ఆరునూరైనా ఆర్టీసీ విలీనం జరగదు... యుద్ధప్రాతిపదికన కొత్త నియామకాలు
posted on Oct 7, 2019 @ 11:03AM
ఆరునూరైనాసరే ఆర్టీసీని మాత్రం ప్రభుత్వంలో విలీనంచేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆర్టీసీ సమ్మెపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన కేసీఆర్... ఆర్టీసీ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్టు చెప్పారు. ఆర్టీసీని లాభాల్లోకి రావాలన్నా, సంస్థ మనుగడ కొనసాగాలన్నా, కొన్ని కఠిన చర్యలు తప్పవని అన్నారు. రెండు మూడేళ్లలోనే సంస్థ నష్టాలను ఊడ్చుకుని ఆర్టీసీ లాభాల్లోకి వస్తుందన్నారు.
ఇక, ప్రభుత్వం విధించిన గడువులోగా విధుల్లోకి చేరని వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టంచేశారు. ఇక ఆర్టీసీలో మిగిలింది కేవలం 1200మంది లోపే సిబ్బంది అన్నారు. ఏటా 12వందల కోట్ల నష్టం... 5వేల కోట్ల రుణభారంతో... ఆర్టీసీ నడుస్తుంటే, పండుగల సీజన్లో సమ్మెకు దిగడం చట్టవిరుద్ధమని కేసీఆర్ అన్నారు. ఆర్టీసీ కార్మికులు చేసింది తీవ్రమైన తప్పిదమన్న కేసీఆర్.... రాజీ సమస్యే లేదని అన్నారు. ఇక వారితో ఎలాంటి చర్చలు జరిపేది లేదని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. ఇక, భవిష్యత్ లో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా... క్రమశిక్షణా రాహిత్యం, బ్లాక్ మెయిల్ విధానం, తలనొప్పి కలిగించే చర్యల్లేని విధానం తీసుకొస్తుందని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా శాశ్వత ప్రత్యామ్నాయ రవాణా విధానానికి రూపకల్పన చేయాలని కేసీఆర్ సూచించారు. తక్షణ చర్యగా 2వేల 500 బస్సులను అద్దె పద్ధతిలో తీసుకుని నడపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే 4వేల బస్సులను స్టేజ్ క్యారియర్లగా నడపాలని సూచించారు. మొత్తం 15 రోజుల్లో ఆర్టీసీని పూర్వస్థితికి తీసుకురావాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. మరోవైపు, యుద్ధప్రాతిపదికన కొత్త సిబ్బంది నియామకం చేపట్టాలని కేసీఆర్ ఆదేశించారు. కొత్తగా చేర్చుకునే సిబ్బంది ....యూనియన్లలో చేరమని ఒప్పంద పత్రం మీద సంతకం చేయించుకోవాలని కేసీఆర్ సూచించారు. కొత్త సిబ్బందిది షరతులతో కూడిన నియామకం అవుతుందని, అలాగే ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు.