వైసీపీ సినిమా అయిపోయింది.. బెట్టింగ్ రాయుళ్లే తేల్చేశారు!

గ‌తం కంటే ఎక్కువ స్థానాల్లో విజ‌యం సాధించ‌బోతున్నామంటూ ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల ఐప్యాక్ బృందంతో స‌మావేశ‌మైన స‌మ‌యంలో  ధీమా వ్య‌క్తం చేశారు. వైసీపీ ముఖ్య నేత‌లు సైతం 150 నుంచి 160 స్థానాల్లో విజ‌యం సాధించ‌బోతున్నామ‌ని చెప్పుకుంటూ వ‌స్తున్నారు. కానీ ఓటింగ్ జ‌రిగిన తీరు చూసిన సామాన్య ప్ర‌జ‌ల‌కు సైతం వైసీపీ అధినేత సహా ముఖ్య నేతలు అబద్ధం చెబుతున్నారన్న విషయం స్పష్టంగా అర్ధమైపోయింది.   వైసీపీ నేత‌లు   తామే అధికారంలోకి వస్తున్నామ‌ని చెబుతుండ‌టం  జనాలను విస్మయానికి గురి చేస్తోంది. జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లు చెబుతున్న మాట‌ల‌ను ఆ పార్టీ శ్రేణులే విశ్వసించని పరిస్థితి కనిపిస్తోంది. సరే అవన్నీ పక్కన పెడితే..   బెట్టింగ్ రాయుళ్లు సైతం వైసీపీ ఓట‌మిపైనే   పందేలు కాస్తున్నారు. కూట‌మి విజ‌యం ఖాయ‌మ‌ని, 120 నుంచి 150 స్థానాల్లో కూట‌మి అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తార‌ని జోరుగా బెట్టింగ్ లు కాస్తున్నారు. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యంపై జోరుగా బెట్టింగ్‌లు జ‌రిగాయి.. కానీ, ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో వైసీపీ ఓడిపోతుంద‌న్న దానిపైనే బెట్టింగులు విపరీతంగా ఉన్నాయి. 

ఏపీలో ఈనెల 13న అసెంబ్లీ, పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఫ‌లితాలు జూన్ 4న వెల్ల‌డికానున్నాయి.  ఏపీ వ్యాప్తంగా 81.86 శాతం పోలింగ్ న‌మోదైంది. గ‌తంలో ఎప్పుడూ ఈ స్థాయిలో పోలింగ్ న‌మోదు కాలేద‌ని అధికారులు చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఇప్పటి వరకూ జరిగిన నాలుగు విడతలనూ తీసుకుంటే దేశంలోనే ఏపీలో అత్యధిక పోలింగ్ నమోదైంది. సాధారణంగా పోలింగ్ అత్యధికంగా జరగడమంటే అది కచ్చితంగా ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకతనే సూచిస్తుందని రాజకీయపండితులు కచ్చితంగా చెబుతున్నారు. ప్రభుత్వ సానుకూలత ఉంటే పోలింగ్ శాతం ఈ స్థాయిలో ఉండదని అంటున్నారు.  గ‌త ఎన్నిక‌ల్లో దాదాపు 79శాతం ఓటింగ్ న‌మోదైంది. అప్ప‌టి టీడీపీ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌తకు తోడు, వివేకానంద రెడ్డి హ‌త్య, జ‌గ‌న్ పై కోడిక‌త్తి దాడి ఘ‌ట‌న‌ల‌తో ఓటర్లు సానుభూతితో జ‌గ‌న్ పార్టీకి పెద్ద సంఖ్య‌లో ఓట్లు వేశారు. గ‌త ఎన్నిక‌ల్లో భారీ సంఖ్య‌లో న‌మోదైన ఓటింగ్ ప్ర‌తిప‌క్ష వైసీపీకి క‌లిసొచ్చింది.  ప్ర‌స్తుతం ఏపీలో భారీగా న‌మోదైన ఓటింగ్ ప్ర‌తిప‌క్ష పార్టీ తెలుగుదేశం కూట‌మికి క‌లిసొస్తుంద‌ని అందుకే వైసీపీ ఓటమి తథ్యమంటూ పెద్ద ఎత్తున బెట్టింగ్ సాగుతోందని అంటున్నారు. దీనికితోడు గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా కూట‌మిని గెలిపించేందుకు హైద‌రాబాద్‌, బెంగ‌ళూరుతో, తమిళనాడు సహా పలు ఇతర రాష్ట్రాలు, విదేశాలలో ఉంటున్న ఏపీ ఓటర్లు కూడా స్వస్థలాలకు తరలి వచ్చి కసితో ఓటు వేశారు.  ఇది ప్రభుత్వ వ్యతిరేకతనే సూచిస్తోందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  

 వైసీపీ ప్ర‌భుత్వం మ‌రోసారి అధికారంలోకి రాబోతోంది. జూన్ 9న విశాఖ‌లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్నారు. సంబ‌రాల‌కు అంతా సిద్ధంగా ఉండండి అంటూ తాజాగా వైసీపీ ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు దర్శనమిచ్చింది. అయితే  వైసీపీ గెలుపు ఖాయ‌మ‌ని స్వయంగా సీఎం సహా ఆ పార్టీ నేతలు ఎంతగా బాకా ఊదుకుంటున్నా.. కూటమిదే గెలుపు అంటూ భారీగా బెట్టింగులు జరుగుతుండటం.. ఇలా కూటమికి అనుకూలంగా బెట్టింగులు కాస్తున్న వారిలో వైసీపీ నేతలూ కార్యకర్తలూ కూడా ఉండటం  గ‌మ‌నార్హం.  

అన్నిటికీ మించి  భారీ స్థాయిలో జరిగే ఈ ఆన్ లైన్ బెట్టింగ్ లో రోజు రోజుకూ వైసీపీకి వచ్చే సంఖ్య చిన్నదైపోతోంది. వైసీపీ అధినేత జగన్ భాషలో చెప్పాలంటే ఆయన చెప్పినట్లు టాల్ నంబర్లలో కాకుండా షార్ట్ నంబర్లలో వైసీపీ గెలుచుకునే స్థానాలు ఉంటాయన్న మాట.  పోలింగ్  రోజు వైసీపీకి 80 నుంచి 90 స్థానాలు రావ‌చ్చున‌ని ఆన్‌లైన్ సైట్‌లో అంచ‌నా వేశారు.  ఎన్నిక‌లు పూర్త‌యిన త‌రువాత ఆ స్థానాల సంఖ్య 70కి త‌గ్గింది. జ‌గ‌న్ ఐప్యాక్ సభ్యులతో సమావేశమై టాల్ నంబర్స్ లో విజయం సాధిస్తున్నామని చెప్పిన తరువాత ఆన్ లైన్ సైట్ బెట్టింగులలో వైసీపీ స్థానాల సంఖ్య    60 నుంచి 65కి తగ్గిపోయింది.  ఆన్‌లైన్ ద్వారా బెట్టింగ్ న‌డిపే సైట్ల‌లో ఒక్క తెలుగుదేశం పార్టీకే 91 నుంచి 94 సీట్లు వ‌స్తాయ‌ని, పెద్ద ఎత్తున పందాలు నడుస్తున్నాయి.  రోజులు గడిచే కొద్దీ ఆ సంఖ్య పెరుగుతోంది.  

సత్తాబజార్ అనే ఆన్‌లైన్‌ బెట్టింగ్ వెబ్ సైట్‌లో వైసీపీకి 65 నుంచి 68 అని ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి  సొంతంగా 91 నుంచి 94 స్థానాలు వస్తాయని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో   వైసీపీకి 30 లోపు సీట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌ని ప‌లువురు   జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. మొత్తానికి బెట్టింగ్ న‌డిపే సంస్థ‌లు, పందేలు కాసేవారితోపాటు ప్ర‌తీఒక్క‌రూ కూట‌మి అధికారంలోకి రాబోతున్నద‌ని స్ప‌ష్టంగా చెబుతున్నారు. ఇక  వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆ పార్టీ ముఖ్య‌నేత‌లు మరోసారి మనదే అధికారం అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడానికి  కౌంటింగ్ రోజు నాటికి కనీసం ఏజెంట్లనైనా నిలుపుకోవాలన్న తాపత్రేయమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మొత్తానికి జగన్ ఐదేళ్ల అరాచక, దోపిడీ పాలనకు ఓటర్లు   చరమగీతం పాడినట్లు బెట్టింగుల సరళిని బట్టి స్పష్టమవుతోంది.