కేతిరెడ్డి రాజకీయ సన్యాసం?
posted on Jul 31, 2024 @ 1:14PM
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వైసీపీకి రాజీనామా చేయడానికి సిద్ధమైనట్టు, రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా వుండగా ‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’ అంటూ ప్రజల్లో తిరిగేవారు. ఈసారి ఎన్నికలలో కేతిరెడ్డి ఓడిపోవాల్సిన వ్యక్తి కాదన్న అభిప్రాయాలు వున్నప్పటికీ, ఆయన మీద అవినీతి ఆరోపణలు కూడా అదే స్థాయిలో వున్నాయి. మొత్తానికి ధర్మవరంలో ఓడిపోయిన తర్వాత కేతిరెడ్డి పూర్తిగా డిప్రెషన్‌లో కూరుకుపోయారు. చాలాకాలం మనిషి బయటకి కూడా రాలేదు. కొంతకాలం తర్వాత తేరుకుని ఆయన బయటకి వచ్చినప్పటికీ ఆయన వైసీపీకి దూరంగానే వుంటూ వస్తున్నారు. వైసీపీకి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనడం లేదు. ఒక సందర్భంలో కేతిరెడ్డిని జగన్ తాడేపల్లి ప్యాలెస్‌కి పిలిచినప్పటికీ ఆయన వెళ్ళలేదు. కేతిరెడ్డి తన ఓటమి బాధ నుంచి ఇంకా కోలుకోనట్టే కనిపిస్తోంది. ఎప్పుడూ క్లీన్ షేవ్‌తో, కోరమీసంతో కనిపించే ఆయన గడ్డం పెంచేసుకుని కనిపిస్తున్నారు. కొంతకాలం రాజకీయాల నుంచి దూరంగా వుండాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఆయన ఏ రాజకీయ పార్టీలో వుండకూడదని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. సాధారణంగా రాజకీయ నాయకుల దగ్గరకి జనం వెళ్తారు. కానీ, తానే జనం దగ్గరకి వెళ్ళినప్పటికీ తనకు నిందలు, ఓటమి తప్ప ఏమీ మిగల్లేదని ఆయన బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే, రాజకీయాలకు దూరంగా వుండే ఉద్దేశంతో ఆయన వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. రెండు మూడు రోజుల్లో వైసీపీ అధినేతకు తన రాజీనామా లేఖను పంపనున్నట్టు తెలుస్తోంది.