బీఆర్ఎస్ లో ముసలం? పార్టీ శాసనసభాపక్ష నేత ఎంపికపై ప్రతిష్ఠంభన
posted on Dec 5, 2023 @ 5:00PM
బీఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టిందా? అది పార్టీ అస్థిత్వాన్ని దెబ్బతీసే స్థాయికి చేరిందా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. అధికారంలో ఉండగా ప్రత్యర్థి పార్టీలను నిర్వీర్యం చేయడానికి కేసీఆర్ పన్నిన వ్యూహాలు, వేసిన ఎత్తుగడలు ఇప్పుడు ఆయనకే ఎదురు తిరుగుతున్నాయనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకూ పార్టీలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన కేసీఆర్ ను ఇప్పుడు ఆయన పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలే లెక్క చేయని పరిస్థితి కనిపిస్తోంది.
బీఆర్ఎస్.. నిన్న మొన్నటి వరకూ ఆ పార్టీలో కేసీఆర్ మాటే శాసనం. భిన్నాభిప్రాయానికీ, బేధాభిప్రా యానికీ తావే లేదు. అంతే కాదు ఎవరైనా భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినా, సొంత అభిప్రాయాన్ని వెల్లడించినా వారెంతటి వారైనా సరే పార్టీ బహిష్కరణే ఏకైక పర్యవశానం అన్నట్లుగా ఉండేది పరిస్థితి. సమష్టి నిర్ణయం, చర్చలు వంటి వాతావరణమే బీఆర్ఎస్ లో గత తొమ్మిదేళ్లుగా కనిపించలేదు. పార్టీ తరఫునైనా, ప్రభుత్వం తరఫునైనా మీడియా ముందుకు వచ్చి అయితే కేసీఆర్ లేదా కేటీఆర్, హరీష్ రావు మాత్రమే మాట్లాడాలి అన్నట్లుగా పరిస్థితి ఉండేది. కానీ ఒక్క ఓటమితో పరిస్థతి పూర్తిగా మారిపోయింది.
తాజా ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలై అధికారాన్ని కోల్పోయింది. అంతే పార్టీలో ఇంత కాలం కనిపించిన విధేయత, విశ్వాసం అంతా నేతి బీరకాయలో నేతి చందమేనని తేటతెల్లమైపోయింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున తాజా ఎన్నికలలో 39 మంది విజయం సాధించారు. కానీ వారిలో పలువురు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. అసెంబ్లీ ఫలితాలు వెలువడి మూడు రోజులు కాలేదు.. అప్పుడే పార్టీలో అసమ్మతి గళాల స్వరం గట్టిగా వినిపిస్తున్నది. ఫలితాలు వెలువడిన గంటల వ్యవధిలోనే పలువురు ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్న సంకేతాలు కనిపించాయి. ఇలా ఫలితాలు వెలువడ్డాయో లేదో అలా భద్రాద్రి నుంచి బీఆర్ఎస్ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పక్కన కనిపించారు. ఇక మంగళవారం (డిసెంబర్ 5) నాటికి పలువురు ఎమ్మెల్యేలు కారు దిగి.. చేయి అందుకోవడానికి రెడీ అయిపోయినట్లుగా జోరుగా ప్రచారమౌతోంది. బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఎంపిక విషయంలో ఏర్పడిన ప్రతిష్ఠంభన ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా ఉంది. ఏది ఏమైనా అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తానే, అంతా తానే అన్నట్లుగా కనిపించిన కేసీఆర్ ఇప్పుడు అసమ్మతి సెగలతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. బీఆర్ఎస్ శాసన సభాపక్ష నేతగా కేసీఆర్ ను పలువురు ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు.
కేసీఆర్ లేదా కేటీఆర్ ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవడానికి తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేలలో దాదాపు సగం మంది వ్యతిరేకించినట్లు విశ్వసనీయ సమాచారం. మెజారిటీ ఎమ్మెల్యేలు హరీష్ రావుకే శాసనసభా పక్ష నాయకుడిగా అవకాశం ఇవ్వాలని అంటున్నారు. దీంతో బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత ఎన్నికలో ప్రతిష్ఠంభన ఏర్పడిందంటున్నారు. కేసీఆర్ నాయకత్వం పట్ల గతంలో ఉన్న విశ్వాసం, నమ్మకం, విధేయత మచ్చుకైనా కనిపించడం లేదనడానికి దీనికి తార్కానంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. .
ఇందుకు బీఆర్ఎస్ శాసన సభాపక్ష నేత ఎంపిక విషయంలో ఏర్పడిన గందరగోళమే నిదర్శనం. ఈ పరిస్థితుల్లో రాజీ యత్నంగా కడియం శ్రీహరి పేరు తెరపైకి వచ్చిందని పరిశీలకులు చెబుతున్నారు. పార్టీపై కేసీఆర్ పట్టు కోల్పోయారనడానికి ఇదే నిదర్శనమని చెబుతున్నారు. మరో వైపు కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే బీఆర్ఎస్ నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యేలలో కనీసం 12 మంది కారు దిగి చేయందుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. అలా కారును వీడే వారిలో హైదరాబాద్, ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఎక్కువ మంది ఉన్నారని కూడా అంటున్నారు. అలాగే ఖమ్మం ఎంపీ నాగేశ్వరరావు కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరుందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. గతంలో తాను ప్రత్యర్థి పార్టీలను నిర్వీర్యం చేయడానికి సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగిస్తే.. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగానే శృంఖరాలు తెంచుకుని బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేసేందుకు సిద్ధపడుతున్న పరిస్థితి ఏర్పడడం కొసమెరుపు.