కారు నేతల్లో చిన్న‌సారుకు సీన్ లేదా?!

రాజ‌కీయాల్లో ఓడ‌లు బండ్లు.. బండ్లు ఓడలు కావ‌డానికి పెద్ద  ఎక్కువ కాలం ప‌ట్ట‌దు. అధికారంలో ఉన్నంత సేపు ఈగ‌ల గుంపులా పార్టీ ముఖ్యుల చుట్టూ ప్రదక్షిణలు చేసే నేత‌లు.. అధికారంలో కోల్పోయిన త‌రువాత వారి వైపు కూడా చూడ‌రు. రాజ‌కీయాల్లో ఈ విష‌యం సాధార‌ణంగా జ‌రిగేదే. ప్ర‌స్తుతం ఆ అనుభ‌వం బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు స్ప‌ష్టంగా బోధప‌డుతోంది. కేటీఆర్ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న అపాయింట్ మెంట్ కోసం చాలా మంది నేత‌లు ఎదురు చూసేవారు. అవ‌కాశం దొరికితే కాబోయే సీఎం కేటీఆర్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు కూడా. ప‌రిస్థితులు తిర‌గబ‌డ‌టానికి ఎంతో కాలం ప‌ట్ట‌లేదు. గ‌తేడాది చివ‌రిలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌టంతో బీఆర్ఎస్ లోని ప‌లువురు కీల‌క నేత‌లు, ద్వితీయ స్థాయి నేత‌లు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. కేసీఆర్‌, కేటీఆర్ ల‌కు అత్యంత ద‌గ్గ‌ర వ్య‌క్తులు సైతం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. ఇప్పుడు ఇంకా బీఆర్ఎస్ లో ఉన్న‌ నేత‌లు సైతం అవ‌కాశాన్నిబ‌ట్టి ఎప్పుడైనా గోడదూకేస్తారన్న సంకేతాలే కనబడుతున్నాయి. ఈ నెల‌లో జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు జూన్ 4న వెల్ల‌డి కానున్నాయి. ఈ ఫ‌లితాల్లో బీఆర్ఎస్ క‌నీసం 8 నుంచి తొమ్మిది స్థానాల్లో విజ‌యం సాధించ‌క‌పోతే ఆ పార్టీని వీడే నేత‌ల సంఖ్య భారీగానే ఉంటుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

 బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా ఉన్న‌ప్ప‌టినుంచి ప్ర‌తిప‌క్ష పాత్ర  పోషించ‌లేదు. గ‌తంలో కేసీఆర్‌, హ‌రీశ్ రావులు తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో పార్టీని ముందుండి న‌డిపించారు. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు త‌రువాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాతే కేటీఆర్ పార్టీలో కీల‌క భూమిక పోషిస్తూ వ‌చ్చారు. మంత్రిగా ప్ర‌భుత్వ పాల‌న‌లో, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హోదాతో పార్టీలో నెంబ‌ర్ 2గా కేటీఆర్ కొన‌సాగారు. దీంతో బీఆర్ఎస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు కేటీఆర్ ను సీఎం స్థాయిలో చూస్తూ వ‌చ్చారు. పార్టీలోని ముఖ్య‌నేత‌లు సైతం ప‌ద‌వులకోసం కేటీఆర్ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేశారు.  కేసీఆర్, కేటీఆర్ ఏం చెబితే అది పార్టీ నేత‌లు శాస‌నంగా భావిస్తూ వ‌చ్చారు. కానీ, ప్ర‌స్తుతం ప‌రిస్థితి మారిపోయింది. అధికారం కాల్పోవ‌డంతో కేటీఆర్ హ‌వా కూడా పార్టీ నేత‌ల్లో క్ర‌మంగా త‌గ్గుతూ వ‌చ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత నిర్వ‌హించిన అసెంబ్లీ స‌మావేశాల్లో పార్టీ శ్రేణులు ఆశించిన స్థాయిలో కేటీఆర్ రాణించ‌ లేక పోయారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కేటీఆర్ చేసిన‌ ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాయి. అధికారంలోఉన్న స‌మ‌యంలో అసెంబ్లీ స‌మావేశాల్లో విప‌క్షాల‌పై విరుచుకుప‌డుతూ బెంబేలెత్తించిన కేటీఆర్‌.. ప్ర‌తిప‌క్ష హోదాలో పార్టీ శ్రేణులు ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ స‌భ్యుల దూకుడును ఎదుర్కోలేక పోయారు. దీంతో, హ‌రీశ్ రావు ఫ్రంట్ రోల్ లోకి వ‌చ్చి కాంగ్రెస్ స‌భ్యులకు దీటైన స‌మాధానం చెప్పారు.

 బీఆర్ ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన త‌రువాత కేటీఆర్ హ‌వా పార్టీలో తగ్గుతూ వ‌స్తోందన్న విష‌యం తాజాగా మ‌రోసారి స్ప‌ష్ట‌మైంది.  ఖ‌మ్మం - వ‌రంగ‌ల్ - న‌ల్గొండ ఉమ్మ‌డి జిల్లాల నియోజ‌క‌వ‌ర్గ  గ్రాడ్యుయేష‌న్ ఎమ్మెల్సీ ఎన్నికకు  ఈనెల 27న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. జూన్ 5న ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి.  ఈ ఎన్నిక‌ల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్య‌ర్థులు పోటీ ప‌డుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి,  బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు.  బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా రాకేశ్ రెడ్డి ఎంపిక‌పై మూడు ఉమ్మ‌డి జిల్లాల్లోని బీఆర్ఎస్ కీల‌క‌ నేత‌లు అసంతృప్తిగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. త‌మ‌ను సంప్ర‌దించ‌కుండానే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి మ‌నిషి అయిన రాకేశ్ రెడ్డికి ఏక‌ప‌క్ష నిర్ణ‌యంతో కేసీఆర్, కేటీఆర్ టికెట్ ఇచ్చార‌ని స‌ద‌రు నేత‌లు ఆగ్ర‌హంతో ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆ ప్ర‌చారం నిజ‌మేన‌ని  రెండు రోజుల క్రితం స్ప‌ష్ట‌మైంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రాకేశ్ రెడ్డి విజ‌యానికి అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై స‌మీక్ష నిర్వ‌హించేందుకు రావాల‌ని మూడు ఉమ్మ‌డి జిల్లాల పార్టీ ముఖ్య‌ నేత‌ల‌కు  కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కానీ  ఆ స‌మావేశానికి ప‌లువురు నేత‌లు గైర్హాజరయ్యారు. కేవ‌లం కొద్ది మంది మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. దీంతో పార్టీలో ఈ విష‌యం పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కేటీఆర్ పిలిచినా నేత‌లు స‌మావేశంకు హాజ‌రుకాక‌పోవ‌టం  పార్టీలో కేటీఆర్ హ‌వా త‌గ్గిపోయింద‌నడానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో బ‌ల‌ప‌డేందుకు బీజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆపార్టీ ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపించింది. కేంద్రంలో మ‌రోసారి బీజేపీ అధికారంలోకి వ‌స్తే  బీఆర్ఎస్ లోని ముఖ్య‌నేత‌లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లోకి క్యూక‌ట్ట‌డం ఖాయ‌ంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే కాంగ్రెస్ నేత‌లు మీడియా స‌మావేశాల్లో లోక్ స‌భ ఫ‌లితాల త‌రువాత బీఆర్ ఎస్ నుంచి పెద్ద సంఖ్య‌లో కాంగ్రెస్ లోకి వలసలు ఉంటాయని చెప్పారు. అదే జ‌రిగితే రానున్న కాలంలో బీఆర్ ఎస్ పార్టీకి మ‌రింత గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర‌వ‌డం ఖాయం. అలాంటి ప‌రిస్థితుల‌ను కేటీఆర్ స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొంటారని కానీ, ఎదుర్కోగలుగుతారని కానీ  పార్టీ శ్రేణులు బావించ‌డం లేదు. కేసీఆర్‌, హ‌రీశ్ రావులు యాక్టివ్ పాత్ర పోషిస్తేనే పార్టీ మ‌నుగ‌డ సాధ్య‌మ‌వుతుంద‌నీ, కేటీఆర్ చేతిలోకి పార్టీ ప‌గ్గాలు వెడితే పార్టీ మనుగడే ప్రశ్నార్ధకమౌతుందనీ బీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి. 

మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభంజనం

  తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు ప్రభంజనం సృష్టిస్తోంది. మూడోవంతు సర్పంచ్ స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్‌ఎస్ పార్టీ, బీజేపీ కలిపినా 30 శాతం కూడా దాటలేదు. మొత్తం 4,158 స్థానాల్లో ఎక్కువ చోట్ల గెలిచి ఆధిక్యాన్ని చాటారు. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్‌ భూపాల్‌పల్లి, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, నాగర్‌ కర్నూల్‌, నల్గొండ, నిజామాబాద్‌, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్‌, కామారెడ్డి, ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్‌ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు.  రాత్రి 8 గంటల వరకు కాంగ్రెస్‌ పార్టీ ఏకగ్రీవాలతో కలిపి 1850, బీఆర్ఎస్ 960, బీజేపీ 180, ఇతరులు 390 సర్పంచ్‌ స్థానాల్లో గెలు పొందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం, గుండ్లరేవు గ్రామంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గుండ్లరేవు గ్రామంలో మూడో దశలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. భూక్యా చంద్రబాబు, బానోత్ జగన్నాథం అలియాస్ జగన్ ఇద్దరు వ్యక్తులు పోటీ చేశారు. ఏపీ రాజకీయ నాయకుల పేర్లతో వీరి పేర్లు ఉండటంతో గ్రామంలో ప్రచారం కూడా ఆసక్తికరంగా జరిగింది. వారి ప్రచారం కూడా 'చంద్రబాబు', 'జగన్' పేర్లతోనే ఎక్కువగా సాగింది. ఈరోజు జరిగిన పోలింగ్‌లో బానోత్ జగన్‌పై భూక్యా చంద్రబాబు విజయం సాధించారు. దీంతో 'జగన్‌పై చంద్రబాబు విజయం' అంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది  

పులివెందులలోనూ కదులుతున్న వైసీపీ పునాదులు!?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో వైసీపీ పునాదులు కదులుతున్నాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.  వాస్తవానికి గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీలో నాయకులు, శ్రేణులూ పూర్తిగా డీలా పడ్డాయి. దానికి తోడు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వలస వెళ్లిపోయి, ఎలాగో తీరిక చేసుకుని వారానికి ఒక సారి మాత్రం ఆంధ్రప్రదేశ్ వచ్చి.. వెడుతున్నారు. దీంతో ఆయన పూర్తిగా పార్ట్ టైమ్ పొలిటీషియన్ గా మారిపోయినట్లైందని పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో వైసీపీ నుంచి వేగంగా వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నాయకులు, జగన్ సన్నిహితులు కమలం గూటికి చేరారు. ఇలా ఉండగా ఎవరెలా వెళ్లిన కడప, మరీ ముఖ్యంగా పులివెందులలో వైసీపీ బలంగా ఉందన్న అభిప్రాయం ఇంత వరకూ కొనసాగుతూ వచ్చింది. ఎప్పుడైతే పులివెందుల జడ్డీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ కనీసం డిపాజిట్ కూడా నోచుకోకుండా ఘోర పరాజయాన్ని చవిచూసిందో.. అప్పుడే పులివెందులలో వైసీపీది వాపేనా, బలం కాదా? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆ తరువాత పులివెందుల నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీయులు, నియెజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ బీటెక్ రవి సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరడం కూడా పులివెందులలో వైసీపీ బలం సన్నగిల్లిందనడానికి తార్కానంగా నిలిచింది. ఇక తాజాగా జగన్ సన్నిహితుడు,    వేంపల్లిలో వైసీపీ కీలక నేత అయిన చంద్రశేఖరెడ్డి అలియాస్ దిల్ మాంగే వైసీపీకి గుడ్ బై చెప్పి బీటెక్ రవి సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరారు. ఆయనతో పాటు వందల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు కూడా తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వేంపల్లిలో వీరు భారీ ర్యాలీ నిర్వహించారు. వీరి చేరిక కార్యక్రమంలో తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి, స్థానిక తెలుగుదేశం నాయకులు కూడా పాల్గొన్నారు.  ఈ పరిణామంతో పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ పతనం ప్రారంభమైనట్లేనని అంటున్నారు.  

ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ల డిస్మిస్

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ గడ్డం ప్రసాదరావు బుధవారం (డిసెంబర్ 17) కీలక తీర్పు వెలువరించారు.  ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారిందని చెప్పడానికి సాక్ష్యాధారాలు నమోదు కాలేదని పేర్కొంటూ అనర్హత పిటీషన్లను స్పీకర్ గడ్డం ప్రసాదరావు డిస్మస్ చేశారు. బుధవారం ఆయన ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తీర్పు వెలువరించారు.  2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన పది మంది ఎమ్మెల్యేలు ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరారంటూ బీఆర్ఎస్ అరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన స్పీకర్ ఎమ్మెల్యేల వాదనలు విన్నారు.  బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహీపాల్ రెడ్డి, అరెకపూడికి గాంధీకి సంబంధించిన అనర్హత పిటీషన్లను డిస్మిస్ చేస్తూ అసెంబ్లీ స్పీకర్  గడ్డం ప్రసాదరావు తీర్పు వెలువరించారు. కాగా సుప్రీంకోర్టు ఈ నెల 17వలోగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే స్పీకర్ గడ్డం ప్రసాదరావు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ లపై తీర్పు వెలువరించారు.  

కాంగ్రెస్, బీజేపీల్లో లీకు వీరులు.. హరీష్, కేటీఆర్ కు చేరుతున్న కీలక సమాచారం!

తెలంగాణ పారిశ్రామిక విధానంపై  రేవంత్ సర్కార్ ఇలా అనుకుందో లేదో.. అది విషయం అలా  బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు  కేటీఆర్ కి చేరిపోయింది. ఇవేం లీకులురా బాబూ అంటే రేవంత్ సర్కార్ ఒక్క‌సారి  ఉలిక్కి ప‌డింది.   ప్ర‌భుత్వ అధికార గ‌ణంలో.. మ‌రీ ముఖ్యంగా  స‌చివాల‌యంలో కేటీఆర్ కి ఇంత నెట్ వ‌ర్క్ ఉందా?  అని విస్తుపోయింది. విచారణకు ఆదేశించి.. లీకు వీరులు ఎవరైనా, ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలూ జారీ చేసింది.   అలాగే  మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు చేసిన కోవ‌ర్ట్ కామెంట్ కూడా బీఆర్ఎస్ కు పార్టీలో ఉన్న లీకు వీరుల సంగతిని ప్రస్ఫుటం చేసింది. ఇంతకీ మైనంపాటి ఏమన్నారంటే..   రాష్ట్రం సంగ‌తేమో తెలీదు కానీ, మెద‌క్, సిద్ధిపేట ప‌రిస‌ర‌ప్రాంతాల‌లో  హ‌రీష్ రావు ప్ర‌భావం చాలా చాలా ఎక్కువ‌గా ఉంద‌నీ,    ఒక మాట మన నోటి నుంచి ఇలా వచ్చిందో లేదో.. అలా హరీష్ కు చేరిపోతుందని బాహాటంగానే ఆవేదన వ్యక్తం చేశారు.   ప్ర‌భుత్వ అధికారుల్లోనూ హ‌రిష్ ఫాలోయ‌ర్స్,  మద్దతు దారులు బలంగా ఉన్నారన్న అభిప్రాయమూ కాంగ్రెస్ లో వ్యక్తం అవుతోంది.  దీనిపై కూడా మైనంప‌ల్లి  బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత కోవ‌ర్ట్ నెట్ వ‌ర్క్ న‌డుపుతున్నా,  ఎప్ప‌టిక‌ప్పుడు కాంగ్రెస్ లీడ‌ర్లు, ఇత‌ర‌ ప్ర‌భుత్వ స‌మాచారం వారికి చేరిపోతున్నా..  ప్ర‌జ‌లు మాకు ప‌ట్టం క‌ట్టి  గెలిపిస్తున్నారన్నారు  మైనంప‌ల్లి.  అయితే ప్రభుత్వ సమాచారం ప్రతిపక్షానికి లీక్ కావడమన్నది ఎంత కాదనుకున్నా ఇబ్బందేనని అంటున్నారు కాంగ్రెస్ నేతలు.  అయితే ఆ లీకులు ఒక్క రేవంత్ సర్కార్ కే పరిమితం కాలేదనీ, రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీలోనూ ఉన్నాయనీ వెల్లడైంది. కమలం పార్టీలోనూ లీకు వీరులున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా చెప్పారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీతో తమ భేటీ లో ని అంశాలన్నీ లీకయ్యయని కిషన్ రెడ్డి లబోదిబో మన్నారు. ఇలా లీకులు చేసే వారు మెంటల్ గాళ్లంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్ర బీజేపీ నేతలతో భేటీ సందర్భంగా ప్రధాని  మోడీ.. సోష‌ల్ మీడియాలో మీక‌న్నా అస‌దుద్దీన్ ఓవైసీ  న‌యం అన్నారు. ఆ మాట బయటకు వచ్చేసింది. మోడీ అక్షింతలతో రాష్ట్ర బీజేపీ నేతల పరువు సగం పోయింది. మోడీ వ్యాఖ్యలు లీక్ అయ్యి బయటకు రావడం, ఆ లీకు వీరుల పని పడతామంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో చెప్పక తప్పని పరిస్థితి రావడంతో రాష్ట్ర బీజేపీ పరువు పూర్తిగా పోయినట్లైంది. మొత్తం మీద అధికారంలో లేకున్నా ట్యాపింగ్ వంటి  దారులలో స‌మాచార సేక‌ర‌ణ చేయ‌డానికి వీల్లేకున్నా కూడా హ‌రీష్, కేటీఆర్ కి చేరాల్సిన  స‌మాచార‌మైతే చేరిపోతోంద‌న‌డానికి  ఎటువంటి సందేహం అవసరం లేదు.   

హస్తినలో తెలంగాణ సీఎం.. కేంద్ర మంత్రులు, సోనియాతో భేటీలతో బిజీబిజీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినలో బిజీబిజీగా ఉన్నారు. ఓ వైపు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూనే, మరో వైపు కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం అవుతూ క్షణం తీరక లేకుండా గడుపుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారానమ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొల్పనున్న 105 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు సహకారం అందించాలని కోరారు.  వీటి ద్వారా ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా నాలుగు లక్షల మంది విద్యార్థుల‌కు మెరుగైన విద్య అందుతుంద‌ని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు.  వీటి నిర్మాణం,   ఇత‌ర విద్యా సంస్థ‌ల ఏర్పాటుకు దాదాపు 30 వేల కోట్ల రూపాయలు అవసరమౌతాయని తెలిపిన ఆయన వీటి ఏర్పాటు కోసం తీసుకునే రుణాలను ఎఫ్ఆర్బీఎం నుంచి మినహాయించాలని కేంద్ర మంత్రిని కోరారు.   అదే విధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అయిన సీఎం రేవంత్.. ఆ సందర్భంగా  హైదరాబాద్ కు ఐఐఎం మంజూరు చేయాల‌ని విజ్ణప్తి చేశారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని గుర్తించామని తెలియజేశారు. అలాగే అవసరమైతే వెంటనే తరగతులు ప్రారంభించేందుకు ట్రాన్సిట్ క్యాంపస్ కూడా రెడీగా ఉందని తెలిపారు.  ఐఐఎం ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తే.. అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం సిద్ధంగా ఉ:దన్నారు.  అదే వి ధంగా తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా తొమ్మది కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహార్  నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలం, ఇతర వసతులు కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీగా ఉందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ కు తెలిపారు రేవంత్ రెడ్డి.   ఇక పోతే కాంగ్రెస్ అగ్రనాయకురాలు, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గంధీతో  సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా తెలంగాణలో ఈ నెల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వివరాలను తెలిపారు. అలాగే..  తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2024ను సోనియాకు అందజే శారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనతో గత రెండేళ్లుగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, భవిష్యత్ ప్రణాళికలను రేవంత్ ఈ సందర్భంగా సోనియాగాంధీకి వివరించారు.  ఈ సందర్భంగా తెలంగాణలో రేవంత్ సర్కార్ పాలన, రాష్ట్ర అభివృద్ధి విషయంలో  రేవంత్ రెడ్డి దూరదృష్టిపై సోనియాగాంధీ అభినందించారు.   

ఐడీపీఎల్ ల్యాండ్స్‌పై విజిలెన్స్ విచారణ

హైదరాబాద్ లోని ఐడీపీఎల్  భూముల వివాదం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. దాదాపు నాలుగు వేల  కోట్ల రూపాయల విలువైన భూములపై వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ విచా రణకు ఆదేశాలు జారీ చేసింది. కూకట్‌పల్లి పరిధిలోని సర్వే నంబర్‌ 376లో జరిగిన లావా దేవీలపై సమగ్ర విచారణ జరపాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఐడీపీఎల్ భూముల విషయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత  ఇటీవల పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ భూముల వ్యవహారం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.   ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఆయన కుమారుడు భూకబ్జాలకు పాల్పడ్డారని కవిత ఆరోపించగా,  మాధవరం కృష్ణారావు కవిత భర్త అనిల్‌పై భూకబ్జా ఆరోపణలు చేశారు. ఈ పరస్పర ఆరోపణల నేపథ్యంలో  ప్రభుత్వం ఈ భూముల అసలు యాజమాన్యం, గతంలో జరిగిన లావాదేవీలు, అక్రమ కబ్జాల అంశాలపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేసి పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని ఆదేశించింది.   ఈ విచారణలో  కబ్జాదారులు ఎవరన్నది తేలితే   వారిపై కఠిన చర్యలు తీసు కుంటామని ప్రభుత్వం స్పష్టం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ వివాదం రాజకీయంగా సంచలనంగా మారగా, విజిలెన్స్ విచారణతో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి నారా బ్రహ్మణి నో

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి కోడలు, మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రహ్మణి తనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి విపక్ష నేత చంద్రబాబును స్కిల్ కేసు పేరుతో అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో నారా బ్రహ్మణి తొలి సారిగా ప్రజల మధ్యకు వచ్చి అరెస్టునకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఆ సందర్భంగా ఆమె ప్రసంగాలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. స్వచ్ఛమైన ఉచ్ఛారణతో తెలుగులో ఆమె చేసిన ప్రసంగం, రాజకీయాలపై ఆమెకు ఉన్న అవగాహనను ప్రస్ఫుటం చేసింది. దీంతో అప్పట్లో తెలుగుదేశం కు నారా బ్రహ్మణి బ్రహ్మాస్త్రం అంటూ తెలుగుదేశం శ్రేణులు పేర్కొన్నాయి. విశ్లేషకులు సైతం ఆమె రాజకీయాలలోకి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే తాజాగా బ్రహ్మణి స్వయంగా తనకు ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. తన ప్రథమ ప్రాధాన్యత హెరిటేజ్ ఫుడ్స్ మాత్రమేనని చెప్పారు.   బిజినెస్ టుడే  ఈ నెల 12న ముంబైలో నిర్వహించిన 'మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ -2025 కార్యక్రమంలో బ్రాహ్మణి  పాల్గొని ప్రసంగించారు. హెరిటేజ్ ఫుడ్స్ ద్వారా  సమాజంపై గొప్ప ప్రభావం చూపించే అవకాశం తనకు లభించిందన్న ఈ సందర్భంగా ఆమె చెప్పారు. కాగా కార్యక్రమ నిర్వాహకులు ఒక వేళ చంద్రబాబు మిమ్మల్ని రాజకీయాలలోకి రావాల్సిందిగా కోరితే ఏం చేస్తారు అన్న ప్రశ్నకు.. నారా బ్రహ్మణి రాజకీయాలు తనకు  ఆసక్తికరమైన రంగం కాదని స్పష్టం చేశారు. పాడి పరిశ్రమ రంగంలో  లక్షల మంది మహిళా రైతులు, కోట్లాది మంది వినియోగదారులపై ప్రభావం చూపగలిగే అవకాశం తనకు లభించిందని, అటువంటి అవకాశాన్ని తాను వదులుకోదలచుకోలేదని బ్రాహ్మణి అన్నారు. 

అనుచిత పోస్టుల కేసు... జగన్ సమీప బంధువు అరెస్ట్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు  అర్జున్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో అప్పటి విపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులపై ఇష్టారీతిగా అసభ్య పోస్టులు పెట్టిన కేసులో ఈ అరెస్టు జరిగింది.  జగన్ అధికారంలో ఉన్న సమయంలో  తమకు ఎదురే లేదన్నట్లు చెలరేగిపోయిన వైసీపీ నేతలు, అప్పటి తన కర్మఫలాన్ని ఇప్పుడు అనుభవించక తప్పడం లేదు. జగన్ గద్దె దిగి   రెండేళ్లు అవుతున్నా నాడు జగన్ అధికారం అండ చూసుకుని చెలరేగి అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయినందుకు ఫలితం అనుభవించక తప్పడం లేదు.  జగన్ హయంలో ఇష్టారీతిగా వ్యవహరించి, సోషల్ మీడియాలో అసభ్య పోస్టులతో చెలరేగిపోయిన వైసీపీ నేతలు పలువురు తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే విదేశాలకు పరారైపోయారు. అయితే పోలీసులు వారికి లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి మరీ అరెస్టులు చేస్తున్నారు.   అధికారం శాశ్వతం, ఏపీలో ఇక తమకు ఎదురేలేదన్నట్లు అక్రమాలు, దౌర్జన్యాలతో చెలరేగిపోయి,  జగన్ మెప్పు కోసం  సోషల్ మీడియాలో విపక్షాల ముఖ్యనేతలు, వారి కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు పెడుతూ   రాక్షస ఆనందం పొందిన వైసీపీయులు ఇప్పుడు  కేసులు ఎదుర్కొంటున్నారు.  ఎక్కడెక్కడికో పరారైన వైసీపీ నేతలను పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి మరీ అదుపులోనికి తీసుకుంటున్నారు.   తాజాగా వైసీపీ అధ్యక్షుడు జగన్ సమీప బంధువు అర్జున్‌రెడ్డిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గుడివాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ సోషల్ మీడియా విభాగంలో అప్పటి ఆ వింగ్ ఇన్చార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డితో కలిసి అర్జున్‌రెడ్డి యాక్టివ్‌గా పని చేశాడు. ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, వారి కుటుంబ సభ్యుల చిత్రాలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి వైసీపీ సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారంటూ అర్జున్‌రెడ్డిపై గతేడాది నవంబరులో గుడివాడలో కేసు నమోదైంది. అప్పట్లో అతన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా విదేశాలకు పారిపోయాడు. తర్వాత పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. తాజాగా అతను విదేశాల నుంచి తిరిగి రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అర్జున్‌రెడ్డిని అడ్డుకుని గుడివాడ పోలీసులకు సమాచారమిచ్చారు. ఏపీ నుంచి వెళ్లిన పోలీసు బృందాలు అదుపులోనికి తీసుకుని సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ నోటీసులు అందజేశారు. అయితే అర్జున్‌రెడ్డి అప్పటికే తన లాయర్లను ఎయిర్‌పోర్టుకి రప్పించుకున్నారు. అతనిపై ఉమ్మడి కడప జిల్లా సహా పలు జిల్లాల్లో కేసులున్నాయి.  వైఎస్ జగన్‌కు బాబాయ్ వరుసయ్యే వైఎస్ ప్రకాశ్‌రెడ్డి మనుమడే అర్జున్‌రెడ్డి. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో రెండో నిందితుడైన సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్‌యాదవ్, అర్జున్‌రెడ్డిల మధ్య వివేక హత్య జరిగిన రోజు రాత్రి ఫోన్ సంభాషణలు జరిగినట్లు అభియోగాలున్నాయి. దీనిపై దర్యాప్తు చేసి, అనుబంధ చార్జ్‌షీట్ వేయాలని హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు ఇటీవల సీబీఐని ఆదేశించిన సంగతి తెలిసిందే.  మరోవైపు బద్వేలుకు చెందిన వైసీపీ నేత బత్తల శ్రీనివాసులరెడ్డిని  కడప చిన్నచౌకు పోలీసులు హైదారాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం అయిన నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌తో పాటు పలువురు టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై బత్తల శ్రీనివాసులరెడ్డి సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టాడు. దీనిపై కడపకు చెందిన టీడీపీ నేతలు గత ఏడాది నవంబరులో చిన్నచౌకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీనివాసులురెడ్డిపై చిన్నచౌకుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. కాగా.. కూటమి అధికారంలోకి రాగానే బత్తల శ్రీనివాసులరెడ్డి గల్ఫ్‌ వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో  గల్ఫ్‌ నుంచి ఆయన హైదారబాద్‌కు రాగానే ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకుని కడప పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే చిన్నచౌకు పోలీసులు హైదారబాద్‌కు వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకుని కడపకు తీసుకువచ్చారు. మొత్తానికి అరెస్టుల భయంతో అసలే బిక్కుబిక్కు మంటున్న వైసీపీ శ్రేణులకు ఈ తాజా అరెస్టులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం : కవిత

  సామాజిక తెలంగాణయే తన లక్ష్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో తాము పోటీలో ఉంటామని తేల్చిచెప్పారు. సోమవారం ఆస్క్ కవిత హ్యాష్ ట్యాగ్ పై ట్విట్టర్ (ఎక్స్) లో పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె వివరంగా సమాధానాలు ఇచ్చారు. తెలంగాణ విషయంలో తన విజన్, జాగృతి భవిష్యత్ కార్యాచరణ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు సహా పలు ప్రశ్నలను నెటిజన్లు సంధించారు. వాటికి కవిత ఇచ్చిన సమాధానాలు. ట్విట్టర్ (ఎక్స్) పాలిటిక్స్ విభాగం లో ఆస్క్ కవిత ఇంటరాక్షన్ నంబర్ వన్ గా నిలిచింది. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం  సామాజిక తెలంగాణ తన ధ్యేయమని కవిత తెలిపారు. యువత, మహిళలు వారికి నచ్చిన రంగాల్లో అవకాశాలు పొందాలని...అందుకు వారిని ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. యువత, మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించేందుకు జాగృతి కృషి చేస్తుందన్నారు. కొత్త పార్టీకి సంబంధించి అడిగిన ప్రశ్నకు క్లారిటీ ఇచ్చారు. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు.  ప్రజలు సూచించిన పేరునే పార్టీకి పెడుతామన్నారు. తెలంగాణ సాధికారిత సాధించాలంటే మెరుగైన, నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం ప్రజలకు అందాలని అన్నారు. తెలంగాణ లో తల్లితండ్రులు పిల్లల చదువుకోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా ఉండే పరిస్థితి రావాలన్నారు. ఉద్యోగాలు, స్కిల్, భద్రత మూడింటిలో దేనికి ప్రాధాన్యం ఇస్తారని ప్రశ్నించగా... యువతకు ఉద్యోగాలు కల్పించటమే తన ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు.  ఉద్యోగాలతో పాటు వారికి భద్రత కూడా కల్పించాలన్నారు.  సామాజిక న్యాయం కోసం జాగృతి పోరాటం కొనసాగుతుందన్నారు. క్రమంగా జాగృతిని చాలా బలంగా తయారు చేస్తామని చెప్పారు. త్వరలోనే జాగృతి మెంబర్ షిప్ డ్రైవ్ కూడా ప్రారంభిస్తామన్నారు. అదే విధంగా మేము వేసిన కమిటీల్లో ఇప్పటికే అన్ని వర్గాలకు అవకాశం ఇచ్చామని చెప్పారు.  కాంగ్రెస్ పాలన పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి రేవంత్ రెడ్డి పరిపాలన గురించి పలువురు నెటిజన్లు కవిత ను ప్రశ్నలు అడిగారు. రేవంత్ పాలన ఎలా ఉందన్న ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకపోవటంతో లక్షలాది మంది విద్యార్థులు చదువులకు దూరం కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రభుత్వం నిర్లక్ష్యం ఆడపిల్లల చదువుకు మరణశాసనంగా మారిందన్నారు. ఇక రైతుల ఆత్మహత్యలు చాలా బాధకరమని చెప్పారు. కాంగ్రెస్ వచ్చాక వరుసగా రైతుల ఆత్మహత్యలు కొనసాగటం బాధకరమన్నారు. ప్రభుత్వం చేతగాని, నిర్లక్ష్య వైఖరిని ఇది నిదర్శనమని చెప్పారు. ఇక ఫార్మా సిటీ కోసం తీసుకున్న భూముల్లో ఫ్యూచర్ సిటీ అంటూ హడావుడి చేయటంపై మండిపడ్డారు.  తర్వలోనే అక్కడి రైతులకు మద్దతుగా పోరాటం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ వచ్చాక సింగరేణి సంస్థను తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎంఎస్ తో కలిసి సింగరేణి కోసం ప్రభుత్వం పై పోరాటం చేస్తామన్నారు. హైదరాబాద్ లో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవటంపై కవిత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెస్ట్ సిటీ పై పెట్టిన శ్రద్ధ, ఈస్ట్ సిటీ ని సిటీ అభివృద్ది చేయటంలో పెట్టలేదన్నారు. చిరంజీవి అభిమానిని.. కవిత వ్యక్తిగత అభిరుచులకు సంబంధించి పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. రామ్ చరణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలని అడగగా...చాలా హంబుల్ గా ఉండే వ్యక్తి. మంచి డ్యాన్సర్ అన్నారు. ఐతే తాను చిరంజీవి అభిమానిని అని...చిరంజీవి తర్వాతే రామ్ చరణ్ అన్నారు.  చిన్నప్పుడు ఎర్రమంజిల్ లో గడిపిన క్షణాలు తనకు చాలా సంతోషానిచ్చాయని అన్నారు. ఐతే రాజకీయాలు కాకుండా ఏదైనా బిజినెస్ పై దృష్టి పెట్టాలంటూ ఓ నెటిజన్ సూచించగా... అందుకు కవిత కూల్ గా అన్సర్ చేశారు. సోషల్ మీడియాలో ఇలాంటి చాలా నెగిటివీ ఉంటుందని దాన్ని పట్టించుకోకుండా మంచిగా ఆలోచించాలని సూచించారు.  ట్విట్టర్ ట్రెండింగ్ లో టాప్ ఆస్క్ కవిత ఇంటరాక్షన్  గంటన్నర పాటు సాగింది. వందలాది మంది ట్విట్టర్ (ఎక్స్) లో ప్రశ్నలు అడిగారు .. కవిత వారికి సమాధానాలు ఇచ్చారు. సోమవారం  ట్విట్టర్ (ఎక్స్) పాలిటిక్స్ విభాగంలో ఈ ఇంటరాక్షన్ నంబర్ వన్ గా నిలిచింది.

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందే నియోజకవర్గాల పునర్విభజన!

దేశంలో నియోజకవర్గాల పునర్విభజన పక్కాగా ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. అది కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. డీ లిమిటేషన్ తరువాతనే సార్వత్రిక ఎన్నికలు ఉంటాయన్న మాట.  తనను కలిసిన పలు రాష్ట్రాలఎంపీలతో  అమిత్ షా ఈ విషయం చెప్పారు.   జనగణన నిర్దేశిత సమయానికే పూర్తవుతుందని అమిత్ షా అన్నారు.   జనగణనకు కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిదే.  ఈ జనగణన రెండు దశలలో పూర్తి కానుంది.  ఇలా ఉండగా నియోజకవర్గాల పునర్విభజనపై ఇప్పటికే కసరత్తు ప్రారంభమైందని అధికార వర్గాలు చెబుతున్నాయి.  డీలిమిటేషన్‍లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లతోపాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక పోతే 2027 నాటికి  జనాభా లెక్కల సేకరణ పూర్త వుతుందనీ, ఆ వెంటనే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మొదలౌతుందనీ అమిత్ షా క్లారిటీ ఇచ్చారు.