ఇండియా vs ఎన్డీయే!
posted on Jul 20, 2023 7:06AM
దేశంలో అసలు సిసలైన ఎన్నికల వేడి మొదలైంది. సాధారణ ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉండగా.. అధికార,ప్రతిపక్షాలు ఇప్పుడే సమర శంఖం ఊదేశాయి. ప్రతిపక్షం, అధికార కూటమి రెండూ ఒకదానిపై మరొకటి పై చేయి సాధించేందుకు కొత్త నిబంధనలను రూపొందించి అమలుకు శ్రీకారం చుట్టాయి. రానున్న ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీయేని ఢీ కొట్టాలని చూస్తున్న ప్రతిపక్ష కూటమి ఇండియా (ఇండియన్, నేషనల్, డెవలప్‌మెంట్, ఇన్‌క్లూజివ్, అలయన్స్) పేరిట వజ్రాయుధాన్ని సిద్ధం చేసింది.
స్వయంగా రాహుల్ గాంధీనే తమ కూటమికి ఐఎన్డీఐఏ పేరును సూచించారు. దీనిని కూటమి పక్షాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తమ కూటమి పేరును ఇండియాగా అధికారికంగా ప్రకటించారు. మరోవైపు ప్రధానమంత్రి కూడా ఎన్డీయేకి న్యూ ఇండియా, డెవలప్డ్ నేషన్, యాస్పిరేషన్ ఆఫ్ ఇండియాగా కొత్త అర్ధాన్ని తెరమీదకి తెచ్చారు. కర్ణాటకలోని బెంగళూరులో కాంగ్రెస్ సహా 26 ప్రతిపక్ష పార్టీలు కలిసి సమావేశం నిర్వహించగా.. ఢిల్లీలో జరిగిన ఎన్‌డిఎ సమావేశానికి బీజేపీతో సహా 38 పార్టీలు హాజరయ్యాయి. మంత్రి అమిత్ షా ఇది తమ బలప్రదర్శన అని ముందే ప్రకటించి రాజకీయ చతురతకి తెరలేపారు.
ఒకవైపు ప్రతిపక్ష కూటమి ఇండియా సమావేశం, మరోవైపు అధికార పక్షం ఎన్డీయే సమావేశాలు జరగడాన్ని దేశ రాజకీయాలలో కీలక పరిణామాలుగా పరిశీలకులు విశ్లేషించారు. అధికార, ప్రతిపక్ష కూటములు పోటాపొటీగా బలోపేతం అవుతున్న తరుణంలో వచ్చే ఎన్నికల్లో ఎవరి బలం ఎంత అనే దానిపై అప్పుడే విశ్లేషణలు జోరందుకున్నాయి. రెండు కూటములలో అంతర్గతంగా జరిగే విషయాల్ని పక్కన పెడితే ఇరు పార్లమెంట్, అసెంబ్లీల్లో ఓట్లు, సీట్లను బట్టి ఈ రెండు కూటముల బలాబలాలపై చర్చ జరుగుతున్నది. వీటి ఆధారంగా వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపోటముల గురించీ చర్చ జరుగుతోంది. ఇరు కూటములలోని నేతలు ప్రత్యర్థి కూటములపై సవాళ్లు విసురుతూ రాజకీయ వేడిని మరింత పెంచుతూ రెచ్చిపోతున్నారు.
దేశాన్ని రక్షించాలనే ఉద్దేశంతో మేమంతా చేతులు కలిపామని ప్రకటించిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్డీయే ఇండియాను సవాలు చేయగలదా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకూ యూపీఏ, ఎన్‌డీఏ గురించి విన్నారు.. కానీ, బీజేపీ, భారత్‌ను సవాలు చేయగలరా? మేము మా మాతృభూమిని ప్రేమిస్తున్నాం.. మేము దేశభక్తులం’ అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బీజేపీ సిద్దాంతాలపైనే విపక్ష కూటమి పోరాటం చేస్తున్నదని.. ఇది బీజేపీ, విపక్ష పార్టీల మధ్య యుద్ధం కాదు, దేశ ప్రజల స్వతంత్రం, స్వేచ్ఛ కోసం చేస్తున్న యుద్ధంగా రాహుల్ గాంధీ అభివర్ణించారు. అధికారం కోసం దేశాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న వారిని ఎదుర్కొనే తమ పోరాటం ఎన్డీయే వర్సెస్ ఇండియాగా ఉంటుందన్నారు. ఈ కూటముల మధ్య యుద్ధం ఏ అంశంపై ఉంటుందో ప్రతిపక్ష కూటమి నేతల మాటలను బట్టి అర్ధం చేసుకోవచ్చు.
వాస్తవానికి మన దేశంలో బీజేపీ, కాంగ్రెస్ రెండే బలమైన పార్టీలు. అయితే ఈ రెండు కూటములలో ఉన్న పార్టీలను గమనిస్తే మాత్రం బీజేపీ వెనుక ఉన్న పార్టీలలో అత్యధిక పార్టీలు అటు పార్లమెంటులో కానీ ఇటు రాష్ట్రాల అసెంబ్లీలలో కనీ కనీస ప్రాతినిథ్యం లేనివీ, ఉన్నా ఒకటీ అరా సీట్లు కలిగినవీ మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ కూటమిలో అంటే ఇండియా భాగస్వామ్య పక్షంలో అయితే రాష్ట్రాలలో ప్రభుత్వాలు నిర్వహిస్తున్న బలమైన పార్టీలు ఉన్నాయి.
ఇప్పటి వరకూ వీటి మధ్య ఐక్యతా లోపం వల్ల మాత్రమే బీజేపీ గత రెండు ఎన్నికలలో విజయం సాధించగలిగిదని పరిశీలకులు అంటున్నారు. ఆ అనైక్యత మటుమాయమై విపక్షాలన్నీ ఇండియాగా ఐక్యం కావడంతో బీజేపీలో ఒకింత కంగారు ప్రారంభమైందని అంటున్నారు. ఆ ఐక్యత సాకారం అవుతోందన్న సంకేతాల నేపథ్యంలోనే బీజేపీ హడావుడిగా ఈ తొమ్మిదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఎన్డీయే సమావేశంతో బలప్రదర్శనకు దిగిందని అంటున్నారు. మొత్తం మీద విపక్షాలు ఐక్యతారాగం వినిపించడంతో అధికార బీజేపీలో కంగారు మొదలైందని చెప్పవచ్చు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఎన్డీయే వర్సెస్ ఇండియాగా హోరాహోరీగా జరగడం తథ్యమని పరిశీలకులు అంటున్నారు.