అంతర్గత కుమ్ములాటలపై అధిష్టానం చేతులెత్తేసిందా?
posted on Jul 19, 2023 @ 4:35PM
ఇప్పుడున్న రాజకీయ పార్టీలలో నేతలకు స్వేచ్ఛ ఉండదని రాజకీయ వర్గాల భావన. జాతీయ పార్టీల నుండి ప్రాంతీయ పార్టీల వరకూ అంతటా వ్యక్తుల ద్వారానే పార్టీలు నడుస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలలో అయితే ఇది వ్యక్తి పూజ, భజన వరకూ వెళ్ళింది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో అయితే ఈ వ్యక్తి పూజ తారాస్థాయికి చేరి కనిపించింది. మొన్నామధ్య సినీ నిర్మాత బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు వైసీపీ నేతలు తమ అధినేత జగన్మోహన్ రెడ్డిని దైవాంశ సంభూతుడిగా కీర్తించి చెట్టెక్కించేశారు.
జగన్మోహన్ రెడ్డిని మనిషి రూపంలో తిరిగే దేవుడిగా కీర్తించేశారు. ఆయన్ని ఎవరైనా ఒక్క మాట అంటే వాళ్ళని, వాళ్ళ కుటుంబాన్ని బజారుకి లాగి ఇష్టారాజ్యంగా తిట్టిపోసేవారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనేలా వైసీపీలో ఒక్కరూ అధిష్టానం పెద్దలు గీసిన గీత దాటకుండా ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞ వస్తే తల తీసి చేతిలో పెడతాం అనేలా ఉండేవారు వైసీపీ నేతలు.
కానీ, అదంతా ఒకప్పటి మాట గతమే కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నేతలు ఎన్ని అంటున్నా వైసీపీ నేతలు ఒక్కరూ నోరు మెదపడం లేదు. పైగా అంతర్గత కుమ్ములాటలు కూడా పెచ్చుమీరిపోయాయి. అధిష్టానం గీసిన గీతలను ఎప్పుడో దాటేసిన వైసీపీ నేతలు.. ఇప్పుడు మాటల కత్తులు పట్టి సొంత పార్టీ నేతల మీదనే యుద్దానికి దిగుతున్నారు. ఇక్కడా అక్కడా అని లేకుండా శ్రీకాకుళం నుండి అనంతపురం వరకూ.. చిత్తూరు నుండి కర్నూలు వరకూ.. ఈస్ట్ గోదావరి నుండి కృష్ణా వరకూ ఏ జిల్లాకి వెళ్లి చూసినా వైసీపీ నేతల మధ్య అంతర్గత పోరు తారస్థాయికి చేరింది. హద్దులు దాటితే వేటు తప్పదన్న అధిష్టానం మాటలను బంగాళాఖాతంలో కలిపేసిన నేతలు సొంత పార్టీ నేతలనే ప్రత్యర్ధులుగా మార్చుకున్నారు.
అంతర్గత కుమ్ములాటలో శ్రీకాకుళం ముందుండగా.. ప్రకాశంలో నాయకులు మాకు మేమే అధిష్టానం అనే స్థాయిలో అజమాయిషీ చెలాయిస్తున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు పార్టీ తెరచాప లేని నావలా ఊగిసలాడుతున్నది. కృష్ణా, గుంటూరు నేతలు కంటికి కూడా కనిపించకుండా చాప కింద నీరులా రాజకీయం చేసుకుంటున్నారు. రాయలసీమ వైసీపీ సంచిలో నాటు బాంబు ఎప్పుడు పేలుతుందో అనేలా పరిస్థితి మారిపోయింది. విశాఖ నేతలు పార్టీ మీద నమ్మకాన్ని వదిలేసుకున్నట్లు మాట్లాడుతున్నారు. ఇంత జరుగుతున్నా వైసీపీ అధిష్టానం కిక్కురుమనడం లేదు. కుమ్ములాటలు వద్దు.. చర్యలు తప్పవని స్వయంగా జగన్ చెప్పినా మేము సిద్దమే అన్నట్లు నేతలు ఉన్నారే తప్ప ఎలాంటి జంకు కనిపించడం లేదు.
కుమ్ములాడుతున్న నాయకులపై చర్యలు తీసువాల్సిన అధిష్టానం.. కనీసం పన్నెత్తి కూడా వారిని మందలించడం లేదు. రెబల్స్ లాగా మారి రెచ్చిపోతున్నా శాంతం శాంతం అంటున్నదే తప్ప నియంత్రించే దిశగా ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. మంత్రులు-ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోగా నాది నీదీ అంటూ కీచులాడుకుంటున్నా అధిష్టానం సర్దిచెప్పేందుకు కూడా ప్రయత్రించడం లేదు. ఎంపీలను కలుపుకుపోవాల్సిన ఎమ్మెల్యేలు మేమే రాజులం మేమే మంత్రులం అనేలా ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్నా పార్టీ అధ్యక్షుడు కూడా చూసీ చూడనట్లే ఉంటున్నారు. ఇంకా చెప్పాలంటే అసలు వారు పార్టీలో ఉంటే చాలు అనేలా సీన్ మారిపోయింది. ఏమైనా అంటే పొరుగు పార్టీల్లోకి జంప్ చేస్తారనే భయం వైసీపీ అగ్ర నాయకత్వంలో స్పష్టంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి చూస్తే అధిష్టానం చేతులేత్తిసిందనే భావన కలుగుతోందని పరిశీలకులు అంటున్నారు.