పతనం అంచున జగన్ సర్కారు!.. రఘురామ లేఖతో మరింత ముప్పు..
posted on Aug 4, 2021 @ 7:10PM
అవును, రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉంది. ఉద్యోగులకు జీతాలు చెల్లించడం బాగా ఆలస్యం అవుతోంది. కరోనా ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది. ఈ మాటలన్నది మరెవరో కాదు. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతటి వారైన సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన ఇలా అన్నారంటే.. ఏపీ ఆర్థిక పరిస్థితి ఎంత దుర్బరంగా ఉందో అర్థం అవుతోంది. ఒకవిధంగా ఇది సర్కారు చేతులెత్తేయడమే. ఏపీలో ఎకనామిక్ క్రైసిస్ వచ్చినట్టే. ఆర్థిక అత్యవసర స్థితికి ఇది హెచ్చరికే.
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఏపీ కొత్త రుణాల కోసం ప్రపంచబ్యాంకు ముందు మోకరిల్లుతోంది. ‘సాల్ట్’ ప్రాజెక్టు అమలు కోసం సుమారు రూ.1,870 కోట్ల రుణం ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు విధించిన షరతులకు వైసీపీ ప్రభుత్వం ఓకే అనేసింది. ప్రపంచ బ్యాంకు షరతులు ఎలా ఉంటాయో తెలుసుగా.. ఉద్యోగాలు ఇవ్వొద్దు.. జీతాలు పెంచొద్దు.. పన్నులు, కరెంటు బిల్లులులాంటివి భారీగా పెంచేయాలి.. చెత్త పన్నులాంటి కొత్త కొత్త పన్నులు వేయాలి.. ఇలా వరల్డ్ బ్యాంక్ రుణమంటే ప్రజలకు మూడినట్టే. అందులో భాగంగానే ఏపీలో 25 వేలకు పైగా పోస్టులు ఖాళీలున్నా డీఎస్సీ ఊసెత్తకుండా సర్కారు కాలయాపన చేస్తోందని.. జాబ్ క్యాలెండర్‌తో తక్కువ పోస్టులే భర్తీ చేయడానికీ ఇదే కారణమని అంటున్నారు.
మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు.. ఇంటి గుట్టు రట్టు చేసేలా ఏపీ ఆర్థిక దుస్థితిని కేంద్రానికి పూసగుచ్చినట్టు వివరిస్తూ ఎంపీ రఘురామ రాసిన లేఖతో మరింత ఇరకాటంలో పడింది సర్కారు. రఘురామ రాసిన లేఖపై కేంద్రం రియాక్టు అయింది. ఏపీ అప్పులపై కన్నెర్ర జేస్తూ.. కొత్త పరిమితులు విధించడంతో ప్రభుత్వం గిలగిలా కొట్టుకుంటోంది.
ఎవరైనా మద్యం అమ్మి ఆదాయం సంపాదిస్తారు కానీ, వచ్చే 20ఏళ్ల మద్యం ఆదాయాన్ని గ్యారంటీగా పెట్టి అప్పులు తెచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీనే కాబోలు. ఈ మేటర్ రఘురామ లేఖ ద్వారా కేంద్రం దృష్టికి చేరడంతో.. ఇక్కట్లు మొదలయ్యాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ.. భవిష్యత్తు ఆదాయాల్ని తాకట్టు పెట్టడాన్ని తప్పు బడుతూ కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం పంపిన లేఖ ఏపీ సర్కారుకు కొత్త కష్టాల్ని తెచ్చిపెట్టింది. ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక శాఖ రాసిన లేఖలో.. ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా రుణ సేకరణ సరికాదని కూడా తప్పుబట్టింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(3), ఆర్టికల్ 266(1)కు విరుద్ధంగా ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటైందని కేంద్రం స్పష్టం చేయడం ఆసక్తికరం. తమ దృష్టికి వచ్చిన అంశాలపై వివరణ కోరుతూ సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్రాన్ని కేంద్రం ఆదేశించినట్టు తెలుస్తోంది. మరోవైపు, దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు తీసుకున్న అప్పుల వివరాల్ని కాగ్ నివేదిక బయటపెట్టగా.. అందులో ఏపీ మొదటి స్థానంలో నిలవడం మరింత దారుణమైన విషయం.
ఎంపీ రఘురామ లేఖతో కేంద్రం ఏపీ ఆర్థిక దుస్థితిపై స్పెషల్ ఫోకస్ పెట్టడంతో ప్రభుత్వంలో కలవరపాటు పెరిగింది. ఇన్నాళ్లూ ఇష్టారీతిన వ్యవహరించగా.. ఇకపై ఒళ్లు దగ్గరపెట్టుకొని మెదలాల్సిన పరిస్థితి ఉంటుందని అంటున్నారు. అమరరాజాలాంటి ఉన్న కంపెనీలే వెళ్లిపోయేలా చేస్తూ.. కొత్త కంపెనీలు రాష్ట్రం పేరెత్తితేనే భయపడేలా చేస్తుంటే.. ఏపీ అభివృద్ధి సాధ్యమా? కేవలం సంక్షేమమే ఉంటే సరిపోతుందా? చేసిన అప్పులు ఎలా తీరుస్తారు? కొత్త అప్పులు ఎలా తెస్తారు? ఇక, ఏపీ ఆర్థికంగా దివాళా తీసినట్టేనా?