విజయసాయికి ఏపీ సీఐడీ నోటీసులు
posted on Mar 11, 2025 @ 9:53AM
రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుని, వ్యవసాయమే నా వ్యాపకం అంటే రాజ్యసభ సభ్యత్వానికీ, వైసీపీ పార్టీకీ రాజీనామా చేసినా విజయసాయిరెడ్డిని కేసులు వదలడం లేదు. చేసిన తప్పులు దండంతో సరిపెట్టేద్దామంటే కుదరదనీ, కర్మఫలం అనుభవించక తప్పదనీ విజయసాయికి ఇప్పుడిప్పుడే అర్ధమౌతోంది.
తాజాగా వైసీపీ మాజీ నాయయుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. కాకినాడ సీపోర్టు, కాకినాడ సెజ్ కేసులలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఏపీ సీఐడీ విజయసాయికి నోటీసులు జారీ చేసింది. కాకినాడ సీపోర్టు వాటాల బదలీ కేసులో ఏపీ సీఐడీ ఈ నోటీసులు జారీ చేసింది. కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ కాకినాడ సెజ్ లలో రూ. 3,600 కోట్ల విలువైన వాటాలను వాటి యజమానినైన తన నుంచి బలవంతంగా తీసుకున్నారంటూ కేవీరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ 506, 384, 420, 109, 467, 120(బి) రెడ్ విత్ 34 సెక్షన్ల కింద నోటీసులు ఇచ్చింది.
విజయసాయిరెడ్డి నివాసానికి వెళ్లిన సీఐడీ అధికారులు ఆయన అందుబాటులో లేకపోవటంతో ఆయన సతీమణికి నోటీసులు అందజేశారు. ఈ కేసులలో విజయవాడ సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో ఆదేశించారు. బుధవారం (మార్చి 12)న విజయసాయి సీఐడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది.
ఈ కేసులో విజయసాయిరెడ్డి ఏ2 కాగా, జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డి ఏ1గా ఉన్నారు. ఈ కేసులో మనీలాండరింగ్ కూడా జరిగినట్టు గుర్తించిన ఈడీ.. రెండు నెలల క్రితమే విజయసాయిరెడ్డిని విచారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే కేసులో విచారణకు సీఐడీ రంగంలోకి దిగింది.