ఉద్యోగాలు అయినా ఇవ్వని కార్ల ప్రాజెక్టుకు విలువైన భూములను కట్ట బెట్టిందని వైసీపీ నేతలు ఆరోపించారు. ముఖ్యంగా అప్పట్లో అన్నిటా నెంబర్ 2గా ఉన్న విజయసాయి రెడ్డి, ట్వీట్ల మీద ట్వీట్లతో టీడీపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. ‘కార్లు అమ్ముడుపోని కారణంగా కియా మోటార్స్ చైనాలోని అతి పెద్ద ప్లాంటును మూసేసింది. మరి అనంతపూర్ లో ఏర్పాటవుతున్న ప్లాంట్ సంగతేమిటో? అంటూ వ్యంగం ఒలక పోశారు. అంతే కాదు, కమీషన్ల కక్కుర్తితో కియా మోటార్స్ కు చంద్రబాబు నాయుడు రెండు వేల కోట్ల రూపాయల రాయితీ  ఇచ్చారు. కంపెనీ ఉద్యోగుల్లో వంద మంది కూడా స్థానికులు లేరని  ట్వీటారు.   

అయితే  ఇప్పడు అదే విజయసాయి, నాలుక మడతేశారు. చంద్రబాబు నాయుడు ముందు చూపు, దార్శనికతతో రూపుదిద్దుకున్న  కియా మోటార్స్  అనంతపూర్ యూనిట్ లో తయారైన కియా కారేన్స్  కారుకు వచ్చిన ‘ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2023’ అవార్డ్ క్రెడిట్ ను వైసీపీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’ కార్    కియా కారేన్స్ కు అవార్డు రావడం గర్వ కారణం అని పేర్కొన్నారు. అంతే కాదు, 2019లో 57,719 కార్లతో ఉత్పత్తి ప్రారంభించిన అనంతపూర్ కియా యూనిట్, ఉత్పత్తి 2021 నాటికి, 2.27 లక్షల కార్లను ఉత్పత్తి చేసే స్థాయికి చేరిందనీ, అదేదో తమ ప్రభుత్వం సాధించిన ఘన కార్యం అన్నట్లుగా  చంకలు గుద్దుకున్నారు. అయితే, కియా విజయం చంద్రబాబు నాయుడు దార్శనికకు నిదర్శనం అనేది  కాదనలేని నిజం. అందులో ఎలాంటి సదేహం లేదు.

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్, తమ పాదయాత్రలో 55వ రోజైనా గురువారం (మార్చి 30)   మునిమడుగులోని కియా ఫ్యాక్టరీ వద్ద ఉద్యోగులతో కలసి సెల్ఫీ తీసుకున్నారు.  కియా పరిశ్రమ ఇది.. ఏపీలోనే అతిపెద్ద సింగిల్ మేనిఫ్యాక్చరింగ్ ప్లాంట్.. భారతదేశంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పెట్టిన సంస్థ అని ట్వీట్ చేశారు. పెట్టుబడి రూ.13వేల కోట్లు.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 40వేల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. అలాగే మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కియా సహా పెద్ద సంఖ్యలో పరిశ్రమలు తెచ్చి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తే.. ఇప్పుడు అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని లోకేష్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వానికి కియా పరిశ్రమ ఎదుట సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. చంద్రబాబు కృషి, అప్పుడు మంత్రిగా పనిచేసిన అమరనాథ్ రెడ్డి, అధికారుల శ్రమకు కియా నిదర్శనమన్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాకా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈ నాలుగేళ్ళలో  తెచ్చిన పెట్టుబడులు, పరిశ్రమలు  ఏమిటో చెప్పాలని సవాల్ విసిరారు. అదేమిటో కానీ, నవ్విపోదురుగాక నాకేటి సామెతను గుర్తు చెస్తూ  మంది బిడ్డను మా బిడ్డని మురిసిపోయిన వైసీపీ పెద్దలు, లోకేష్ సవాల్ కు మాత్రం సమాధానం ఇవ్వలేదు. సైలెంట్ అయి పోయారు.