సోనియా వల్లే తెలంగాణ కల సాకార౦: కేసిఆర్
posted on Jun 13, 2014 @ 4:54PM
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చొరవ వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా సభ్యుల ధన్యవాదాలు ముగిసిన అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటులో సోనియాగాంధీ మొదటిస్థానంలో నిలిస్తే రాజ్‌నాథ్‌సింగ్ ఆధ్వర్యంలోని బీజేపీ రెండో స్థానంలో ఉంటుందన్నారు. అదేవిధంగా తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన దేశంలో 33 పార్టీలకు సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు వమ్ముకావని, బంగారు తెలంగాణ తప్పకుండా సాకారమవుతుందని స్పష్టం చేశారు. సాగు నీటిని, ఉద్యోగులను పూర్తిస్థాయిలో దక్కించుకుంటామన్నారు. ప్రభుత్వ పని విధానం ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాలేదని, అందువల్ల ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ఎలాంటి కాలపరిమితి చెప్పలేమని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర పునఃర్నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చారు.