ప్రధాని రేసులో మోడీ వెనక్కు..గడ్కరీ ముందుకు?
posted on May 31, 2024 @ 2:58PM
బీజేపీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ పరిస్థితి నెలకొని ఉంది. కేంద్రంలో మోడీ నేతృత్వంలో తొలి సారి ప్రభుత్వం ఏర్పాటు సమయంలో ఉన్న ఐక్యత పదేళ్ల తరువాత మచ్చుకు కూడా కనిపించడం లేదా? అంటే బీజేపీ వర్గాలే ఔనని అంటున్నాయి. హ్యాట్రిక్ విజయం కోసం ఎదురు చూస్తున్న కమలం, ఆ విజయం సాధించినా ముచ్చటగా మూడో సారి మోడీ ప్రధాని అయ్యే అవకాశాలు అంతంత మాత్రమేనని చెబుతున్నాయి. ఈ సారి 400 సీట్లు అంటూ ఘనంగా ప్రచారం చేసుకున్నప్పటికీ.. ఎన్డీయే కూటమికి 400 సీట్ల మాట అటుంచి, బీజేపీ సొంతంగా 250 స్థానాలు గెలవడం గగనమే అన్న పరిస్థితులున్నాయని బీజేపీలోని ఒక బలమైన వర్గం గట్టిగా చెబుతోంది.
మిత్రపక్షాల మద్దతు లేకుండా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుకు అసరమైన స్థానాలను బీజేపీ గెలుచుకునే పరిస్థితి కనిపించడం లేదని, అదే జరిగితే.. ప్రధాని పదవికి మోడీకి ప్రత్యామ్నాయంగా మరో వ్యక్తిని ఆ పార్టీ పొలిటికల్ మెంటర్ ఆర్ఎస్ఎస్ తన ఛాయిస్ గా తెరపైకి తీసుకువచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నాయి. వాస్తవానికి గత కొన్నేళ్లుగా బీజేపీలో అంతర్గతంగా ఆర్ఎస్ఎస్ అనుకూల, మోడీ అనుకూల వర్గాలు వేటికవిగా బలపడుతూ వస్తున్నాయి.
మోడీ, షా ఒంటెత్తు పోకడలు, ఆర్ఎస్ఎస్ తో సన్నిహిత సంబంధాలున్న గడ్కరీ వంటి సీనియర్ నాయకులను మోడీ; షా ద్వయం ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతోందన్న భావన ఆర్ఎస్ఎస్ అనుకూల బీజేపీ నేతలలో బలంగా ఉంది. దేశంలో వరుసగా రెండు సార్లు బీజేపీ అధికారంలోకి రావడానికి మోడీ,షా ద్వయం తమ ఘనతేనన్నట్లుగా విస్తృత ప్రచారం చేసుకోవడం పట్ల ఆర్ఎస్ఎస్ అనుకూల వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఆ అసంతృప్తే మోడీ, ఆర్ఎస్ఎస్ మధ్య పూడ్చలేని అగాధంగా మారింది.
ఈ నేపథ్యంలోనే ఈ సారి సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ సొంతంగా అధికారం చేపట్టగలిగే మ్యాజిక్ ఫిగర్ ను సాధించడంలో విఫలమైతే.. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చినా ప్రధాని రేసులో మోడీకి పోటీగా ఆర్ఎస్ఎస్ వర్గం మరో వ్యక్తిని తీసుకువచ్చే అవకాశాలున్నాయని బీజేపీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక ఇప్పటి వరకూ జరిగిన ఆరు విడతల పోలింగ్ సరళిని బట్టి చూస్తే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గట్టి పోటీ ఇచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే బీజేపీ ప్రధాని పదవికి మోడీకి ప్రత్యామ్నాయ నేత కోసం అన్వేషిస్తోందా? దీని వెనుక ఆర్ఎస్ఎస్ ఉందా అన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది. మోడీ, షాలు పార్టీపై తమ పట్టును బలోపేతం చేసుకునేందుకు ఆర్ఎస్ఎస్ తో సన్నిహింగా ఉండే గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్ వంటి వారిని పక్కన పెట్టిందని అంటున్నారు. అంతే కాకుండా గడ్కరీ ఓటమే లక్ష్యంగా నాగపూర్ లో తెరవెనుక పలు కుట్రలకు తెరతీసిందనీ, ఓట్ల తొలగింపు నుంచి, మోడీ నాగపర్ లో ప్రచారం చేయకపోవడం వరకూ పలు ఉదాహరణలు చూపుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఫలితాలు బీజేపీకి ఏకపక్షంగా రాకపోతే.. మిత్రపక్షాలు కలిసివస్తే తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడితే.. ప్రధాని రేసులో మోడీ వెనుకబడి గడ్కరీ ముందుకు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.