అవినీతిని అంతం చేస్తానంటూ.. అవినీతి ఆరోపణలతోనే పనతం.. కేజ్రీవాల్ ప్రస్థానం
posted on Feb 10, 2025 5:55AM
ఢిల్లీలో ఊపిరి పోసుకున్న అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ పార్టీగా ఎదిగి పంజాబ్ లో అధికారం కైవసం చేసుకుని 12ఏళ్లు ఢిల్లీని పరిపాలించి అవమానకర పరిస్థితుల్లో అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్, బీజేపీ లను వ్యతిరేకించిన పార్టీగా, అవినీతిని దనుమాడుతామంటూ రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆప్ ఆ తరువాత రాజకీయ పరమపద సోపానపటంలో అవినీతి అనే పెద్ద పాము చేతిని చిక్కి పతనమైంది. అవినీతిపై పోరాటం అన్న నినాదాన్ని పక్కన పెట్టి స్వయంగా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. అలాగే రాజకీయ చదరంగం కూడా ఆడి ఆ ఆటలో బీజేపీ ఎత్తులకు చిత్తైపోయింది. బీజేపీ వ్యతిరేక కూటమి అయిన ఇండియా కూటమిలో భాగస్వామి అయి కూడా తాజా ఎన్నికలలో ఒంటరిగా బరిలోకి దిగి.. చేజేతులా ఇండియా కూటమి ఓట్లు చీలి తన ఓటమికి కారణమయ్యేలా చేసుకుంది.
దశాబ్దానికి పైగా ఢిల్లీలో అధికారంలో ఉండి కూడా కనీసం సౌకర్యాల కల్పనలో విఫలమైంది. ఉచితాలనే నమ్ముకుని బొక్కబోర్లా పడింది. ఆప్ 2012లో పుట్టి,2013 ఢిల్లీ ఎన్నికల్లో మొదటిసారి కాంగ్రెస్ మద్దతుతో అధికారంలోకి వచ్చింది. 2015లో జరిగిన ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 67 స్థానాలు కైవసం అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఐదేళ్ల తరువాత .2020 లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కూడా కూడా62 స్థానాలు సాధించి సత్తా చాటుకుని అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే మళ్లీ ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుని పరాజయం పాలైంది. 26 ఏళ్లుగా బీజేపీకి అందని ద్రాక్షలా నిలిచిన హస్తిన పీఠాన్ని పువ్వుల్లో పెట్టి మరీ ఆ పార్టీకి ఈ సారి బీజేపీ 48 స్థానాలు కైవసం చేసుకుని అధికార పగ్గాలు అందుకుంది.
ఈ పరాజయానికి ఆప్ స్వయంకృతాపరాథమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరాజయంతో ఆప్ తాను స్వయంగా ఓడిపోవడమే కాకుండా.. ఇండియా కూటమి ఐక్యతను కూడా ప్రశ్నార్దకం చేసింది.
మిత్రధర్నాన్ని పాటించడానికి అహంకారంతో అంగీకరించకపోవడం కారణంగా, అంటే కాంగ్రెస్ తో పొత్తుకు నిరాకరించడం కారణంగా ఆప్ కనీసం 14 స్థానాలలో స్వల్న తేడాతో ఓడిపోయింది. ఆప్ పార్టీకి పోలైన ఓట్ల శాతం చూస్తే ఇది స్పష్టంగా అర్ధమౌతుంది. కాంగ్రెస్ కు పోలైన 7 శాతం ఓట్లు ఆప్ ఓటమిని లిఖించాయి. అన్నిటికీ మించి.ఈ ఎన్నికల్లో ఆప్ అధినేత అరవింద్ క్రేజీవాల్,ఆ పార్టీ కీలక నేత, మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా పరాజయం పాలయ్యారు. ఢిల్లీలో దెబ్బతిన్న రహదారులు, ప్లై ఒవర్లపై గుంతలు, తాగునీటి సమస్య .యమున జలాలను శుద్ధి చేస్తామని ఇచ్చిన హామీని పూర్తిగా విస్మరించడం, ఎన్నికలకు ముందు ఆ యమునా జలాలను కలుషితం చేస్తున్నది హర్యానాలోని బీజేపీ సర్కార్ అంటూ ఆరోపణలు చేసి అభాసుపాలు కావడం ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అలాగే ఢిల్లీలో పేరుకుపోతున్న చెత్త కూడా ఆప్ ను ప్రజలు ఊడ్చేయడానికి ఒక కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇప్పటి వరకూ ఆప్ తన పరాజయాన్ని తానే ఎలా శాశించుకుందో చెప్పుకున్నాం. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిపత్యానికి పకడ్బందీ వ్యూహాలతో, ప్రణాళికా బద్ధంగా బీజేపీ ఎలా చెక్ పెట్టిందో చెప్పుకుందాం. అవినీతిపై అలుపెరుగని పోరాటం అంటూ మొదలైన కేజ్రీవాల్.. ఆమ్ ఆద్మీ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించాలని ప్రణాళికలు రూపొందించారు. ఆ దిశగా గత పదేళ్లుగా అడుగులు వేశారు. పంజాబ్ లో అధికార పగ్గాలు ఆప్ చేతికి దక్కాయి. కానీ బీజేపీ ఆయన ఆశలకు, ఆకాంక్షలకు కళ్లెం వేసింది. సొంత రాష్ట్రంలోనే ఆప్ ను ఓడించింది. ఇందు కోసం ఆప్ లో చీలిక తీసుకువచ్చింది. పార్టీ నేతలను, క్యాడర్ ను పట్టించుకోకుండా వ్యవహరించిన కేజ్రీవాల్ పై సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయ్యేలా చేసింది. ముఖ్యంగా ఒకప్పుడు కేజ్రీవాల్ పార్టీలో కీలకంగా ఉన్న స్వాతి మలివాల్..ఆయనకు బద్ధ వ్యతిరేకిగా మారారు. ఆప్ నాయకుడు, కేజ్రీవాల్ సన్నిహితుడు తనపై దాడికి పాల్పడినా కేజ్రీవాల్ పట్టించుకోకపోవడమే స్వాతి మలివాల్ పార్టీలో రెబల్ గా మారడానికి కారణం. మౌలికసదుపాయాలు కల్పించడంలో విఫలమైన క్రేజీ వాల్ అనే నినాదాన్ని హైలైట్ చేసారు. క్రేజీవాల్ ఓటమిని సోషల్ మీడియాలో మహాభారతం లో "ద్రౌపతి వస్త్రాపహరణం"పోస్టర్ పెట్టి తన ఆక్రోశాన్ని తీర్చుకున్నారంటే పార్టీలో ఆయన పట్ల ఎంత వ్యతిరేకత గూడు కట్టుకుందో అర్దం చేసుకోవచ్చు. అంతే కాదు కేజ్రీవాల్ అహంకారాన్ని రావణాసురుడి గర్వంతో పోల్చారు.
అధికార,ధన దాహం, అవినీతి ఆప్ నైజం అంటూ బీజేపీ చేసిన ప్రచారం క్షేత్రస్థాయిలోకి వెళ్లిపోయింది. కేజ్రీవాల్ గురువు, అవినీతి వ్యతిరేక ఉద్యమ సారథ, సామాజిక ఉద్యమ కారుడు అన్నాహజారే కూడా ఆప్ పరాజయాన్ని స్వాగతించారు. ఇలా అన్ని వర్గాలలోనూ ఆప్ ప్రతిష్ట మసకబారింది. అందుకే మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన క్రేజీవాల్ ప్రస్థానం ఒక సామాన్యుడు పర్వేజ్ శర్మ చేతిలో 1844 ఓట్ల తేడాతో ఒటమిపాలయ్యారు. సొంత నియోజకవర్గంలో ఓటమితో ఆయన ఇక రాజకీయంగా పుంజుకోవడం కష్ట సాధ్యమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏదిఏమైనా అవినీతి నిర్మూలన నినాదంతో వెలుగులోకి వచ్చి జాతీయ పార్టీగా అవతరించి,ఆ అవినీతీ లోనే క్రేజీవాల్,ఆయన ప్రభుత్వం కొట్టుకుపోవడం రాజకీయ నాయకులకు,పార్టీలకు ఒక గుణపాఠంగా మిగులుతుందన్నడంలో సందేహం లేదు.