అయ్య బాబోయ్.. గోల్డ్ స్మగ్లింగ్ ఇలాగా..
posted on Apr 3, 2021 @ 4:22PM
బంగారం తరలించడంలో స్మగ్లర్లు రోజురోజుకు కొత్త కొత్త విధానాలు ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఎవరికి అనుమానం రాకుడా ఉండేందుకు లోదుస్తులు, పురుషాంగాల్లో సైతం బంగారాన్ని దాచి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. కానీ గోల్డ్ స్మగ్లింగ్ పై నిత్యం కస్టమ్స్ అధికారులు దాడులు చేస్తున్నారు. స్మగ్లర్లు ఏ ఎత్తు వేసి దొంగ పోలీస్ ఆట ఆడిన.. ఆ ఆటను చిత్తు చేస్తున్నారు అధికారులు. వాళ్ళు ఎన్ని జిత్తులు వేసి జిమ్మిక్కులు చేసిన చివరికి అధికారుల చేతికి చిక్కుతున్నారు. తాజాగా లోదుస్తుల్లో బంగారాన్ని తరలిస్తున్న ఓ కిలాడీ లేడీ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అధికారులకు పట్టుబడింది. షార్జా నుంచి వచ్చిన మహిళ వద్ద 548 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
ఎయిర్ అరేబియా విమానం జీ–9458లో షార్జా నుంచి ఓ మహిళ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. అయితే ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు చేపట్టిన కస్టమ్స్ అధికారులకు ఆ మహిళ ప్రవర్తనపై అనుమానం వచ్చింది. దీంతో ఆ మహిళను అదుపులోకి తీసుకుని క్షుణంగా తనిఖీ చేశారు. దుస్తుల్లో దాచిన బంగారాన్ని అధికారుల బృందం ఆమెతోనే తీయించారు. మొత్తంగా ఆమె వద్ద నుంచి 48 గ్రాముల బరువు గల బంగారం స్వాధీనం చేసుకున్నామని దాని విలువ రూ.25.4 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మరో ఘటనలో హైదరాబాద్ నుంచి విదేశాలకు కరెన్సీ తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని అధికారులు పట్టుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి షార్జా వెళ్లేందుకు వచ్చిన ఓ ప్రయాణికుడిని సీఐఎస్‌ఎఫ్ అధికారులు తనిఖీ చేశారు. అతడి వద్ద నుంచి రూ. 8.4 లక్షల విలువ చేసే ఫారెన్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.