కేసీఆర్ కమాల్ 'కియా'.. జగన్‌రెడ్డి 'ఢమాల్' కియా..
posted on Jun 14, 2021 @ 5:32PM
కియా మోటార్స్. ప్రపంచస్థాయి కార్ల కంపెనీ సీఎం చంద్రబాబు హయాంలో ఏపీని వెతుక్కుంటూ వచ్చింది. పక్క రాష్ట్రాలు వేసిన రాయితీ బిస్కెట్లకు ఆశపడకుండా.. ఏరికోరి మరీ అనంతపురంలోనే కంపెనీ పెట్టింది. చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి.. వందల కోట్లు పెట్టుబడి పెట్టింది. అత్యంత వేగంగా ఫ్యాక్టరీ నిర్మించి.. వేలాది మంది స్థానికులకు ఉపాధి కల్పించి.. కార్ల ఉత్పత్తి ప్రారంభించి.. చంద్రబాబు చేతుల మీదుగానే ఫస్ట్ గేర్ మార్చింది కియా మోటార్స్.
ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా కియా కార్లే కనిపిస్తున్నాయి. తెలుగురాష్ట్రాల్లో ఏ రోడ్డులో వెళ్లినా.. కియా కారు హారన్ మీకు హాయ్ చెబుతుంది. ఆ కారును చూసి ఇది మన అనంతపురంలో తయారైన కారేనంటూ ఆంధ్రులు గర్వపడుతుంటారు. కియా కారును చూపినప్పుడల్లా చంద్రబాబును గుర్తుకు తెచ్చుకుంటుంటారు.
ప్రభుత్వం మారడంతో.. కియా కారు వైభవమూ మసకబారిపోతోంది. స్థానిక వైసీపీ ఎంపీ గోరండ్ల మాధవ్.. కియా యాజమాన్యాన్ని బహిరంగంగానే హెచ్చరించిన దృశ్యాలు ఇంకా అందరి కళ్లల్లో కదలాడుతూనే ఉన్నాయి. కియా కంపెనీ ముందు ధర్నాలు, ఆందోళనలు చేయడం వైసీపీ నేతలకే చెల్లింది.
అంతర్జాతీయ కార్ల కంపెనీని అక్కున చేర్చుకోవాల్సింది పోయి.. వెళ్లగొట్టడానికి కుట్రలు చేసిన ఘనత ప్రస్తుత ప్రభుత్వానిదేననే విమర్శలు ఉన్నాయి. కియా కార్లకు ప్రస్తుత ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభించకున్నా.. నాణ్యతనే నమ్ముకొని మనుగడ సాగిస్తోంది కియా మోటార్స్. ఇలాంటి సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం లేటెస్ట్‌గా లగ్జరీ 32 కియా కార్లను కొనుగోలు చేయడంతో.. మేడ్ ఇన్ ఏపీ.. కియా కార్ల ప్రస్తావన మరోసారి చర్చకు వస్తోంది. సాటి తెలుగు రాష్ట్రం కియా కార్లను కొని.. తమ వంతు ప్రోత్సాహం ఇస్తుంటే.. జగన్‌రెడ్డి సర్కారు ఆమాత్రం సాయం కూడా చేయదా? అనే ప్రశ్నలు వినిపిస్తుండటం ఆశ్చర్యకరమేమీ కాకపోవచ్చు. బహుషా కమిషన్ల కోసం పక్కన పెట్టేశారేమో అనే అనుమానాలూ వినిపిస్తుండటం విచిత్రమేమీ కాదు.
ఏపీలో కియా మోటార్స్ ప్రభుత్వ నిరాదరణకు గురవుతుంటే.. తెలంగాణలో ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో లగ్జరీ కార్ల పోకడలు ఎందుకంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఫార్చ్యునర్ వెహికిల్స్ వాడుతుండగా.. తాజాగా, అడిషనల్ కలెక్టర్ల కోసం.. ఒక్కోటి 24 లక్షలు ఖరీదు చేసే.. 32 కియా కార్లు కొనడం వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వ దుబారాపై జనాలు మండిపడుతున్నారు. పాత లెక్కలన్నీ తవ్విపోస్తున్నారు.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకూ.. ఏకంగా 20,104 కొత్త కార్లు కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్ సర్కారుది. ఓవైపు ఖజానాలో డబ్బులు లేక ప్రభుత్వ భూములనే అమ్మకానికి పెడితే.. ఇలా లక్షలు, కోట్లు పెట్టి.. వాహనాలు కొనడానికి పైసలు ఎందుకు వేస్ట్ చేస్తున్నారనే వారూ ఎక్కువే. దొర.. పోకడలు పోతున్నారంటూ తప్పుబడుతున్నారు.
సీఎం కేసీఆర్ కాన్వాయి.. ఖరీదైన ల్యాండ్ క్రూయిజర్లుతో గ్రాండ్‌గా ఉంటుంది. మంత్రుల కాన్వాయిలో ఫార్చూనర్లు రయ్ రయ్ మంటాయి. ఇక, 2014లోనే పోలీసు డిపార్టుమెంటు కోసం 271 కోట్లతో 4,433 ఇన్నోవా కార్లను కొన్నారు. ఆ తర్వాత మున్సిపాలిటీల కోసం వందల సంఖ్యలో కొత్తగా చెత్త వాహనాలు కొనుగోలు చేశారు. కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక.. అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లకు ఒక్కోటి 40 లక్షల ఖరీదైన ఫార్చూనర్ కార్లను కొనిచ్చారు. ఇరిగేషన్ శాఖ సీఈలకు ఆరు ఇన్నోవాలు, రెండు టయోటా ఇతియాస్ వాహనాలను కేటాయించారు. 28 సర్కిళ్లలో సూపరింటెండెంట్ ఇంజినీర్ల కోసం 28 మహింద్రా బోలేరో, 8 టయోటా ఇతియాస్ కార్లు తీసుకున్నారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇంజినీర్ల కోసం రెండు ఇన్నోవా, ఒక బోలేరో, రెండు టయోటా ఇతియాస్ కార్లు కొనుగోలు చేశారు. 32 మంది జిల్లా పరిషత్ ఛైర్మన్ల కోసమూ ఫార్చూనర్ కార్లను కొనుగోలు చేసింది. ఇక, రాష్ట్ర సచివాలయంలో కార్యదర్శులకు హోండా సిటీ, టొయోటా కామ్రీ, కొరోల్లా, స్కోడా కార్లు ఉన్నాయి. తాజాగా, అడిషనల్ కలెక్టర్ల కోసం కొత్త లగ్జరీ కియా కార్లు కొనడం కాంట్రవర్సీకి కారణం అవుతోంది. ఢిల్లీస్థాయిలో పని చేసే కేంద్ర ప్రభుత్వ అధికారులు జాయింట్ సెక్రెటరీ స్థాయిలో వినియోగించే కార్లతో పోలిస్తే మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వాడుతున్న కార్లు రెండింతలు ఖరీదైనవని అంటున్నారు.
కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతినడం.. అప్పుల కోసం ఎఫ్ఆర్ఎమ్‌బీ పరిమితి 5 శాతానికి పెంచాలంటూ ఆర్థిక మంత్రి హరీష్‌రావు కేంద్రానికి లేఖ రాయడాన్ని బట్టి చూస్తే.. పైసల తిప్పలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం అవుతోంది. మరి, ఇలాంటి కరోనా కష్ట కాలంలో అంత ఖరీదైన కార్లను ఇప్పటికిప్పుడు అర్జెంట్‌గా కొనాల్సిన అవసరం ఏమొచ్చిందో కేసీఆర్‌కే తెలియాలి. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను పర్యవేక్షించే అడిషనల్ కలెక్టర్లు లగ్జరీ కార్లు వేసుకొని దర్జాగా గ్రామాల బాట పడితే.. ధనిక రాష్ట్రం అంటే.. బంగారు తెలంగాణ అంటే.. ఇదేనని ప్రజలు భ్రమపడతారని కాబోలు ఇదంతా...! అంతేనా, కేసీఆర్ గారూ..?