టీపీసీసీ కథ మళ్ళీ మొదటికి? గాంధీభవన్ లో కోవర్టుల కిరికిరి...
posted on Jun 3, 2021 @ 7:25PM
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుని ఎంపిక వ్యవహారం, పార్టీలో కలకలం లేపుతోంది. ముఖ్యంగా, ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పేరు ఖరారైందని, ఢిల్లీ నుంచి సమాచారం అందుతున్న నేపధ్యంలో, గతంలో ఒక సారి రేవంత్ రెడ్డి ఆశలపై అగ్గినీళ్లు చల్లిన పాత కాపులు, మళ్ళీ మరోసారి ఆయనకు పీసీసీ పీఠందక్కకుండా చేసేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పార్టీ సీనియర్ నాయకుడు, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంత రావు, రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి, పీసీసీ అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని నేరుగా పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీనే ప్రశ్నించారు. ఈ మేరకు సోనియా గాంధీకి లేఖ రాసిన వీహెచ్, రేవంత్ పై కేసులున్నాయని, రేపు అయన జైలుకు పోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అంతే కాదు, 44 ఏళ్లుగా పార్టీలో ఉన్న తనను, నిన్నకాక మొన్న పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డి అనుచరులు , ఫోన్ చేసి బెదిరిస్తునారని, బూతులు తిడుతున్నారని, రేపు అయన పీసీసీ చీఫ్ అయితే పార్టీ సీనియర్ నాయకులకు గాంధీ భవన్’లో ఎంట్రీ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. వీహెచ్ పార్టీ మీద కూడా మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అనుచరుల నుంచి తనకు రక్షణ కల్పిెచాలని పోలీసులను ఆశ్రయించవలసి వచ్చిందని, అయినా పీసీసీ నేతలు ఎవరు రేవంత్ అనుచరుల బహిరంగ హెచ్చరికలను ఖండించలేదని అన్నారు. అసలు పార్టీకి క్రమశిక్షణ కమిటీ ఉందా? అంటూ మండిపడ్డారు. కోవర్టులు ఉన్నన్ని రోజులు పార్టీ ఎదగదని కుండ బద్దలు కొట్టారు వీహెచ్.
వీహెచ్ వ్యవహారం ఇలా ఉంటే, రేవంత్ రెడ్డిని అడ్డుకునేందుకు, ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగానే, పీసీసీ అధ్యక్షుని ఎంపికకు, ‘అభిప్రాయ సేకరణ’ అనే కొత్త పద్దతిని తీసుకొచ్చారన్న అనుమానాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఎంపిక తర్వాత గతంలోలాగా విబేధాలు భగ్గుమనకుండా ఉండేందుకే, రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అభిప్రాయ సేకరణ చేసి, పీసీసీ చీఫ్’ను ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు చెపుతున్నా,ఆ వంకన మళ్ళీ మరోమారు, మొత్తం ప్రక్రియను మొదటికి తెచ్చేందుకే, అభిప్రాయ సేకరణను తెరమీదకు తెచ్చారన్న అనుమానాలు లేకపోలేదు.దీంతో, రేవంత్’కు పగ్గాలు అప్పగించాలన్న నిర్ణయం మరి కొంత కాలం వాయిదా పడుతుందని, పాత కాపులకు కావలసింది కూడా అదేనని అంటున్నారు.
జూన్ 9వ తేదీన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి, మాణిక్య ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస కృష్ణన్ హైదరాబాద్ చేరుకొని, ప్రస్తుత పీసీసీ మొదలు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలు, పోటీచేసి ఓడిపోయినా అభ్యర్ధులు, జిల్లా, మండల,ఆ క్రింది క్షేత్ర స్థాయి నాయకులు ఇలా అందరి అభిప్రాయలు సేకరించి, ఢిల్లీకి నివేదిస్తారు.ఈలోగా, కుర్చీలు గాలిలో ఎగరడం, మినీ, మహా సంగ్రామలు, మాటల యుద్ధం, ఇలా ఏదైనా జరగవచ్చును.ఆ వంకన పీసీసీ ఎంపిక మళ్ళీ వాయిదా పడినా పడవచ్చును అని , అనుమానించే వారు అనుమానిస్తున్నారు. సో.. పీసీసీ అధ్యక్ష ఎంపిక ..అంత ఈజీ కాదు.
మరో వైపు గతంలో వివిధ స్థాయిల్లో పరిశీలించి, అధిష్టానానికి షార్ట్ లిస్టు పంపిన తర్వాత, మళ్ళీ రెడ్దొచ్చి మొదలాడు అన్నట్లు, మళ్ళీ మరోమారు అభిప్రాయ సేకరణ ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి లేదా తాము కూడా రేసులో ఉన్నామని చెప్పుకుంటున్న కోమటి రెడ్డి, జగ్గా రెడ్డి లేదా మరొకరు, ఎవరైనా, మరి కొంత కాలం నిరీక్షించక తప్పదు..