బాబు విజ్ణత, స్థిత ప్రజ్ణతా కేసీఆర్ లో ఎక్కడుంది?
posted on Dec 5, 2023 @ 2:09PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి గురువారం (డిసెంబర్ 7) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొమ్మిదిన్నరేళ్ళుగా అధికారం అనుభవించిన బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవ్వడంతో కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. అయితే ఆయన ఇటు జనానికీ, అటు పార్టీ నేతలకూ కూడా కనిపించకుండా రాజీనామా లేఖను తన ఓఎస్డీ ద్వారా గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ కి పంపి ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. భద్రతను కూడా పక్కనపెట్టేసి తన సొంత వాహనంలోనే కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. ఈ సమయంలో కేసీఆర్ వాహనం వెంట మరొక వాహనం మాత్రమే ఉందని తెలుస్తోంది. కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్ళాక అదే రోజు రాత్రికి కొంతమంది బీఆర్ఎస్ నేతలు అక్కడకు వెళ్లగా.. మరుసటి రోజు ఉదయం గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు అక్కడకి వెళ్లారు.
ఇదంతా ఎందుకంటే ఆయన ఓటమిని అంగీకరించి, హుందాగా కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపి, పద్ధతి ప్రకారం తన రాజీనామాను స్వయంగా స్పీకర్ కు అందజేసి ఉంటే.. ఆయన ఫామ్ హౌస్ కు వెళ్లిపోవడం గురించి అసలు చర్చే ఉండేది కాదు. అయితే ఆయన ప్రజలకు, పార్టీ నేతలకు ముఖం చాటేసిన తీరు ఓటమిని అంగీకరించలేక పారిపోయినట్లుగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే పార్టీ పరాజయం పాలైన వెంటనే కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లడంపై రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ఓడిన వెంటనే కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అవుతారని ప్రతిపక్షాలు ఇన్నాళ్లు విమర్శలు చేసాయి. అలాగే ఓడితే రెస్ట్ తీసుకుంటానని సాక్షాత్తు కేసీఆర్ స్వయంగా ఎన్నికల ప్రచారంలో పలుమార్లు ప్రజలకే చెప్పారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇకపై ఫామ్ హౌస్ కి పరిమితమై రాజకీయాలను నడిపిస్తారా అనే చర్చ జరుగుతుంది. గతంలో కేసీఆర్ ఎప్పుడూ ఫామ్ హౌస్ కి వెళ్లినా ఆర్భాటంగానే వెళ్లేవారు. కానీ ఇప్పుడు కనీసం మొహం చూపించకుండా.. ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్వంత వాహనంలో తన ఫామ్ హౌస్ కు వెళ్లారు.
కేసీఆర్ ఓటమి అనంతరం ఫామ్ హౌస్ కి వెళ్లడంతో ఇప్పుడు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలుగా పనిచేసిన వారు ఓడిన సందర్భంలో ఎలా స్పందించారు. ఇప్పుడు కేసీఆర్ ఓడిన అనంతరం ఎలా ప్రవర్తించారు అన్నది పోల్చి నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గత ఎన్నికలలో ఏపీలో ఓటమి అనంతరం ఎంత హుందాగా స్పందించారన్న విషయాన్ని నెటిజనులు ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో గెలిచినా.. ఓడినా ముందు ప్రజల ముందుకొచ్చి కృతజ్ణతలు చెప్పేవారు. అలాగే ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు ప్రకటించి.. తమ తప్పులను సరిదిద్దుకొని మళ్ళీ ప్రజల మధ్యకి వస్తామని చెప్పేవారు. ముఖ్యంగా ప్రజల కోసం మరింత కస్టపడి పనిచేస్తామని హామీ ఇచ్చేవారు. 2019లో తెలుగుదేశం పరాజయం తరువాత చంద్రబాబు ఎక్కడా తొణకకుండా మీడియా ముందుకొచ్చి స్పందించారు. ప్రజల కోసం మరింత కసిగా పనిచేస్తామని వెల్లడించారు. అలాగేే చేశారు. ఇప్పుడు ఏపీ ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు.
కానీ తాజాగా కేసీఆర్ కనీసం పూర్తిస్థాయి ఫలితాలు రాకముందే, తన ఓటమి ఖరారవగానే ఎవరికీ కనిపించకుండా మొహం చాటేశారు. కనీసం తనను ఎమ్మెల్యేగా గెలిపించిన గజ్వేల్ ప్రజలకు కూడా కృతజ్ఞతలు చెప్పాలని భావించలేదు. దీంతో ఇదే ఆ చంద్రబాబుకు, ఈ చంద్రశేఖరుడికి తేడా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. బాబు విజ్ణత, స్థిత ప్రజ్ణతను నెటిజనులు వేనోళ్ల పొగుడుతున్నారు. అసలు సిసలైన ప్రజా నేతకి ప్రజల తీర్పుపై గౌరవం ఉండాలి.. ప్రజల నిర్ణయానికి అనుగుణంగా ప్రజల కోసం పనిచేసి మళ్ళీ ప్రజల మెప్పు పొందాలి. చంద్రబాబు అటువంటి నేత అని నెటిజనులు ప్రస్తుతిస్తున్నారు. అదే సమయంలో అధికారమే పరమావధిగా రాజకీయాలను అవసరానికి ఉపయోగించుకొనే కేసీఆర్ లాంటి నేతలు.. అవసరం తీరి అధికారం కోల్పోయాక ప్రజలకు మొహం చాటేయడం పెద్ద వింతేమీ కాదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ అధికారం కోసమే పని చేశారని, అందుకే అధికారం పొందాక తెలంగాణ ఉద్యమంలో తనతో పాటు అడుగులు వేసిన వారందరినీ పక్కకు పెట్టేసి.. తెలంగాణ సాధన క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకుని ఆయన ఒక్కరే అధికారాన్ని అనుభవించారని సోదాహరణగా చెబుతున్నారు.