కేజ్రీవాల్ ఓటమితో కవిత మళ్లీ జైలుకు? బిఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్
posted on Feb 9, 2025 @ 6:32PM
ఢిల్లీ లిక్కర్ స్కాం మరో మారు చర్చనీయాంశమైంది.ఢిల్లీ ఫలితాలు బిజెపికి అనుకూలంగా ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా రావడమే దీనికి ప్రధాన కారణం. ఆమ్ ఆద్మీ పార్టీ హాయంలో కేబినేట్ భేటీలో నిర్ణయాలు తీసుకోకుండానే లిక్కర్ పాలసీ అమలయ్యింది. ఈ పాలసీ అమలుకు పెద్ద ఎత్తున చేతులు మారాయి. కోట్లాది రూపాయల స్కాం జరగడంతో ముఖ్యమంత్రి హోదాలో కేజ్రీవాల్,డిప్యూటి సిఎం హోదాలో మనీష్ సిసోడియా జైలుపాలయ్యారు.బెయిల్ పై వీరు బయటకొచ్చి బిజెపి ని నిందించారు. తమను బిజెపి కుట్ర పూరితంగా ఇరికించినట్టు ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే ప్రచారం చేసినప్పటికీ ప్రజలు పెద్దగా స్పందించలేదు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా నేతృత్వం వహిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీని వోటర్లు తిరస్కరించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని బిజెపి ఇప్పటికే ప్రకటించింది. ఢిల్లీ సచివాలయం నుంచి ఒక్క కాగితం బయటకు వెళ్లకూడదని ఆదేశాలు జారి అయ్యాయి. ఢిల్లీ సచివాలయం దాదాపు సీజ్ అయినంత పనయ్యింది. మేం అధికారంలో వస్తే ఢిల్లీలో పదేళ్లు అధికారంలో ఉన్నఆమ్ ఆద్మీ పార్టీ పై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని బిజెపి ఎన్నికల ప్రచారంలో వెల్లడించింది. తాను జైలుకు వెళ్ల కూడదని కోరుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకే వోటు వేయాలని కేజ్రీవాల్ ప్రచారం చేశారు. ఆయన ప్రచారాన్ని ప్రజలు పెద్దగా రిసీవ్ చేసుకోలేదు. ఇప్పుడు ఢిల్లీ ఫలితాలు బిజెపి కి అనుకూలంగా రావడంతో కేజ్రీవాల్ మళ్లీ జైలుకు వెళతారని అర్థం చేసుకోవాలి. ఢిల్లీలో బిజెపి గెలుపు తర్వాత బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు పెద్ద దుమారం రేపింది. ఢిల్లీలో బిజెపిని గెలిపించినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆయన అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. .ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి బిఆర్ ఎస్ ప్రధాన కారణమని తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు కౌంటర్ ట్వీట్ లు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ముఖ్యభూమిక వహించారు.లిక్కర్ పాలసీ అమలు కావడానికి వీరు ప్రధాన కారకులని న్యాయనిపుణులు పేర్కొన్నారు. ఇదే కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు జైలుపాలయ్యారు. తెలంగాణలో బిఆర్ఎస్ ఓటమి తర్వాత లిక్కర్ స్కాం అప్పట్లో తెరమీదకు వచ్చింది. ఇదే కేసులో బిఆర్ఎస్ ఎంఎల్ సి కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. బిఆర్ ఎస్ అవసరం లేకపోవడంతో కవిత అరెస్ట్ జరిగిందని అప్పట్లో బిఆర్ఎస్ ప్రచారం చేసింది. బిఆర్ ఎస్ పార్టీని బిజెపి లో విలీనం చేయలన్న కండిషన్ ను కెసీఆర్ తిరస్కరించినట్టు కూడా ప్రచారం జరిగింది. రాజకీయ ప్రయోజనాలు కూడా పెద్దగా లేకపోవడంతో బిఆర్ ఎస్ ను బిజెపి పూర్తిగా పక్కన పెట్టేసింది. దీంతో తీహార్ జైల్లో ఎక్కువకాలం కవిత ఊచలు లెక్కబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ కు బద్ద శత్రువైన బిజెపి బిఆర్ఎస్ కు సపోర్ట్ ఇవ్వకపోవడంతో బిఆర్ఎస్ ఇరుకునపడిపోయింది. కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్నఇండియా కూటమిలో బిఆర్ఎస్ లేకపోవడంతో బిజెపి పెద్దలకు దగ్గరవ్వాలన్న బిఆర్ఎస్ ప్రయత్నాలు ఫలించలేదు. లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ ను కవిత లీడ్ చేశారు. ఈ సౌత్ గ్రూప్ ఢిల్లీ ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తెచ్చుకుంది. రాజులు తల్చుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్టు రెండు ప్రభుత్వాలు అధికార దుర్వియోగానికి పాల్పడ్డాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బిఆర్ఎస్ నేతలు లిక్కర్ స్కాంలో నిందితులు కావడంతో ఢిల్లీ ఫలితాలు వారి గుండెల్లో రైలు పరుగెత్తిస్తున్నాయి. బెయిల్ పై బయట ఉన్న కవితను మళ్లీ జైలుకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కవిత జైలు నుంచి విడుదలయ్యాక క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. ఇప్పుడిప్పుడే ఆమె తెలంగాణ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. కవితకు స్పీడ్ బ్రేక్ వేసే పనిలో బిజెపి ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో బిఆర్ఎస్ లేకపోవడంతో లిక్కర్ స్కాంను బిజెపి ప్రభుత్వం మళ్లీ వెలికి తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.