ఏనుగులు మీద రాళ్లు విసిరారని.... నలుగురి అరెస్టు
posted on Mar 30, 2016 @ 11:32AM
కొంతమందికి మూగజీవాలను చూస్తే చేతులు ఊరుకోవు, తిరిగి దాడి చేయవనో, దాడి చేసినా తప్పించుకోవచ్చుననో... వాటని హింసించి పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు. కేరళలో జరిగిన ఒక సంఘటన కూడా ఇలాంటిదే! కాకపోతే, ఈ విషయం సోషల్ మీడియాలో పొక్కడంతో ఈసారి నిందితులు చట్టానికి చిక్కక తప్పలేదు. గత వారం కేరళలోని 212 జాతీయ రహదారి మీద జరిగిన ఈ ఘటనలో నలుగురు యువకులు, దారి పక్కన పిల్లతో కలిసి నిల్చొన్న ఓ ఏనుగు మీద విచక్షణారహితంగా రాళ్లు విసిరారు.
ఈ విషయాన్ని మరో కారులో ఉన్న వ్యక్తి వీడియో తీయడంతో, సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దుండగులు రాళ్లు విసురుతున్నంతసేపూ ఏనుగులు రెండూ నిస్సహాయంగా నిల్చొని ఉండటం, ప్రేక్షకులను కలచివేసింది. ఈ వీడియో ఆధారంగా రియాజ్, షమల్ హషీమ్, అబ్దుల్ రజాక్, షమీర్ అనే వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్లు తేలింది. మీడియా నుంచి పెరుగుతున్న ఒత్తిడికి తల ఒగ్గిన ప్రభుత్వ అధికారులు, వీరిని అదుపులోకి తీసుకున్నారు.