కమలం చేతిలో గులాబీ బాస్ చిట్టా! ఈటల అలా నరుక్కొస్తున్నారా...
posted on Jun 14, 2021 @ 7:35PM
అహం అనేది ప్రమాదకరం.. అదే మన శత్రువు కూడా. అది మనలను వెనకా ముందు చూడకుండా రెచ్చగొట్టేస్తుంది. మనం కూడా రెచ్చిపోతాం. ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటాం. వాటి పర్యవసానాలు ఎదురయ్యాకే మళ్లీ ఆలోచనలో పడతాం. కాని అప్పటికే పరిస్ధితి చేయిదాటి పోతుంది. ఇప్పుడు కేసీఆర్ ఈటల వ్యవహారంలో అదే జరిగిందా.. అనే అనుమానం వస్తోంది.24 గంటల్లో తొక్కేశారు.. మరుసటి రోజే తీసేయకుండానే బయటకు పంపించేశారు. కబ్జా ముద్ర వేసేశారు.. కేసులు పెట్టేశారు.. కమిటీలు వేశారు..నివేదికలు తెప్పించేశారు. తన మాట వినకుండా.. తనను పరోక్షంగా విమర్శిస్తూ మంత్రి పదవి అనుభవిస్తున్న ఈటలపై కేసీఆర్ భగ్గుమన్నారు. లోలోపల ఆగ్రహంతో ఉన్నా..కొన్నాళ్లు ఓపిక పట్టారు. చివరకు అది బరస్ట్ అయింది. వెంటనే వ్యూహం రెడీ అయిపోయింది.. ఈటలను బయటకు పంపేయడానికి. చకచకా పావులు కదిపారు.. పని పూర్తి చేశారు. వారి అంచనా ప్రకారం..ఈటల కాంగ్రెస్ లోకి వెళ్లాలి.. లేదా సొంత పార్టీ పెట్టాలి. ఎందుకంటే వారి సమాచారం ప్రకారం ఈటల రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరరెడ్డి తదితరులతో టచ్ లో ఉన్నాడు. టచ్ లోకి వెళ్లాకే సెటైర్లు విసిరాడు. వారు ఊహించనది ఏంటంటే.. ఈటల బిజెపిలోకి వెళతాడని..అదే ఇప్పుడు వారికి ఆందోళన కలిగిస్తోంది.
ఈటల రాజేందర్ ఐదేళ్లు ఆర్ధిక మంత్రిగా పని చేశాడు. తర్వాత వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా చేశాడు. ఎంత వన్ సైడు నిర్ణయాలు తీసుకున్నా..కేసీఆర్ వ్యూహమేంటో.. ఎవరి కోసం ఏ నిర్ణయాలు తీసుకుంటారోననేది తెలియకుండా ఉండదు కదా. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ వ్యవహారాలు జరిగాయి...ఎవరికి ఎలాంటి ఫేవర్స్ చేశారో ఆర్ధికమంత్రికి తెలియకుండా ఉండదు కదా..రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా..ఈటల కుండే సమాచారం ఈటలకు ఉండదా? ఇప్పుడు ఈటల ఆ గుట్టు కమలం ముంగిట విప్పితే ఏంటి పరిస్ధితి? అవన్నీఅడ్డం పెట్టుకుని బిజెపి బ్లాక్ మెయిల్ చేస్తే ఏం చేయాలి? ఇప్పుడీ ఆలోచనలే గులాబీ శిబిరంలో టెన్షన్ పుట్టిస్తున్నాయి.
లేటెస్టుగా లోక్ సభలో టీఆర్ఎస్ పక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు ఇంటిపైనా..ఆయన కంపెనీ మధుకాన్ ఆఫీసుపైనా ఈడీ దాడులు నిర్వహించింది. బ్యాంకులకు వెయ్యి కోట్లకు పైనే రుణాలు కావాలని ఎగ్గొట్టారనే ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు. ఆయన ఈ మధ్యే టీఆర్ఎస్ లో చేరి.. ఖమ్మంలో ఎంపీగా గెలిచారు. దీని కోసం గులాబీకోటలో భారీగానే సమర్పించుకున్నారని వినికిడి. ఈ ఒక్క ఎపిసోడ్ ఈటల ప్రమాదంపై అంచనాలను మరింత పెంచేస్తుండటంతో.. గులాబీ సేన తల పట్టుకున్నట్లు తెలుస్తోంది.
హుజూరాబాద్ లో గెలవడం తర్వాత...ఇప్పుడు పార్టీ, ప్రభుత్వంలోని గుట్టుమట్లు.. పార్టీకి సహకరిస్తోన్న బిగ్ షాట్స్.. వారు తీసుకుంటున్న ఫేవర్స్ ఇవన్నీ లిస్టు రాసి కమలం చేతికి ఇచ్చాడంటే... వారు ఒక్కొక్కరిని బెదిరించి, కన్విన్స్ చేసి లాగేసుకుంటుంది బిజెపి. ఈ విద్యలో కమలనాథులు ఆరితేరిపోయారు కూడా. అందుకే బిజెపిలోకి ఇంకా అనేకమంది నాయకులు రాబోతున్నట్లు ప్రకటించడం వెనక అసలు ధీమా ఇదేనేమో. ఇంత ప్రస్థానం నడిపించి.. ఈటల విషయంలో ఇంత చిన్న లాజిక్ కేసీఆర్ సాబ్ ఎలా మిస్సయ్యారో మరి.