కాషాయం కట్టిన కాంగ్రెస్ నేత !
posted on Apr 14, 2023 @ 10:29AM
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రత్యర్ధి వర్గానికి చెందిన మరో సీనియర్ నాయకుడు, ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. గత కొద్ది రోజులుగా ఆయన పార్టీ వీడుతారని జరుగతున్న ప్రచారాన్ని ఏలేటి నిజం చేశారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి. .ఆ వెంటనే బీజేపీలో చేరిపోయారు. తనకు పీసీసీ నుంచి వచ్చిన షోకాజ్ నోటీసుపై కాంగ్రెస్ అధిష్టానంతో తేల్చుకునేందుకు ఢిల్లీకి వెళ్లిన ఆయన.. బీజేపీ నేతలతో మంతానాలు సాగించారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయ్యారు. అంతకు ముందే అయన తన రాజీనామా లేఖను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు పంపించారు.
గత రెండు రోజులుగా ఢిల్లీలో మకాం చేసిన బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే మహేశ్వర రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా సమక్షంలో బీపీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతకు ముందు.. మహేశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ చుగ్ తో సమావేశం అయ్యారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇతర నేతలు ఉన్నారు.
ఈ సందర్భంగా తరుణ్ చుగ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ అరాచక పాలన అంతం.. ప్రధాని నరేంద్ర మోడీ వల్లే సాధ్యమన్నారు. మహేశ్వర్ రెడ్డి చేరికతో బీజేపీ మరింత బలోపేతం అవుతుందన్నారు.
మరో వంక ఏలేటి కూడా భారాస అరాచక పాలనను అంతమొందించే శక్తి బీజేపీతోనే సాధ్యమనీ, అందుకే బీజేపీ లో చేరుతున్నట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ వల్ల తెలంగాణలో అరాచక పాలనకు అంతమవుతుందని మహేశ్వరరెడ్డి చెప్పారు. మోడీ నాయకత్వంలో బీజేపీ బలోపేతం కోసం పని చేస్తానని తెలిపారు. కొంతకాలం నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి అడుగులు వేస్తున్నాయని, రెండు పార్టీలూ కూడా కలిసి కట్టుగా పని చేస్తున్నాయన్నారు. అవినీతిపై పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ.. నిస్తేజంగా ఉందన్నారు. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు ఉంటుందని కొందరు సీనియర్లే అంటే.. పొత్తు లేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారని.. క్లారిటీ, నిబద్దత లేదని.. అంతా గందరగోళంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారని.. పార్టీ వాళ్లు వ్యాఖ్యలు చేస్తూ.. కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు.
ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కోసం కష్టపడి పని చేశారని బండి సంజయ్ చెప్పారు. జేపీ నడ్డా సమక్షంలో మహేశ్వర్ రెడ్డి పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. బీజేపీలో ఆయనకు సరైన ప్రాధాన్యత ఇస్తామన్నారు. తెలంగాణలో నియంతపాలన పోవాలని, పేదల రాజ్యం, రామ రాజ్యం రావాలన్నారు. మోడీ నాయకత్వంలో కేసీఆర్ అవినీతి పాలన అంతం అవుతుందన్నారు. అందరం కలిసి బీజేపీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. నిర్మల్ లోనే కాకుండా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాంతాలను మహేశ్వర్ రెడ్డి ప్రభావితం చేయగలరని తెలిపారు.
ఇదలా ఉంటే, ఇటీవల బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన మాజీ ఎంపీ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎటు వెడతారనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఆ ఇద్దరిని తమ వైపు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా వీరిద్దరి ప్రభావం ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల మీద ఎక్కువగా ఉన్నందున, అక్కడి నుంచి భారీగా వలసలు ఉండే అవకాశముందంటున్నారు.