ఫైబర్ నెట్‌పై సీఐడీ విచారణ.. లోకేశే టార్గెటా?
posted on Sep 14, 2021 @ 12:47PM
జగన్ సర్కారు టార్గెట్ ఒక్కటే. రెండేళ్లుగా ఒకటే లక్ష్యంతో పని చేస్తోంది. ఏపీలో ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తోంది. కేసులు, అరెస్టులతో టీడీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. అయినా, తెలుగు తమ్ముళ్లు అదరకుండా, బెదరకుండా వైసీపీ ప్రభుత్వ అరాచకాలు, అక్రమాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఇలాగైతే కుదరదనుకుందో ఏమో.. ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పైనా వల విసిరింది. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటూ చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేసినా.. అది అనుకున్న మేరకు వర్కవుట్ కాలేదు. దీంతో, నారా లోకేశ్‌కైనా పకడ్బందీగా కేసు ఉచ్చు బిగించాలని చూస్తోంది. ఏపీ ఫైబర్ నెట్ టెండర్లలో 121 కోట్ల మేర అవినీతి జరిగిందంటూ లోకేశ్ టార్గెట్‌గానే సీఐడీ విచారణ జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫైబర్ నెట్ టెండర్‌లో అవినీతి, అక్రమాలపై సీఐడీ విచారణ మొదలైంది. విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణ జరుగుతోంది. ఫైబర్ నెట్ మాజీ ఎం.డి సాంబశివరావు, ఎలువషన్ కమిటీ మెంబెర్ వేమూరి ప్రసాద్‌లు విచారణకు హాజరయ్యారు. మొదటి దశలో జరిగిన రూ.333 కోట్ల రూపాయల టెండర్లలో రూ.121 కోట్ల అక్రమలు జరిగాయంటూ ఈ నెల 9న సీఐడీ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 161 క్రింద నోటీసులు జారీ చేశారు.
ఫైబర్‌నెట్ టెండర్లలో రూ.121 కోట్ల మేర అవకతవకలు జరిగాయని ఏపీ ఫైబర్‌నెట్ చైర్మన్ పి.గౌతమ్‌రెడ్డి ఆరోపించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.321 కోట్ల విలువైన టెండర్‌ను తమకు కావాల్సిన టెరాసాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టేందుకు పలు అవకతవకలకు పాల్పడ్డారన్నారు. నాసిరకం పరికరాల సరఫరా, బిల్లుల్లేకుండా చెల్లింపులు, పరికరాల పరీక్షలో మార్పులు చేయడం వల్ల ప్రభుత్వానికి రూ.121 కోట్ల నష్టం జరిగిందన్నారు. అవకతవకలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశానని, ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించిందని, ఆ సంస్థపై పలు సెక్షన్ల కింద సీఐడీ కేసు నమోదుచేసి దర్యాప్తు సాగిస్తోందని చెప్పారు.
మరోవైపు, ఫైబర్‌నెట్‌లో అక్రమాలంటూ తప్పుడు కేసులు పెడుతున్నారంటూ టీడీపీ జాతీయ అధదికార ప్రతినిధి పట్టాభిరామ్ మండిపడ్డారు. ఏపీని ఫైబర్‌నెట్ రోల్ మోడల్ చేసిందని, కేంద్ర ప్రభుత్వం సైతం ఫైబర్‌నెట్‌ను ప్రశంసించిందని అన్నారు. ఒకే కనెక్షన్‌తో రూ.149కే మూడు రకాల సేవలు అందించే ఫైబర్ నెట్ ప్రాజెక్టు అని, దేశమంతా ఈ విధానాన్ని అవలంబించాలని ప్రధాని మోదీ అభినందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ప్రతిష్టాత్మక ఫైబర్ నెట్‌పై బురదజల్లే కార్యక్రమం జరుగుతోందని పట్టాభి ఫైర్ అయ్యారు. ఫైబర్ నెట్‌లో అవినీతి జరిగిందని చెప్పే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. అవినీతి జరిగిందంటున్న గౌతమ్‌రెడ్డి.. 121 కోట్లు కాదు కదా.. పైసా అవినీతిని కూడా నిరూపించలేకపోయారని పట్టాభి ఛాలెంజ్ చేశారు.