Read more!

వయనాడ్ నుంచి రంగంలోని ప్రియాంక.. ఉపఎన్నిక ఎప్పుడు?

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు నేపథ్యంలో ఖాళీ అయిన కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుంది? ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారు? అనే విషయంలో ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి కర చర్చ జరుగుతోంది. ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా, ప్రియాంకా వాద్రా పోటీచేసే అవకాశం ఉందని  కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. అలాగే, ఆమె పోటీ చేయక పోవచ్చని, గతంలో వరసగా రెండు పర్యాయాలు ఇదే నియోజక వర్గం నుంచి గెలిచిన  కేరళ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్  ఎంఐ షనవాస్ పోటీ చేస్తారనే వార్తలు కూడా వినవస్తున్నాయి. 

అయితే  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించిన ఎన్నికల కమిషన్ వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గ ఉపఎన్నిక విషయంలో మాత్రం సస్పెన్స్ పాటించింది. ఫిబ్రవరి వరకూ ఉన్న వేకెన్సీలను క్లియర్ చేసినట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు. వయనాడ్ వేకెన్సీని మార్చిలో నోటిఫై చేశామని, రాహుల్ గాంధీ తనకు రెండేళ్ళ జైలు శిక్షపై  అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల సమయం ఉన్నందున తాము తొందరపడటం లేదని చెప్పారు. ప్రజాప్రాతినిథ్య చట్టం-1951 ప్రకారం ఏ సీటైనా ఖాళీ అయితే ఆరు నెలల్లోపు దానిని భర్తీ చేయాల్సి ఉంటుంది,   రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై నిరసన కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ... ఇదే సమయంలో కర్ణాటకతో పాటు వయనాడ్ ఉప ఎన్నికను కూడా ఎన్నికల సంఘం ప్రకటించినట్లయితే న్యాయపోరాటం జరపాలనే ఆలోచన చేసింది. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు గత రాహుల్‌ను దోషిగా నిర్దారిస్తూ, ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు రాహుల్‌కు 30 రోజుల గడువు ఇచ్చింది. రాహుల్ విజ్ఞప్తిపై ఆయనకు బెయిల్ సైతం మంజూరు చేసింది. అయితే, సూరత్ కోర్టు తీర్పు వెలువరించిన మరుసటి రోజే రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, రెండేళ్ల జైలుశిక్షపై 30 రోజుల్లోగా అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని, ఆయనకు విధించిన జైలుశిక్షను పైకోర్టు నిలిపివేసినట్లయితే ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడం జరుగుతుందని కాంగ్రెస్ చెబుతోంది.

 కాగా రాహుల్ ఎదుర్కొంటున్న తరహా కేసులోనే లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్‌పై పడిన అనర్హత వేటును లోక్‌సభ సెక్రటేరియట్  బుధవారం (మార్చి 29) ఉపంసంహరించుకుంది. గతంలో సెషన్స్ కోర్టు తీర్పు నేపథ్యంలో ఫైజల్‌ను ఎంపీ పదవి నుంచి తొలగిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని కేరళ హైకోర్టులో ఆయన సవాలు చేశారు. దానిని విచారించిన కోర్టు ఆయనకు విధించిన శిక్షపై స్టే విధించింది.

అయినప్పటికీ ఆయనపై అనర్హతను లోక్‌సభ సెక్రటేరియట్ ఎత్తివేయలేదు.తాను పార్లమెంటుకు వచ్చినప్పటికీ తనను భద్రతా సిబ్బంది అనుమతించలే దంటూ ఆయన ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ పెండింగ్‌లో ఉండగానే ఎంపీ అనర్హత వేటును ఉపసంహరించుకుంటూ లోక్‌సభ ఉత్తర్వులు జారీ చేసింది. ఫైజల్ పిటిషన్‌ను సీజేఐ డివై చంద్రచూడ్ విచారణకు స్వీకరించిన నేపథ్యంలో లోక్‌సభ సచివాలయం ఫైజల్ అనర్హతపై దిగొచ్చి, అనర్హత నోటిఫికేషన్ ను ఉపసంహరించుకుంది. ఈనేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం వాయనాడ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు.