Read more!

జల 'జగడం' మొదలైంది..!

 

 

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడి నెల రోజులు కూడా కాకుండానే జల వివాదాలు మొదలయ్యాయి. నాగార్జున సాగర్ నుంచి పది టీఎంసీల తాగునీటిని కృష్ణా డెల్టాకు విడుదల చేయాలని అంతర్రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. నీటి విడుదలను ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభించాలని కూడా నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. మొత్తం కృష్ణా నదీ జలాల లభ్యత, వినియోగ అవసరాలపై పూర్తిస్థాయి అవగాహన వచ్చిన తర్వాతే కృష్ణా డెల్టాకు తాగునీటి విడుదలపై తుది నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు కమిటీ నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టాలని తెలంగాణ నీటిపారుదల మంత్రి హరీశ్ రావు ఆదేశించినట్టు తెలిసింది. దీంతో, కృష్ణా డెల్టాకు నీటి విడుదల సంక్షోభంలో పడింది. ఇరు రాష్ట్రాలకూ జల వివాదాలే తలనొప్పిగా మారనున్నాయని తొలినుంచీ విశేష్లకులు చెబుతూనే ఉన్నారు. అన్నట్లుగానె రెండు రాష్ట్రాలూ మధ్య జల జగడం మొదలైంది!



అంతర్రాష్ట్ర కమిటీవి సిఫార్సులు మాత్రమేనని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు చెబుతుంటే.. కమిటీ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం సమీక్షించడం సరికాదని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ అధికారులు అంటున్నారు. కమిటీ నిర్ణయాల్లో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఎలాంటి జోక్యం లేదని జీవో 358లోనే పేర్కొన్నారని వివరిస్తున్నారు. ఇప్పుడు కృష్ణా డెల్టాకు నాగార్జున సాగర్ నుంచి నీళ్లు అవసరమైతే.. సమీప భవిష్యత్తులో శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు వంటి ఎత్తిపోతల పథకాలకు నీళ్లు అవసరమవుతాయని, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి విడుదలకు అంగీకరించకపోతే ఏమి చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కృష్ణా జలాలపై ఏ రాష్ట్రానికి అధికారం లేదని, కేంద్రం నేతృత్వంలోని కృష్ణా బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, అప్పటిదాకా జీవో 358 ద్వారా ఏర్పాటైన కమిటీదే తుది నిర్ణయమని చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలను తిరగదోడడం, నిర్ణయాల అమలుకు తొలి దశలోనే అభ్యంతరాలు చెప్పడం ఏమాత్రం ఆరోగ్యకరం కాదని స్పష్టం చేస్తున్నారు.