మ్యానిఫెస్టో లేకుండానే ఎన్నికలకు?.. కేసీఆర్ వ్యూహమేంటో?
posted on Jul 19, 2023 @ 5:01PM
మేనిఫెస్టో.. ఎన్నికలలో రాజకీయ పార్టీలకు అసలు సిసలైన అను అస్త్రం ఇదే. ఐదేళ్ల తమ పాలనలో ప్రజలకు చేయబోయే సంక్షేమం, రాష్ట్రానికి చేయబోయే అభివృద్ధి, తమ ప్రభుత్వ పాలసీలు, తమ ప్రభుత్వ ప్రాధాన్యతను తెలియజేస్తూ ప్రజలకు ఇచ్చే హామీనే మ్యానిఫెస్టో అంటారు. ఈ మ్యానిఫెస్టో కోసం రాజకీయ పార్టీలు రకరకాల ఆలోచనలు, మేధావుల నుండి సలహాలు, వ్యూహకర్తలు సూచనలను తీసుకొని సిద్ధం చేస్తుంటారు. ఈ మ్యానిఫెస్టోలో ఇచ్చే హామీలను ఎంతవరకు నెరవేరుస్తారన్నది పక్కన ఉంచితే.. ఇది సిద్ధం చేయడంలో మాత్రం రాజకీయ పార్టీలు రకరకాల ఎత్తులు వేస్తుంటాయి. తెలంగాణ విషయానికి వస్తే గత రెండు పర్యాయాలు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజా మ్యానిఫెస్టోగా తీసుకొచ్చారు. అయితే, ఈసారి మాత్రం కొత్తగా మ్యానిఫెస్టో అనేది లేకుండానే ఎన్నికలకు వెళ్లాలని ఆలోచన చేస్తున్నారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతున్నది.
గత రెండు పర్యాయాలలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, మరెన్నో అభివృద్ధి పనులను చేసుకుంటూ వచ్చామని.. ఇప్పుడు వాటిని కొనసాగిస్తూ వెళ్తే సరిపోతుందని, గత రెండు పర్యాయాలలో హామీలు ఇచ్చి నెరవేర్చని వాటిని వచ్చే ప్రభుత్వంలో చేస్తామని హామీ ఇస్తూ ముందుకు వెళ్లడమే మంచిదని కేసీఆర్ భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అమలవుతున్న పథకాలు, కొనసాగుతున్న అభివృద్ధిలో లోటు పాట్లుంటే సరిదిద్దుకుని మరింత మెరుగ్గా అమలు చేస్తామని చెబితే సరిపోతుందని సీఎం కేసీఆర్ సన్నిహితుల వద్ద మాట్లాడినట్లు ఓ ప్రచారం బయటకి వచ్చింది. నిజానికి గడచిన రెండు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కొన్నింటిని కేసీఆర్ ఇంకా అమలు చేయాల్సి ఉంది.
దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, కేజీ టూ పీజీ ఉచిత విద్య ఇప్పటికీ నెరవేరలేదు. దళితబంధు, డబుల్ బెడ్ రూం ఇల్లు అందాల్సిన లబ్ది దారులు ఇంకా ఎందరో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. వీటన్నిటినీ వచ్చే ప్రభుత్వంలో అమలు చేస్తామన్న హామీయే మ్యానిఫెస్టోగా ఉంటే సరిపోతుందని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు, పేదల కోసం, విద్యార్ధుల కోసం బీఆర్ఎస్ పార్టీ అనేక హామీలను ఇచ్చేసింది. అలాగే ఉద్యమ సమయంలో చేసిన హామీలు కూడా ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయి. అందుకనే కొత్తగా హామీలు ఇవ్వాల్సిన అవసరం ఏముందన్నది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తున్నది. ఇపుడు అమలవుతున్నవి అలా కొనసాగిస్తూ, అమలుకు నోచుకోని వాటిపై దృష్టిపెట్టి ప్రతిపక్షాల నుండి విమర్శలు రాకుండా చేసుకోవాలన్నది కేసీఆర్ భావనగా పరిశీలకులు చెబుతున్నారు.
అయితే, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇందుకు ఒప్పుకుంటారా అన్నదే చూడాల్సి ఉంది. ఎన్నికలంటే మ్యానిఫెస్టో.. మ్యానిఫెస్టోతోనే ఎన్నికలు అనేలా ఉంది ఇప్పడు పరిస్థితి. అలాంటిది మ్యానిఫెస్టో లేకుండా ఎన్నికలకంటే అది ఒక విధంగా సాహసమే అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పటికే కీలకమైన హామీలను ప్రజలలోకి తీసుకెళ్తుంది. ముఖ్యంగా దళితులకు మూడెకరాల భూమి, దళిత సీఎం అనే ప్రచారాన్ని ప్రజలోకి తీసుకెళ్తున్న కాంగ్రెస్.. కర్ణాటక తరహా ప్రజా మ్యానిఫెస్టోను తెలంగాణలో కూడా ప్రకటించాలని చూస్తున్నది.
ఇలాంటి సమయంలో ఇప్పుడు చేసేదే చేస్తాం.. చేయనివి ఏమైనా ఉంటే అవి కూడా చేస్తామని చెప్తే జనం నమ్మే పరిస్థితి ఉండదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త హామీలను ఇచ్చుకుంటూ వెళ్తేనే రాజకీయ పార్టీలకు ఆదరణ. ఫ్రీ ఫ్రీ అంటూ ఓటర్లను ఊరిస్తేనే తమ బ్యాలెట్ బాక్సులు నిండేది. మీ కులానికి ఇది మీ మతానికి ఇది అంటూ పంచి పెడతామంటేనే వేలు మీద సిరా పడేది. అవేమీ లేకుండా ఎన్నికలంటే కిక్కు ఉండదు.. ఓట్లు రాలడం కూడా అనుమానమే. మరి కేసీఆర్ సాబ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.