హరీష్ రావుకు కేసీఆర్ షాక్.. కౌంట్ డౌన్ మొదలైనట్టేనా?
posted on Nov 16, 2021 @ 1:13PM
ఎట్టకేలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. గతంలో ఎప్పుడు లేనంతగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసిన సీఎం కేసీఆర్.. గవర్నర్ కోటాతో పాటు ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఆరు సీట్లకు తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. నామినేషన్లను చివరి రోజున విడుదలైన జాబితాలో చివరి నిమిషంలో ట్విస్ట్ కనిపించింది. మంత్రి హరీష్ రావుకు షాక్ తగిలింది.
ఎమ్మెల్యే కోటాలో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా కీలక పాత్ర పోషించిన ఎర్రోళ్ల శ్రీనివాస్ పేరు ఖరారైందని రెండు రోజులుగా ప్రచారం జరిగింది. అయితే అధికారికంగా వచ్చిన జాబితాలో ఆయన పేరు మిస్సైంది. గుత్తా సుఖేందర్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, వెంకట్రామిరెడ్డి, బండా ప్రకాశ్ పేర్లు ఖరారు అయ్యాయి. చివరిలో ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు అవకాశం చేజారింది.
ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్ మొదటి నుంచి మంత్రి హరీష్ రావుకు అనుచరుడిగా ఉన్నారు. ఆయనకు 2014, 2018లో అసెంబ్లీ సీటు దక్కలేదు. దీంతో ఎమ్మెల్సీ ఇస్తారని భావించారు. కాని అది కూడా రాలేదు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి ఎమ్మెల్సీలు ఇచ్చిన కేసీఆర్.. ఉద్యమనాయకుడికి మాత్రం హ్యాండిస్తూ వచ్చారు. మంత్రి హరీష్ రావు మనిషి కావడం వల్లే ఎర్రోళ్లకు పార్టీలో అన్యాయం జరిగిందనే ప్రచారం ఉంది. అయితే ఇటీవల హరీష్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు కేసీఆర్. ఆర్ధిక శాఖ ఉన్నా రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన వైద్యశాఖను ఆయనకే కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో హరీష్ అనుచరుడైన ఎర్రోళ్ల శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ ఖాయమని అంతా భావించారు. కాని ఈసారి కూడా ఎర్రోళ్ల శ్రీనివాస్ కు షాక్ తప్పలేదు.