బాస్ ఈజ్ బ్యాక్.. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ భేటీ
posted on Mar 11, 2025 @ 10:12AM
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా ఆయన మంగళవారం బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. మంగళవారం (మార్చి 11) తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు.
అలాగే అసెంబ్లీ సమావేశాలలో అనసరించాల్సిన వ్యూహం, రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సభలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా సభ్యులు వ్యవహరించాలని మార్గదర్శనం చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం (మార్చి 12) నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నెల 17 లేదా 19న ప్రభుత్వం సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.
గత ఎన్నికలలో ఓటమి తరువాత బీఆర్ఎస్ఎల్పీ నేతను ఎన్నుకునే విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అయిష్టంగానే కేసీఆర్ బీఆర్ఎస్ శాసన సభా పక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచీ ఆయన బీఆర్ఎస్ఎల్పీ నేతగా క్రియాశీలంగా వ్యవహరించింది లేదు. అసలు కేసీఆర్ ఇంత వరకూ కేవలం ఒక్కసారంటే ఒక్కసారి మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే ఇప్పుడు ఆయన ఈ సారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వవైఫల్యాలపై సభలో గొంతెత్తాలని భావిస్తున్నారు.