రేవంత్ ప్రతినిథులకు కేసీఆర్ నో అప్పాయింట్ మెంట్!?

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సావం సదర్భంగా జూన్ 2న నిర్వహించే అధకారిక కార్యక్రమానికి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి స్పెషల్ ఇన్విటేషన్ పంపారు. ఆయనను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ స్వయంగా లేఖ రాసి దానిని ప్రభుత్వ సలహాదారు హ‌ర్కార వేణుగోపాల్ కు ఇచ్చి స్వయంగా కలిసి ఆహ్వానపత్రికను, తన లేఖను ఇచ్చి ఆహ్వానించాల్సిందిగా కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన, రాష్ట్ర ఆవిర్భావం తరువాత పదేళ్లు సీఎంగా ఉన్న నాయకుడికి సముచిత గౌరవం ఇచ్చారు. అయితే కేసీఆర్ మాత్రం ప్రభుత్వ సలహాదారు ఎంతగా ప్రయత్నించినా అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో వేణుగోపాల్ కు కేసీఆర్ ను కలిసి రేవంత్ లేఖ ఇచ్చి ఆహ్వానించే అవకాశం ఇంత వరకూ దొరక లేదు. 

దీంతో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోన్న దశాబ్ది ఉత్సవాల్లో కేసీఆర్ పాల్గొనడం అనుమానమే అన్న భావన వ్యక్తం అవుతోంది. ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యే ఉద్దేశంలో లేరనీ, అందుకే ప్రభుత్వ సలహాదారుకు అపపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదనీ రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయినా అధికారంలో ఉన్న సమయంలో కూడా కేసీఆర్  ఎవరికీ అప్పాయింట్ మెంట్ ఇచ్చే వారు కాదనీ, తనను కలుసుకోవాలని భావించే వారిని ఆయన కలిసిన దాఖలాలు లేవనీ, ఎవరినైనా తాను కలిసి మాట్లాడాలనిపిస్తే మాత్రమే కేసీఆర్ ఆయనను ప్రగతి భవన్ కు పిలిపించుకుని మాట్లాడి పంపేవారని అంటున్నారు.

అధికారం కోల్పోయిన తరువాత కూడా ఆయన ప్రజలు, నాయకులకు దగ్గర కావడానికి ఇసుమంతైనా ప్రయత్నించడం లేదని అంటున్నారు. తెలంగాణ ఎన్నికలకు ముందు పలు సందర్భాలలో ఆయన ఇక పొలిటికల్ రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాల ద్వారానే వినిపించింది. ప్రస్తుతం అధికారం కోల్పోయి, పార్టీని మళ్లీ బలోపేతం చేయాల్సిన పరిస్థితుల్లో కూడా ఆయన ఫామ్ హౌస్ కు పరిమితమై ఉండటం చూస్తుంటే కేసీఆర్ అడుగులు రిటైర్మెంట్ దిశగా పడుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక పోతే రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను బీఆర్ఎష్ పార్టీ కూడా మూడు రోజులు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఆ కార్యక్రమాలలో పాల్గొనేందుకు  కేసీఆర్ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కావడం లేదని అనుకున్నా, సీఎం పంపిన ఆహ్వానాన్ని అందుకుని, తాను రాలేకపోవడానికి కారణాలను వివరిస్తూ సున్నితంగా తిరస్కరించి ఉంటే హుందాగా ఉండేదని   బీఆర్ఎస్ వర్గాల్లోనే వినిపిస్తోంది.   

Teluguone gnews banner