కాక మీదున్న కేసీఆర్... తెలంగాణకు రావాల్సిన కనీస నిధులను అందించని కేంద్రం

తెలంగాణ ఏర్పడిన తరువాత ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్ర ప్రదేశ్ లో కలుపుతూ మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కేంద్రం పై మండిపడుతూ.. నిరసనగా బంద్ కు పిలుపునిచ్చారు కేసీఆర్. ఆ తరువాత బిజెపికి, టీఆర్ఎస్ కి మధ్య క్రమంగా సఖ్యత పెరుగుతూ వచ్చింది. నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి కీలక నిర్ణయాల విషయంలో కేసీఆర్ మోదీకి మద్దతు పలికారు. ఇంకా చెప్పాలంటే ఒకడుగు ముందుకేసి నోట్ల రద్దు సమయంలో రాష్ట్రంలో మొదటిగా స్పందించిన వ్యక్తి కేసీఆర్. ఇక రాష్ట్రపతి ఎన్నికల్లోనూ అనేక సవరణ బిల్లులు తీసుకొచ్చినప్పుడు టిఆర్ఎస్, బిజెపి వైపునే నిలబడింది. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టీఆర్ఎస్ వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చాయి. ఈ సెకెండ్ టర్మ్ లో మాత్రం రెండు పార్టీల మధ్య కొంత గ్యాప్ కనబడుతుందనే చెప్పాలి. రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రం ఎలాంటి సహాయ సహకారాలను అందించడం లేదని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. పదేపదే తెలంగాణ సమస్యల పై కేంద్ర మంత్రులను కలుస్తున్నా వారు పెడచెవిన పెడుతున్నారని వినిపిస్తుంది. రాష్ర్టానికి హక్కుగా రావాల్సిన నిధులు..పరిశ్రమల విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారనేది టీఆర్ఎస్ నేతల ఆరోపణ.

ఇక ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటన విడుదల చేస్తూ తెలంగాణకు రావాల్సిన నిధుల్లో ఎంత మేరకు కత్తిరింపులు జరిగిందో పేర్కొన్నారు. ఆర్థిక మాన్యం లేదంటూ కేంద్రం అబద్ధాలు చెబుతోందంటూ మండిపడ్డారు. తెలంగాణకు రావలసిన నిధులను మంజూరు చేయండి లేదా ఆర్థికమాన్యం ఉందని ఒప్పుకోండి అంటూ కేంద్రాన్ని నిలదీశారు. రేపు జరుగుతున్న క్యాబినెట్ లో కూడా కేంద్రం వైఖరిపై చర్చించబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు ఇతర నిధులపై సమగ్ర నివేదిక తయారు చేయాల్సిందిగా ఆర్థిక శాఖను ఆదేశించారు సీఎం. మరోవైపు క్యాబినెట్ సమావేశం తర్వాత రెండు 2,3 రోజుల్లో ఆయన ఢిల్లీ వెళ్లి మోదీని కలిసే అవకాశం ఉంది. మొత్తం మీద కేంద్రం వైఖరి పై సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు తెలంగాణలో పథకాలు బాగున్నాయని మెచ్చుకుంటున్నారు, తెలంగాణలోని సంక్షేమ పథకాలను బిజెపి పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు, తెలంగాణ చేస్తున్న విజ్ఞప్తులను మాత్రం పక్కన పెడుతున్నారు. ఈ ధోరణిపై ఖచ్చితంగా నిరసన తెలపాలని కెసిఆర్ భావిస్తున్నారు. కేంద్రం వైఖరి ఇలాగే కొనసాగితే రావలసిన నిధుల కోసం పోరాటానికి కూడా దిగాలని ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. ఇక పై మోదీ సర్కారుపై మెతక వైఖరి వేడి తాడోపేడో తేల్చుకోపోతోంది కేసీఆర్ సర్కార్.

Teluguone gnews banner