రేవంత్‌రెడ్డిలానే ఈటల! కేసీఆర్ పగపడితే..! హుజురాబాద్‌లో కొడంగల్ స్ట్రాటజీ?
posted on Jun 3, 2021 @ 6:45PM
కొడంగల్. ఈ పేరు వినబడగానే అంతటా అటెన్షన్. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొడంగల్ ఎలక్షన్ తెలుగు స్టేట్స్‌లో మారుమోగిపోయింది. ఉప ఎన్నిక కాకపోయినా.. కేసీఆర్ పగబడితే ఎలా ఉంటుందో.. కేసీఆర్‌ను బలమైన నేత ఢీ కొడితే ఎట్టా ఉంటాదో.. చెప్పడానికి కొడంగలే బెస్ట్ ఎగ్జాంపుల్.
డైనమిక్ లీడర్ రేవంత్‌రెడ్డిని అసెంబ్లీకి రానీకుండా ఎలాగైనా ఓడగొట్టాలని కేసీఆర్ పంతం పట్టాడు. రాజకీయ, అధికార బలాన్నంతా కొడంగల్‌లో మోహరించారు. ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారు. రేవంత్‌రెడ్డిని కాలు ముందుకు కదపనీయకుండా అడుగడుగునా మోకాలడ్డారు. రేవంత్‌రెడ్డిని కేసులతో కట్టడి చేసి.. కొడంగల్‌ను ఖాకీలతో నింపేసి.. నోట్ల కట్టలు వెదజల్లి.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి.. కారు పార్టీ విజయం సాధించిందని చెబుతారు. రేవంత్‌రెడ్డిని అసెంబ్లీకి రాకుండా చేయగలిగారు కానీ, ఆ తర్వాత ఆ చిచ్చరపిడుగు రేవంత్‌రెడ్డి ఈసారి ఏకంగా పార్లమెంట్‌కే ఎగబాకి.. కేసీఆర్‌కు చుక్కలుచూపించే పనిలో ఉన్నాడు. అది వేరే విషయం.
ఈటల రాజేందర్‌ది సైతం రేవంత్‌రెడ్డితో పోల్చగల అంశమే. రేవంత్‌రెడ్డిలాగానే ఈటలపైనా కేసీఆర్ కసితో ఉన్నారు. రాజకీయంగా అణగదొక్కాలని పగబట్టారు. ఉప ఎన్నిక వస్తే.. రేవంత్‌రెడ్డిని చేసినట్టే.. ఈటలను సైతం అసెంబ్లీకి రాకుండా చేయాలని చూస్తున్నారు. కొడంగల్‌లో అధికార బలంతో గెలిచినట్టే.. హుజురాబాద్‌లో బై పోల్ జరిగితే ఏదోవిధంగా విజయం సాధించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అందుకే హుజురాబాద్ ఇంచార్జ్ గా హరీష్ ను రంగంలోకి దింపుతున్నారు గులాబీ బాస్. కేసులు, పోలీసులు, కుట్రలు, పైసలు.. ఇలా దాదాపు అన్ని విషయాల్లోనూ గత కొడంగల్ ఎన్నికల స్ట్రాటజీనే.. రాబోవు రోజుల్లో హుజురాబాద్‌లోనూ అధికార పార్టీ అమలు చేస్తుందని అంటున్నారు. అయితే, జాగ్రత్తగా గమనిస్తే.. దుబ్బాక, నాగార్జున సాగర్‌లోనూ టీఆర్ఎస్.. కొడంగల్ మోడల్‌నే ఇంప్లిమెంట్ చేసింది. అధికార పార్టీ తరఫున మామూలు అభ్యర్థులనే నిలబెట్టింది. కానీ, వారికి పార్టీ దన్నుగా నిలిచింది. గెలిపించుకుంది. హుజురాబాద్‌లోనూ ఈటల స్థాయికి సరితూగే అభ్యర్థి టీఆర్ఎస్‌లో లేకున్నా.. ఎవరినైనా నిలబెట్టి గెలింపుంచుకోగలమనే ధైర్యం అధికార పార్టీలో కనిపిస్తోంది.
కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి మీద ప్రయోగించినట్టే.. దుబ్బాకలో రఘునందన్‌రావుపై కేసులతో కుట్ర చేయడం.. ఖాకీలతో కట్టడి చేయడం.. డబ్బులు గుప్పించడం.. అంతా సేమ్ టూ సేమ్. ఒక్కటే డిఫరెన్స్. కొడంగల్‌లో మాదిరి భయపెడితే బెదిరిపోడానికి.. దుబ్బాకలో ఉన్నది కాంగ్రెస్ కాదు.. కమలనాథులు. కొడంగల్‌లో కాంగ్రెస్ శ్రేణులు రేవంత్‌కు వెన్నుపోటు పొడిస్తే.. దుబ్బాకలో బీజేపీ కేడర్ రఘునందన్‌రావుకు వెన్నంటే నిలిచింది. రాజ్యం కుట్రలను, కుతంత్రాలను బలంగా తిప్పికొట్టింది. హుజురాబాద్‌లోనూ ఈటలకు బీజేపీనే శ్రీరామరక్ష అంటున్నారు.
అయితే, కొడంగల్‌కు, దుబ్బాకకు మధ్య మరోతేడా కూడా ఉంది. కొడంగల్‌పై కేసీఆర్ స్వయంగా ఫోకస్ పెట్టారు. రేవంత్‌రెడ్డిని ఓడించే వరకూ పట్టు వదలలేదు. కానీ, దుబ్బాక ఉప ఎన్నిక బాధ్యతలను మంత్రి హరీష్‌రావుకు అప్పగించి కేసీఆర్ సైడ్ అయిపోయారు. కనీసం ప్రచారానికి కూడా వెళ్లలేదు. కేటీఆర్ సైతం అటువైపు కన్నెత్తి చూడలేదు. అందుకే, దుబ్బాక ఓటమిని కేసీఆర్ ఖాతాలో కాకుండా హరీష్‌రావు మెడకు తగిలిస్తున్నారు గులాబీ శ్రేణులు.
అందుకే, దుబ్బాక, నాగార్జున సాగర్, కొడంగల్ ఎన్నికలు జరిగిన తీరును బట్టి.. హుజురాబాద్ ఉప ఎన్నిక వస్తే ఫలితం ఎలా ఉంటుందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈటల రాజేందర్ సత్తాకు, బీజేపీ బలగాలు తోడైతే.. దుబ్బాక ఫలితమే హుజురాబాద్‌లోనూ రిపీట్ అవుతుందా? లేక, కొడంగల్, నాగార్జున సాగర్‌ల మాదిరి.. కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెడితే.. కారు జోరు పెరుగుతుందా?