ద‌గ్గుపాటికి...వివాదాలు ప‌రిపాటి?

Publish Date:Jan 14, 2026

  పండ‌గ పూట నారా వారి కుటుంబ‌మంతా నారావారి ప‌ల్లెలో సంబ‌రాల్లో మునిగి తేలుతుంటే.. అనంత  ఎమ్మెల్యే వివాదం ఒక‌టి పండ‌గ స్పెష‌ల్ గా తెర‌పైకి వ‌చ్చింది. అనంత అర్బ‌న్ ఎమ్మెల్యే ద‌గ్గుపాటి ప్ర‌సాద్ రాన్రాను వివాదాస్ప‌దంగా మారుతున్నారు. తాజాగా ఆయ‌న‌పై ఒకే సారి రెండు ఆరోప‌ణ‌లు. ఒక‌టి నంబూరి వైన్స్ య‌జ‌మానిని డ‌బ్బు కోసం ప‌లు మార్లు ఫోన్లు చేసి బెదిరించ‌డం మాత్ర‌మే కాకుండా.. ఆయ‌న వైన్స్ ని కూడా త‌గ‌ల‌బెట్టించారు.  నంబూరి న‌ల‌భై ఏళ్ల నుంచి టీడీపీలో సిన్సియ‌ర్ కార్య‌క‌ర్త‌గా  కొన‌సాగుతున్నారు. త‌న‌లాంటి టీడీపీ వారి మీదే ద‌గ్గుపాటి ఇంత ప్రతాపం చూపిస్తుంటే.. ఇక సాధార‌ణ మైన వారి  ప‌రిస్థితి ఏంట‌న్న‌ది ఆయ‌న ప్ర‌శ్నిస్తున్న విధం. ఇక ఇదే ద‌గ్గుపాటి పై రాష్ట్ర లింగాయ‌త్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ అయిన  స్వ‌ప్న అనే మ‌హిళ త‌న  భూమి క‌బ్జా చేసిన‌ట్టుగా ఆరోప‌ణ‌లు చేశారు. అనంతపురంలో ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అయితే ఆ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్దీన్ మీద ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనుచరులు దాడిచేశారని ఆరోపణలు వచ్చాయి. ఎగ్జిబిషన్ నిర్వాహకుడిని బెదిరించారంటూ సోమవారం ఆరోపణలు వచ్చాయి. అలాగే ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్ధీన్ ఈ విషయం మీద అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారాం, ఎమ్మెల్యే గన్‌మెన్ షేక్షా మద్యం సేవించి ఎగ్జిబిషన్ వద్ద వీరంగం సృష్టించారని ఫిర్యాదు చేశారు. పది లక్షల రూపాయలు ఇవ్వాలంటూ తనను బెదిరించారంటూ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్ధీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ‌తంలో ద‌గ్గుపాటి మీద జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అన‌వ‌స‌రంగా  రెచ్చ‌గొట్టిన ఆరోప‌ణ‌లున్నాయి. ఆ ఆడియో కాల్ తో స‌హా బ‌య‌ట ప‌డి  నానా ర‌భ‌స కింద త‌యారైంది. లోకేష్ ఆ టైంలో హెచ్చ‌రించారు కూడా. అయినా స‌రే ద‌గ్గుపాటి కి ఇలాంటి వివాదాలు ఒక ప‌రిపాటిగా  మారింది. ఇప్ప‌టికే కొలికిపూడి వంటి ఎమ్మెల్యేల‌తో అధిష్టానానికి త‌ల బొప్పి క‌డుతోంది.  తాజాగా ద‌గ్గుపాటి  కూడా త‌యార‌య్యారు. అయితే ఇవ‌న్నీ ఆధారాలుండి బ‌య‌ట ప‌డ్డ ఎమ్మెల్యే బాగోతాల‌నీ. ఇదే రాయ‌ల‌సీమ‌లో ఒక కూట‌మి  ఎంపీని కూట‌మి  ఎమ్మెల్యే లంచం డిమాండ్ చేసిన విధం రాష్ట్ర‌మంతా పాకింది. వీరే  కాదు.. మొత్తం 48 మంది ఎమ్మెల్యేల‌ను సాక్షాత్ చంద్ర‌బాబే పిలిచి వార్నింగిచ్చారు. ప‌ద్ధ‌తి మార్చుకోకుంటే క‌ష్ట‌మేన‌ని తేల్చి చెప్పారు. ఇలాంటి అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న వారు సుమారు 70 మంది వ‌ర‌కూ ఉన్న‌ట్టు కొన్ని అంచ‌నాలున్నాయి. కాబ‌ట్టి.. అధినేత చంద్ర‌బాబు వీరంద‌రిపై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీస్కోకుంటే క‌ష్ట‌మేన‌ని తెలుస్తోంది.

తమిళనాట కొత్త పొత్తు పొడుపు?

Publish Date:Jan 14, 2026

జననాయకన్ సినిమా విడుదల, కరూర్ తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. ఇలా తమిళనటుడు, టీవీకే అధినేత విజయ్ ను కష్టాలు ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా వెంటాడుతున్నాయి. సొంత పార్టీ ఏర్పాటు చేసి, ఈ ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమౌతున్న వేళ విజయ్ ను నాన్ స్టాప్ గా కష్టాలు వెంటాడుతున్నాయి. విజయ్ తన చివరి చిత్రంగా ప్రకటించిన జననాయకన్ సినిమా ఈ పండుగ సందర్భంగా విడుదల అయ్యే అవకాశం లేకుండా పోయింది. సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో విషయం కోర్టు మెట్లెక్కింది. దానికి తోడు  క‌రూర్  తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఇప్పటికే గంటల తరబడి విజయ్ ను విచారించిన సీబీఐ మరో మారు ఈ నెల 19న విచారణకు రావాలని నోటీసులు పంపింది.   అయితే ఈ వేధింపుల వెనుక ఉన్నది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయేనని పరిశీలకులు అంటున్నారు. తమిళనాట ఇసుమంతైనా స్టేక్ లేని బీజేపీ విజయ్ తో పొత్తు ద్వారా రాష్ట్రంలో పాగా వేయాలనే ఉద్దేశంతోనే వ్యూహాత్మకంగా విజయ్ ను చక్రvgధంలో ఇరికిస్తోందన్న వ్యాఖ్యలూ వినవస్తున్నాయి. ఇక విజయ్ కు కమలంలో దోస్తీకి సై అనక తప్పదన్న విశ్లేషణలూ వెలువెడ్డాయి. అయితే అనూహ్యంగా విజయ్ కు కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ మద్ద తుగా నిలిచారు.   విజ‌య్ పై  వేధింపుల‌కు పాల్ప‌డ్డం అది త‌మిళ సంప్ర‌దాయాల‌ను భంగ‌ప‌ ర‌చ‌డ‌మే  అవుతుంద‌ని రాహుల్ విమర్శించారు.  దీంతో విజయ్ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తుపొడుపునకు అవకాశాలున్నాయా అన్న చర్చకు తెరలేచింది.  ఇప్పటికే విజ‌య్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో తమ పార్టీ  ఎవరితోనూ పొత్తు లేకుండా స్వతంత్రంగానే రంగంలోకి దిగుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. త‌మ‌కు డీఎంకేతో స్థానిక రాజ‌కీయ విబేధాలుంటే, కేంద్ర‌ంలోని  బీజేపీతో సైద్ధాంతిక విబేధాలున్నాయ‌ని చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కూ డీఎంకేతో కలిసి ఉన్న కాంగ్రెస్ స‌డెన్ గా విజ‌య్ కి మద్దతుగా గళం విప్పడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. తమిళనాట కొత్త పొత్తు పొడుపునకు ఇది సంకేతమా అన్న చర్చా జోరుగా సాగుతోంది.  తొలి నాళ్ల‌లో త‌మిళ‌నాట‌ కాంగ్రెస్ పార్టీ బ‌లంగానే ఉన్నా.. ఆ త‌ర్వాత డీఎంకే, ఏఐడీఎంకే రూపంలో ఈ రెండు పార్టీలే ఇక్క‌డ అధికారం పాల్పంచుకుంటూ వ‌స్తున్నాయి.  కేసీఆర్ లాంటి వారికి ఈ డీఎంకే అన్నాడీఎంకే పాలసీ  ఎంతో ఇష్టం. త‌న కొడుకు కేటీఆర్, అల్లుడు హ‌రీష్ కూడా ఇలాగే రెండుగా  చీలి.. ఇక్క‌డ అధికారం ఎవ‌రో ఒక‌రు పాల్పంచుకోవాల‌ని ఆశిస్తారాయ‌న‌.  అంత‌గా తమిళనాట స్థానిక రాజ‌కీయాలు గ‌త కొన్నేళ్లుగా పాతుకుపోయాయి. ఇప్పుడు డీఎంకే త‌ర్వాతి త‌రానికి కూడా బ‌లంగా  క‌నిపిస్తున్నా అన్నాడీఏంకేకి జ‌య‌ల‌లిత త‌ర్వాత ఒక దిక్కంటూ లేక పోయింది. శ‌శిక‌ళ రూపంలో బలమైన నాయకురాలు ఉన్నా.. మోడీ  కార‌ణంగా ఆమె అన్నాడీఎంకేకీ ఏమీ కాకుండా పోయారు. ఈ  స్థానంలో ఇక్క‌డ బీజేపీ  పాతుకుపోవాల‌ని తెగ ప్ర‌య‌త్నిస్తుంటే మ‌ధ్య‌లో తమిళనాట అశేష అభిమానం సంపాదించుకున్న హీరో విజయ్.   టీవీకే పార్టీ ఏర్పాటు చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసిన విజయ్ అంటే బీజేపీకి ఆగ్రహం.  దానికి తోడు విజ‌య్ కూడా మెర్స‌ల్ వంటి సినిమాల ద్వారా బీజేపీ వ్య‌తిరేక వాణి వినిపించిన ప‌రిస్థితి గ‌తంలో ఉంది.  వ‌చ్చే త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య్ పార్టీ టీవీకే పోటీ  చేయ‌నుండ‌టం.. బీజేపీతో ఎలాంటి  పొత్తు ఉండ‌ద‌ని విజ‌య్ ప్ర‌క‌టించ‌డంతో.. ఆయ‌న‌ను వీలైనంతగా త‌మ దారిలోకి తెచ్చుకోడానికి  బీజేపీ అగ్రనాయకత్వం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. దీనిని విజయ్ ఎలా ప్రతిఘటిస్తారు? రాహుల్ విజయ్ కు మద్దతుగా గళం విప్పడం వెనుక కారణమేంటి? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ పార్టీ ప్రభావం ఏ మేరకు ఉండనుంది?  తేలాల్సి ఉంది.

మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

Publish Date:Aug 28, 2025

  ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు. కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్‌ మధ్య ఎలాంటి విభేదాలు లేవని  ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ స్పష్టం చేశారు.  . రాష్ట్రీయ స్వయం సేవక్‌  సంఘ్‌ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్‌ భగవత్‌..  బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్‌ఎస్‌ఎస్‌ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం  .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.  నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్‌ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్ణయాలు తీసుకుంటుందని  ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.  

మూలాల ముంగిలికి లాక్కెళ్లే పండుగ.. సంక్రాంతి..!

Publish Date:Jan 14, 2026

  పండుగ అంటే అదొక  ఆనందం.  చదువులు, వృత్తి, ఉద్యోగం, సౌకర్యాలు.. ఇలా కారణాలు ఏవైనా సరే..  పట్టణంలో ఉన్నవారు పండుగ వచ్చిందంటే చాలు పల్లె బాట పడతారు. తెలుగు వారు ఎంతో సంబరంగా చేసుకునే పండుగలలో సంక్రాంతికి ఓ రేంజ్ ఉంది.  భోగి, సంక్రాంతి, కనుమ.. పేరిట ముచ్చటగా మూడురోజులు జరిగే ఈ పండుగ వైభోగం గ్రామాలలో మాత్రమే కనిపిస్తుంది. భోగి మంటలు, భోగి పళ్లు..  పొంగళ్లు, పిండి వంటలు.. పశువుల అలంకరణ,  కోడి పందేలు.. కొత్త అల్లుళ్లకు చేసే మర్యాదలు.. ప్రేమ, అభిమానం, ఆప్యాయత.. ఒక్కటనేమిటి? సంక్రాంతి పండుగలో లేనిదంటూ ఏదీ లేదు.. భోగి మంటలు, భోగి పళ్లు.. జనవరి 13వ తేదీన భోగి పండుగ.  ఈరోజు ఉదయాన్నే చలికి సవాల్ విసురుతూ ఉదయాన్నే లేచి భోగి మంటలు వేయడం చాలా చోట్ల కనిపిస్తుంది. ఇంట్లో ఉన్న పాత సామాను నుండి పిడకల హారం వరకు భోగి మంటలలో వేస్తారు.   ఇక ఇదే రోజు సాయంత్రం చిన్న పిల్లలకు భోగి పళ్లు పోస్తారు. ఈ భోగి పళ్లలో చెరకు ముక్కలు,  రేగు పళ్లు,  చిల్లర పైసలు, పువ్వులు ఉంటాయి.  ఇలా భోగి పళ్లు పోయడం వెనుక పురాణ కథనం ఉంది.  భోగి పండుగ రోజే బదరీ వనంలో  శ్రీహరిని పసిబిడ్డగా మార్చి దేవతలందరూ రేగుపళ్లు పోశారట.  బదరీ పళ్లనే రేగు పళ్లు అంటారు.  అందుకే కాల క్రమేణా భోగి రోజు చిన్న పిల్లలకు భోగి పళ్లు పోయడం ఆచారం అయ్యింది.  పిల్లలకు భోగి పళ్లు పోస్తే ఆ శ్రీహరి ఆశీస్సులు ఉంటాయని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు. పొంగల్.. సంక్రాంతి.. మూడు రోజులు జరిగే సంక్రాంతి పండుగలో రెండవ రోజు ప్రధాన పండుగ అయిన సంక్రాంతి జరుపుకుంటారు. సంక్రాంతి పండుగను పొంగళ్ల పండుగ అంటారు. ఈ రోజు సూర్యుడి గమనం మారుతుంది.  సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. అది కూడా మకర రాశిలోకి ప్రవేశిచడం వల్ల దీనికి మకర సంక్రాంతి అని పేరు వచ్చింది. సంక్రాంతి రోజు పొంగళ్లు వండి నైవేద్యం పెడతారు. చాలా చోట్ల రథం ముగ్గులు వేసి సూర్యుడికి స్వాగతం చెబుతారు.  ఈ రోజు చేసే దాన ధర్మాలకు చాలా ప్రాముఖ్యత ఉంది.  కొత్తగా పెళ్లైన వారు ఈ పండుగను అత్తారింట్లో చేసుకోవడం, సావిత్రి గౌరీ వ్రతం చేసుకోవడం జరుగుతుంది. కనువిందు చేసే కనుమ.. సంక్రాంతి పండుగ ముఖ్యంగా రైతన్నల పండుగ. ఈ రోజు  రైతులు తమకు పంటలు పండించడంలో సహాయపడే పశువులకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు. పశువులను చాలా మంది తమ కుటుంబంలో భాగంగా చూస్తారు.  పశువులకు స్నానం చేయించి అందంగా అలంకరిస్తారు. పశువులకు విశ్రాంతిని ఇస్తారు.  కొత్త పంట చేతికి వచ్చిన ఆనందంలో  సంబరాలు చేసుకుంటారు.  కోనసీమ ప్రాంతాలలో కోడి పందెల సందడి సాగుతుంది.  కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారతాయి. కోడి పుంజుల పౌరుషాలు, వాటిలో పోరాట పటిమ ముక్కున వేలేసుకునేలా చేస్తాయి.  సంక్రాంతి పండుగంటే పల్లెలదే.. పండుగ ఆస్వాదించాలంటే పల్లెకు పోవాల్సిందే..!                           *రూపశ్రీ.
[

Health

]

చదువుకీ గుండెపోటుకీ సంబంధం ఉంది!

Publish Date:Jan 13, 2026

  బాగా చదువుకోరా మంచి ఉద్యోగం వస్తుంది! అని చెబుతుంటారు తల్లిదండ్రులు. మంచిగా చదువుకుంటే నలుగురూ గౌరవిస్తారు అని హెచ్చరిస్తుంటారు శ్రేయోభిలాషులు. చదువుకుంటే విచక్షణ, విజ్ఞానం అలవడతాయి అని ఊరిస్తుంటారు పెద్దలు. కానీ బాగా చదువుకోండి నాయనా, మీకు గుండెపోటు రాకుండా ఉంటుంది అని చెబుతున్నారు పరిశోధకులు.   భారీ పరిశోధన ఆస్ట్రేలియా అభివృద్ధి చెందిన దేశమే కావచ్చు. కానీ అక్కడ గుండెపోటుతో చనిపోతున్నవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోందట. అక్కడ ప్రతి 27 నిమిషాలకీ ఒకరు గుండెపోటుతో మరణిస్తున్నారు. పరిస్థితి ఇలా అదుపు తప్పిపోవడంతో, గుండె ఆరోగ్యానికి సంబంధించి అక్కడ ఓ భారీ పరిశోధన మొదలైంది. ఇందులో భాగంగా 2,67,153 మంది ఆరోగ్యాలను పరిశోధకులు గమనించారు. వీరంతా కూడా 45 నుంచి 64 ఏళ్ల వయసువారే!   డిగ్రీ - గుండెపోటు డిగ్రీ చదివినవారితో పోలిస్తే, హైస్కూలుతో చదువుని ఆపేసినవారు గుండెపోటుకి లోనయ్యే ప్రమాదం ఎక్కువని పరిశోధనలో తేలింది. వీరు గుండెపోటుకి లోనయ్యే అవకాశం, ఏకంగా 150 శాతం ఎక్కువగా ఉన్నట్లు బయటపడింది. ఇక ఇంటర్మీడియట్‌ చదువుని ముగించినవారేమో దాదాపు 70 శాతం ఎక్కువగా గుండెపోటుకి లోనవుతున్నట్లు గమనించారు.   ఇవీ విశ్లేషణలు చదువుకీ, గుండెపోటుకీ మధ్య ఉన్న సంబంధం స్పష్టంగా తేలిపోవడంతో... అందుకు కారణం ఏమిటన్న విశ్లేషణలు మొదలయ్యాయి. ఉన్నత చదువుతో మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంటుంది. అలా ఆర్థికంగా మంచి స్థితిలో ఉండటంతో పోషకాహారాన్ని, మెరుగైన వైద్యాన్ని స్వీకరించే అవకాశం ఉంది. ఇక చదువు వల్ల ఆరోగ్యపు అలవాట్ల మీద, రకరకాల వ్యాధుల మీదా ఓ అవగాహన ఏర్పడే సౌలభ్యం ఎలాగూ ఉంటుంది.   ప్రయోగం వల్ల ఉపయోగం ఈ పరిశోధన ద్వారా చిన్నిపిల్లలకైతే  ‘బాగా చదువుకోండిరా బాబూ! మీ ఆరోగ్యాలు కూడా బాగుంటాయట’ అని చెప్పగలం. కానీ ఓ నలభై ఏళ్లు దాటినవారికి ఏం చెప్పాలి. అందుకనే ఈ పరిశోధన లక్ష్యం చదువు ఆవశ్యకత గురించి చెప్పడమే కాదు. చదువుకోనివారిలో అనారోగ్య సమస్యలు ఎక్కువని తేలితే... వారిలో తగిన అవగాహననీ, వైద్య సదుపాయాలనీ కల్పించే ప్రయత్నం చేయడం.     - నిర్జర.