బై బై బాబు.. టిడిపి నుండి బయటపడటానికి నేతల వ్యూహాలు..బీజేపీలోకేనా ??

 

జంప్ అవ్వడం లేటవ్వచ్చేమో కానీ జంపింగ్ మాత్రం పక్కా అనే నినాదంతో ముందుకెళ్తున్నారు టిడిపి ఎమ్మెల్యేలు. అయితే ఆ జంప్ ఎటు చెయ్యాలన్నది తేల్చుకోలేక టిడిపి ఎమ్మెల్యేలు సతమతమైపోతున్నారు. మొదట బీజేపీలో చేరబోతున్నారని విపరీతంగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత మళ్లీ వైసిపిలో చేరుతున్నట్లు ప్రచారం మొదలైంది. ఇప్పుడు కొంత మంది ఎమ్మెల్యేలు మళ్ళీ బిజెపి వైపు చూస్తున్నారని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కొంత మంది ఎమ్మెల్యేలతో త్వరలోనే బిజెపి కండువా కప్పు కుంటారని విపరీతంగా ప్రచారం జరుగుతోంది.గంటా శ్రీనివాసరావు కూడా తాను పార్టీ మారట్లేదని చెప్పినప్పటికీ కుడా తెర వెనుక మాత్రం ఆయన బిజెపి నేతలతో మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన బిజెపి ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ ల ద్వారా బిజెపి అగ్ర నేత రామ్ మాధవ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మధ్యే దుబాయిలో జరిగిన సీఎం రమేష్ కుమారుడి ఎంగేజ్ మెంట్ లోను వీరు బిజెపి నేతలతో చర్చించినట్టుగా ప్రచారం జరిగింది.

బిజెపి ఏపీలో పాగా వేసేందుకు మరియు పార్టీని బలోపేతం చేసేందుకు విపరీతమైన ప్రయత్నాలలో భాగంగా ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే గంటా ఇంకో పార్టీలోకి చేరడానికి రాజీనామా చేసి రావాలనే కండిషన్ లేకుండా చూడాలని కోరుతున్నారట. ఒకవేళ రిజైన్ చేసి ఎన్నికలకు వెళితే మళ్లీ గెలుస్తామో లేదో అన్న డౌట్ తో జాగ్రత్త పడుతున్నారు.గంటాకి రూట్ క్లియర్ అయితే ఆయన టిడిపిలోని ఐదుగురు ఎమ్మెల్యేలను కమలం గూటికి చేరుస్తానని చెప్తున్నారు. ఇక ఇప్పటికే వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జోరుగా జరిగినా.... ఆయన టిడిపి ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, కరణం బలరాం మరియు ఏలూరి సాంబశివరావులతో కలిసి ఆలోచన మార్చుకున్నట్టుగా ప్రచారం జరగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసిపిలోకి వెళ్లే కన్నా బిజెపిలోకి వెళితేనే ప్రయోజనముంటుందని భావిస్తున్నారు.వైసిపిలో ఇప్పటికే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ విషయంలోనైనా సరే వారికే ప్రయారిటీ ఉంటుంది తప్ప తమను పెద్దగా పట్టించుకోకపోవచ్చు అని అనుకుంటున్నారు. గ్రానైట్ క్వారీల మీద ఈ మధ్య విజిలెన్స్ దాడులు జరుగుతూండటంతో.... గొట్టిపాటి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఆయన కూడా ఈ మధ్య పార్టీ లోని పరిస్థితులను చూసి మనసు మార్చుకున్నారు. కేవలం వ్యాపారం కోసమైతే బీజేపీలో చేరిన కూడా రక్షణ ఉంటుందని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో తన జోలికొచ్చే సాహసం బహుశా వైసిపి చెయ్యదని అనుకుంటున్నారు. ఇక అదే జిల్లాకు చెందిన కరణం బలరాం కూడా వైసిపిలో తాను ఇమడలేనని భావిస్తున్నారు. తనకు బిజెపి అయితే మంచి ప్రాధాన్యత ఉంటుంది అని సన్నిహితులతో చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆ గంటా, గణబాబు చేరితే 2 బలమైన సామాజిక వర్గాలతో పార్టీ మరింత పటిష్టమవుతుందని బిజెపి నేతలు భావిస్తున్నారు. అన్ని కుదిరితే అతి త్వరలోనే తెలుగు తమ్ముళ్లు సైకిల్ దిగి కమలం కండువా కప్పుకోబోతున్నారు.

Teluguone gnews banner