వివేకా కేసులో కీలక మలుపు! విచారణ వేరే రాష్ట్రానికి బదిలీకి సుప్రీం ఓకే
posted on Oct 19, 2022 @ 1:05PM
ఏపీ సీఎం జగన్ సొంత బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయడానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేసు విచారణను ఎక్కడికి బదిలీ చేయాలనే ఉత్తర్వులను శుక్రవారం(అక్టోబర్ 21) ఇస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.
వివేకా హత్య కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయడానికి తమకు అభ్యంతరం లేదని సుప్రీంకోర్టులో 200కు పైగా పేజీల అఫిడవిట్ ను సీబీఐ దాఖలు చేసింది. వేరే రాష్ట్రానికి ఈ కేసు విచారణను ఎందుకు బదిలీ చేయాలో చెబుతూ బలమైన కారణాలను కూడా కోర్టుకు సీబీఐ అందజేసింది. ఇరు పక్షాల లాయర్ల వాదనలను విన్న సుప్రీం ధర్మాసనం.. ఈ కేసు విచారణను ఏపీ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయడానికి సమ్మతించింది.
తన తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ సరిగా జరగడంలేదని, ఏపీలో కాకుండా విచారణ వేరే రాష్ట్రంలో జరిగేలా ఉత్తర్వులు ఇవ్వాలని వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వివేకా హత్య కేసులో సాక్షులను భయపెడుతున్నారని, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైన కూడా ప్రైవేట్ కేసులు పెడుతున్నారని తన పిటిషన్ లో సునీతారెడ్డి పేర్కొన్నారు. సునీతారెడ్డి పిటిషన్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం(అక్టోబర్19) విచారణ జరిపింది.
కేసు విచారణను తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు బదిలీ చేయాలా? అని సుప్రీంకోర్టు ప్రస్తావించినప్పుడు.. హైదరాబాద్ ఏపీకి దగ్గరగా ఉన్నందున విచారణను ప్రభావితం చేసే ఛాన్స్, సాక్షులను బెదిరించే అవకాశం ఉందని సీబీఐ తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. విచారణను కర్ణాటక సహా మరే ఇతర రాష్ట్రానికి బదిలీ చేసినా అభ్యంతరం లేదని వారు వెల్లడించారు. కేసు విచారణను ఢిల్లీకి బదిలీ చేయాలా? అనే ప్రస్తావన కూడా రావడం గమనార్హం.