ఏపీ అసెంబ్లీని కుదిపేస్తున్న 2430... బాబుపై మరోసారి జగన్ తీవ్ర వ్యాఖ్యలు
posted on Dec 12, 2019 @ 10:06AM
2430 జీవో ద్వారా జగన్ ప్రభుత్వం మీడియాకి సంకెళ్లు వేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మీడియాను అసెంబ్లీకి రానీయకుండా ఆంక్షలు విధించడం అన్యాయమని, ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. అసెంబ్లీ సమావేశాల కవరేజ్ విషయంలో కొన్ని ఛానళ్లపై ఎందుకు ఆంక్షలు విధించారని చంద్రబాబు ప్రశ్నించారు. జీవో 2430ను రద్దు చేయాలంటూ నిరసన చేపట్టిన టీడీపీ సభ్యులు.... సచివాలయం ఫైర్ స్టేషన్ దగ్గర నోటికి, చేతులకు, కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకొని ఆందోళన నిర్వహించారు. 2430 జీవో తీసుకొచ్చి మీడియాను బెదిరించడం సరికాదని... ఆంక్షలను ఎత్తివేసేవరకు తమ పోరాటం కొనసాగుతుందని చంద్రబాబు అన్నారు. అనంతరం అసెంబ్లీలోనూ జీవో 2430పై తెలుగుదేశం ఆందోళనకు దిగింది. వెంటనే ఆ జీవోను రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. దాంతో, అధికార-ప్రతిపక్షాల మధ్య జీవో 2430పై తీవ్ర వాగ్యుద్ధం జరిగింది.
జీవో 2430పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. అసలు జీవోను చంద్రబాబు పూర్తిగా చదవారా? లేదా? అంటూ ప్రశ్నించారు. ఇంగ్లీష్ అర్ధంకాక ఇలా మాట్లాడుతున్నారా అంటూ ఎద్దేవా చేశారు. 2430 జీవోను సభలో చదివి వినిపించిన సీఎం జగన్.... నిరాధార వార్తలు రాసిన వారిపై ఫిర్యాదు చేసే అధికారాన్ని.... సంబంధిత శాఖలకు ఇచ్చామన్నారు. అసలు జీవోను తప్పుబట్టేందుకు అవకాశమే లేదన్నారు. అయినా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కనీసం ఇంగిత జ్ఞానం లేదని, అందుకే ఇలా మాట్లాడుతున్నారంటూ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు జగన్. దాంతో, సభలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు.