హుజురాబాద్ కు కేసీఆర్ షాక్.. వాసాలమర్రిలోనే దళిత బంధు స్టార్ట్
posted on Aug 4, 2021 @ 7:38PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన దళిత బంధు పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని గతంలో ప్రకటించారు. ఈనెల 16న ప్రారంభిస్తానని తెలిపారు. అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే తాజాగా తన దత్తత గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో పర్యటించిన కేసీఆర్.. అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వాసాలమర్రిలో దళిత బంధును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇస్తామని తెలిపారు.
వాసాలమర్రిలో దళిత కుటుంబాలపై సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. గ్రామంలోని మొత్తం 76 దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం కింద రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. 24 గంటల్లోనే బ్యాంకు అకౌంట్లలో పది లక్షలు జమ అవుతాయన్నారు. సీఎం కేసీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని దత్తత గ్రామమైన వాసాలమర్రిలో పర్యటించారు. ముందుగా దళిత వాడలో తిరిగి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా వాసాలమర్రిలోని అన్ని దళిత కుటుంబాలకు దళిత బంధు ఇస్తామని చెప్పారు.
ప్రభుత్వం అందించే డబ్బు ను సరైన దిశలో ఉపయోగించాలని సీఎం కేసీఆర్ కోరారు. వాసాల మర్రిలో దళితులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒక్క రూపాయి కూడా వృథా చేయకుండా డబ్బుకు డబ్బును సంపాదించాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చే సాయంతో మంచి వ్యాపారం చేసి ఆర్థికంగా దళితులు బాగు పడాలని సూచించారు. దళిత బంధు ముందుగా వాసాల మర్రి ప్రజలకే వస్తున్నందున మీ పై పెద్ద బాధ్యత ఉందన్నారు. పథకం ముందు ముందు మరింత బాగా చేసేందుకు వాసాల మర్రి ప్రజలను ఆదర్శంగా తీసుకునేలా ఉండాలన్నారు
దళిత బంధు ఇచ్చినందుకు ఇతర పథకాలు దళితులకు బంద్ కావన్నారు కేసీఆర్. వాసాల మర్రి ఊరందరికీ ఇళ్లు కట్టిస్తామన్నారు. ఇళ్లు, ఇతర పథకాలు అలాగే కొనసాగిస్తామన్నారు. ఊళ్లో అందరికీ కొత్త ఇళ్లు ఇస్తామన్నారు. ఈ పది లక్షలకు ఇతర ప్రభుత్వ పథకాలకు లింక్ లేదన్నారు. అన్ని పథకాలతో పాటు అదనంగా ఇచ్చే ఈ సాయాన్ని మంచిగా వినియోగించుకోవాలన్నారు. ఏడాది పాటు పది లక్షల నుంచి ఖర్చు చేయకుండా డబ్బులు జమ చేయాలన్నారు. మర్వాడీల మాదిరిగా డబ్బుకు డబ్బు సంపాదించే మార్గాన్ని నేర్చుకోవాలని సూచించారు. తొందర పడకుండా మంచి వ్యాపారం ఏం చేయాలన్నది నిర్ణయించుకొని కలెక్టర్ కు చెప్పాలన్నారు. అల్రెడీ డబ్బులు మంజూరైనందున పదిహేను రోజులైనా సరే మంచి వ్యాపారం చేయండన్నారు.
సీఎం కేసీఆర్ పర్యటనలో వాసాలమర్రిలో గందరగోళం నెలకొంది. సీఎం సమావేశానికి దళితులను మాత్రమే అనుమతించడంపై గ్రామస్తుల అభ్యంతరం తెలిపారు. మొదట దళితులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో పాటు గ్రామంలోని 150 మందికి అనుమతి ఉందని చెప్పిన అధికారులు సీఎం సమావేశానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని గ్రామస్తులు వాపోయారు. సీఎం పర్యటనలో ప్రధానంగా వాసాలమర్రిలోని దళితవాడలను పరిశీలన, గ్రామంలోని రైతువేదిక భవనంలో ప్రజలతో సమావేశం నిర్వహించేలా అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. ఆతర్వాత సర్పంచ్ ఇంట్లో భోజనం చేసిన అనంతరం హైదరాబాద్‌కు కేసీఆర్ తిరుగుప్రయాణమవుతారు.